ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల షెడ్యూల్ మార్పు.. సవరించిన తేదీలు ఇవే!
రాష్ట్రంలో తుఫాన్ ప్రభావంతో ప్రభుత్వ యంత్రాంగం అంతా సహాయక చర్యల్లో మునిగిపోయింది. అయినప్పటికీ ఎన్నికల నిర్వహణపై ఎస్ఈసీ ఆధ్వర్యంలో బుధవారం సమీక్ష సమావేశం నిర్వహించారు.
By: Tupaki Political Desk | 28 Oct 2026 7:19 PM ISTరాష్ట్రంలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల షెడ్యూల్లో రాష్ట్ర ఎన్నికల సంఘం మార్పులు చేసింది. పోలీసు, పోలింగ్ సిబ్బంది కొరతతో పాటు ఇతర కారణాల వల్ల ఎన్నికల పోలింగ్, రీపోలింగ్, ఓట్ల లెక్కింపు తేదీలను సవరిస్తూ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠా ఉత్తర్వులు జారీ చేశారు. ముందుగా విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం నవంబరు 3న ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ జరగాల్సివుంది. అయితే సుప్రీంకోర్టు సూచనలతో ఈ నెల 28న జరగాల్సిన పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలను నవంబరు 3వ తేదీకి వాయిదా వేయడంతో ఎంపీటీసీ, జడ్పీటీసీ పోలింగ్, కౌంటింగ్ తేదీలను మార్పు చేసినట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది.
రాష్ట్రంలో తుఫాన్ ప్రభావంతో ప్రభుత్వ యంత్రాంగం అంతా సహాయక చర్యల్లో మునిగిపోయింది. అయినప్పటికీ ఎన్నికల నిర్వహణపై ఎస్ఈసీ ఆధ్వర్యంలో బుధవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. తుఫాన్ కారణంగా మున్సిపల్ ఎన్నికలు వాయిదా వేయాలా? అనే విషయమై కలెక్టర్ల అభిప్రాయాలను తీసుకున్నట్లు చెబుతున్నారు. అయితే ఇంకా సమయం ఉన్నందున ఇబ్బంది ఏమీ లేదని కలెక్టర్లు భరోసా ఇవ్వడంతో యథాతథంగా వచ్చేనెల 3న మున్సిపల్ ఎన్నికలను నిర్వహించాలని కమిషన్ నిర్ణయించినట్లు చెబుతున్నారు. ఇదే సమయంలో అదే రోజు జరగాల్సిన ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ షెడ్యూల్ లో మార్పు చేయాలని అధికారులు కోరడంతో కమిషన్ సానుకూలంగా స్పందించినట్లు చెబుతున్నారు.
మున్సిపల్ ఎన్నికలతోపాటు ఎంపీటీసీ, జడ్పీటీసీ పోలింగ్ ఒకేరోజు నిర్వహించడమంటే ఇబ్బందికరమని అధికారులు రాష్ట్ర ఎన్నికల సంఘం దృష్టికి తీసుకువెళ్లినట్లు చెబుతున్నారు. ముఖ్యంగా పోలీసు, పోలింగ్ సిబ్బంది అందుబాటులో ఉండరని నివేదించారని అంటున్నారు. దీంతో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల షెడ్యూల్‌ను సవరించడం అనివార్యమైందని అంటున్నారు. దీని ప్రకారం ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ నవంబర్ 5వ తేదీకి వాయిదా వేశారు. ఆ రోజు ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరుగుతుందని చెబుతున్నారు. రీపోలింగ్ అవసరమైతే నవంబర్ 6న నిర్వహిస్తారు.
ఇక ఓట్ల లెక్కింపు 7వ తేదీ ఉదయం 8 గంటల నుండి చేపడతామని ఎన్నికల సంఘం ప్రకటించింది. ఇక భద్రత, భౌగోళిక పరిస్థితుల దృష్ట్యా కొన్ని ఏజెన్సీ ప్రాంతాల్లో పోలింగ్ సమయా వేళల్లో స్వల్ప మార్పులు చేశారు. అల్లూరి సీతారామరాజు జిల్లాలోని 10 మండలాలు, పోలవరం జిల్లాలోని 7 మండలాల్లో మధ్యాహ్నం 3 గంటలకే పోలింగ్ ముగుస్తుందని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. ఈ సవరించిన షెడ్యూల్‌పై విస్తృత ప్రచారం కల్పించాలని అన్ని జిల్లాల కలెక్టర్లు, జిల్లా ఎన్నికల అధికారులను ఎస్ఈసీ ఆదేశించింది.
