ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు రీ షెడ్యూల్ ?
ఏపీలో తొలి విడతలో భాగంగా మునిసిపోల్స్ ని ముందు పెట్టారు. అయితే అనుకున్న విధంగా షెడ్యూల్ కాకుండా సుప్రీంకోర్టు ఆదేశాల తరువాత రీ షెడ్యూల్ చేశారు.
By: Satya P | 23 Oct 2026 12:36 PM ISTఏపీలో తొలి విడతలో భాగంగా మునిసిపోల్స్ ని ముందు పెట్టారు. అయితే అనుకున్న విధంగా షెడ్యూల్ కాకుండా సుప్రీంకోర్టు ఆదేశాల తరువాత రీ షెడ్యూల్ చేశారు. దాంతో ఈ నెల 28న పోలింగ్ జరగాల్సిన మున్సిపల్ ఎన్నికలు నవంబర్ 1కి వాయిదా పడ్డాయి. అలాగే ఈ నెల 30న జరగాల్సిన కౌంటింగ్ నవంబర్ 3 కి మారింది. సరిగ్గా ఇక్కడే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలతో ఈ కౌంటింగ్ షెడ్యూల్ క్రాష్ అవుతోంది. ఒకే రోజున కౌంటింగ్ అలాగే పోలింగ్ అంటే ఏపీలో లా అండ్ ఆర్డర్ ని అదుపు చేయడంలో సమస్యలు వస్తాయని భావిస్తున్నారు.
నామినేషన్లలోనే హీట్ :
నిజానికి ఏ ఎన్నికలు అయినా పోలింగ్ రోజున చెదురు మదురు సంఘటనకు నమోదు కావడం అంతటా చూస్తారు. కానీ చిత్రంగా ఏపీలో నామినేషన్ల ఘట్టం నుంచే హీట్ పెరిగిపోయిన ఎన్నికలుగా లోకల్ బాడీస్ ఉన్నాయి. నామినేషన్లు దాఖలు చేయడమే అతి పెద్ద విజయంగా భావించే పరిస్థితి ఉంది. వర్గ పోరుతో పాటు పార్టీల మధ్య పోటీ, ఢీ అంటే ఢీ అనే నైజం, స్థానికంగా బలాబలాల ప్రదర్శనతో నామినేషన్ల పర్వం వేడెక్కిపోయింది. ఏకంగా సుప్రీం కోర్టు దాకా ఈ ఘర్షణలు వెళ్ళి మరో రెండు రోజుల పాటు గడువుని నామినేషన్లకు పొడిగించాల్సిన పరిస్థితి తొలి విడతలో ఏర్పడింది. దాంతో జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికల నామినేషన్ల పర్వం కూడా ఇదే తీరున సాగుతోంది. మరి నవంబర్ 3న ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు జరుగుతాయని షెడ్యూల్ రిలీజ్ చేశారు అదే రోజున మునిసిపల్ ఎన్నికల కౌంటింగ్ అంటే రెండు వైపులా పోలీసులను సర్దడం కష్టమన్న భావన ఉంది.
నవంబర్ 5కు మార్పు :
ఈ నేపథ్యంలో ఒక ప్రచారం అయితే జోరుగా సాగుతోంది. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు నవంబర్ 3న కాకుండా నవంబర్ 5న జరిగే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. అలా రీ షెడ్యూల్ చేస్తూ రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంటుందని కూడా ప్రచారం అయితే సాగుతోంది. పోలీస్ బందోబస్తు సర్దుబాటులో సమస్యల కారణంగానే ఈ నిర్ణయం తీసుకుంటారు అని అంటున్నారు. అయితే ఈ విషయంలో ఎస్ఈసీ నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.
అలా చేస్తేనే బెటర్ :
ఒకే రోజున అటు కౌంటింగ్ ఇటు పోలింగ్ కాకుండా వేరు వేరు తేదీలలో నిర్వహిస్తేనే బెటర్ అని అంటున్నారు. పోలీస్ వర్గాల నుంచి కూడా ఇదే రకమైన అభిప్రాయం వ్యక్తం అవుతోంది. పైగా ఎన్నికల సిబ్బంది కేటాయింపు సమస్యలు ఇబ్బందులు కూడా ఒకే రోజున రెండూ పెడితే వస్తాయని అంటున్నారు. దీని మీద ఒకటి రెండు రోజులలో ఎస్ ఈసీ కీలక నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.
