Begin typing your search above and press return to search.

లోక్ సభ చర్చలో ఈవీఎంలపై మిథున్ రెడ్డి కీలక వ్యాఖ్యలు

ఒక ప్రెస్ మీట్ లో చెప్పిన మాటలకు ఉండే విశ్వసనీయతకు.. చట్టసభలైన అసెంబ్లీ.. పార్లమెంట్ లో చేసే వ్యాఖ్యలకు మధ్య విశ్వసనీయత.. వాటి తీవ్రతలో తేడా ఉంటుందన్న విషయం తెలిసిందే.

By:  Garuda Media   |   10 Dec 2025 9:53 AM IST
లోక్ సభ చర్చలో ఈవీఎంలపై మిథున్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
X

ఒక ప్రెస్ మీట్ లో చెప్పిన మాటలకు ఉండే విశ్వసనీయతకు.. చట్టసభలైన అసెంబ్లీ.. పార్లమెంట్ లో చేసే వ్యాఖ్యలకు మధ్య విశ్వసనీయత.. వాటి తీవ్రతలో తేడా ఉంటుందన్న విషయం తెలిసిందే. గత ఏడాది ఏపీలో జరిగిన సార్వత్రిక ఎన్నికల సందర్భంగా ఈవీఎంల పని తీరుపై తీవ్రస్థాయిలో వైసీపీ ఆరోపణలు చేయటం తెలిసిందే. తాజాగా లోక్ సభలో ఈవీఎంలపై జరిగిన చర్చలో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు.. ప్రస్తావించిన ఉదాహరణలు సంచలనంగానే కాదు.. షాకింగ్ గా మారాయి.

దేశ వ్యాప్తంగా ఈవీఎంలపై అనుమానాలు ఉన్నాయన్న ఆయన.. ఆంధ్రప్రదేశ్ లో గత ఎన్నికల్లో జరిగిన వింత పోకడలపై ఆయన వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా పలు ఉదాహరణల్ని ప్రస్తావించారు. అత్యున్నత సాంకేతికత ఉన్న దేశాలు సైతం ఈవీఎంలను పక్కన పెట్టి బ్యాలెట్ పేపర్ వైపు వెళుతుంటే.. మనం మాత్రం ఈవీఎంలను పట్టుకొని వేళ్లాడటంలో అర్థం లేదన్న మిథున్ రెడ్డి ప్రస్తావించిన అంశాల్ని ఆయన మాటల్లోనే చూస్తే..

- ఏపీలో మొత్తం 3.38 కోట్ల ఓట్లు పోలయ్యాయి. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరిగింది. ఆశ్చర్యకరంగా సాయంత్రం 6 గంటల తర్వాత ఏకంగా 15 శాతం ఓట్లు.. అంటే 51 లక్షల ఓట్లు రికార్డు అయ్యాయి.

- ఏపీ చరిత్రలో 2014లో కానీ 2019లో కానీ ఎప్పుడూ ఇలా జరగలేదు. ఈ ఆకస్మిక పెరుగుదల ఎలా సాధ్యమైందో అర్థం కావట్లేదు. ఒడిశాలోనూ ఇలాంటి ఫిర్యాదులే వచ్చాయి. విజయనగరంలో కౌంటింగ్ రోజున ఈవీఎం బ్యాటరీ ఛార్జింగ్ 99 శాతం ఉంది. కానీ.. పోలింగ్ రోజున అది 60 శాతమే ఉంది. వాడకం తర్వాత బ్యాటరీ చార్జింగ్ తగ్గాలి. కానీ.. ఎలా పెరుగుతుంది?

- ఇలాంటి సందేహాలకు ఈసీ నుంచి ఎలాంటి స్పందన లేదు. స్ట్రాంగ్ రూమ్ సీసీటీవీ ఫుటేజీ అడిగితే ఇవ్వలేదు. కనీసం వీవీపాట్ స్లిప్పులు లెక్కించమని అడిగితే.. వాటిని తగులబెట్టేశాం. ధ్వంసం చేశామని సమాధానం ఇచ్చారు. అనుమానం ఉన్న ఈవీఎంలను కాకుండా వేరే వాటిపై మాక్ పోలింగ్ నిర్వహించారు.

- హిందూపురం నియోజకవర్గంలోని ఒక పోలింగ్ బూత్ లో మరీ విడ్డూరం జరిగింది. ఒకే రోజు.. ఒకే సమయాన జరిగిన ఈ ఎన్నికల్లో ఒక బూత్ లో మా ఎంపీ అభ్యర్థికి 472 ఓట్లు వచ్చాయి. కానీ.. అదే బూత్ లో మా ఎమ్మెల్యే అభ్యర్థికి కేవలం ఒక్క ఓటు మాత్రమే వచ్చింది. మాకు అక్కడ ఐదుగురు ఏజెంట్లు ఉన్నారు. వాళ్ల కుటుంబ సభ్యుల ఓట్లే 30 వరకు ఉన్నాయి. గత 30 ఏళ్లుగా మేం గెలుస్తున్న బూత్ ఇది. ఎంపీ అభ్యర్థికి 472 ఓట్లు పడిన చోట.. ఎమ్మెల్యే అభ్యర్థికి ఒక్క ఓటు పడటం పలు అనుమానాలకు తావిస్తోంది.

- టెక్నాలజీతో ఎంతో ముందున్న ఎలాన్ మస్క్ లాంటి వారే ఈవీఎంలను హ్యాక్ చేయవచ్చని చెబుతున్నారు. అమెరికాలో 92 శాతం ఎన్నికలు బ్యాలెట్ పేపర్ మీదే జరుగుతున్నాయి.

- నెదర్లాండ్స్.. జర్మనీ.. ఐర్లాండ్.. ఫిన్లాండ్.. బంగ్లాదేశ్ లాంటి దేశాలన్నీ ఈవీఎంలను రద్దు చేసి బ్యాలెట్ పేపర్ కే మళ్లాయి. నేను మూడుసార్లు ఎంపీగా గెలిచింది ఈవీఎంల మీదనే. అయినా.. ప్రజల్లో ఉన్న అనుమానాలు నివ్రత్తి చేయటానికి బ్యాలెట్ పేపర్ విధానాన్ని తిరిగి తీసుకురావాలి.