అసెంబ్లీకి వైసీపీ...బీజేపీ ఎమ్మెల్యే హాట్ కామెంట్స్ !
అసెంబ్లీ సమావేశాలను ఎన్ని రోజులు నిర్వహించాలి ఏ ఏ అంశాలను చర్చించాలన్నది బిజినెస్ అడ్వైజరీ సమావేశంలో నిర్ణయిస్తారు. బీఏసీలో నాలుగు పార్టీలు ఉన్నాయి.
By: Satya P | 8 Aug 2026 9:22 AM ISTఏపీ అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 17 నుంచి జరగబోతున్నాయి. నాలుగు రోజుల పాటు వర్షాకాల సెషన్ ని నిర్వహించాలని తాజాగా జరిగిన మంత్రి వర్గ సమావేశంలో నిర్వహించారు. అయితే వర్షాకాల సమావేశాలకు వైసీపీ హాజరవుతుందా లేదా అన్నది ఒక పెద్ద ప్రశ్న. ఆ మాటకు వస్తే ప్రతీ అసెంబ్లీ సమావేశాలకు ముందు వైసీపీ హాజరు మీదనే అందరూ చర్చిస్తూ ఉంటారు. వైసీపీ 2024 లో భారీ ఓటమి తరువాత అసెంబ్లీకి రావడం మానుకుంది. బడ్జెట్ సెషన్ లో గవర్నర్ ఉభయ సభలను ఉద్దేశించి చేసే ప్రసంగానికి మాత్రమే హాజరవుతోంది. ఈ నేపథ్యంలో ఇపుడు వర్షాకాల సమావేశాలు జరగబోతున్నాయి. దాంతో ఫోకస్ అంతా ఆ వైపునే ఉంది.
బీఏసీలో నాలుగు పార్టీలు :
అసెంబ్లీ సమావేశాలను ఎన్ని రోజులు నిర్వహించాలి ఏ ఏ అంశాలను చర్చించాలన్నది బిజినెస్ అడ్వైజరీ సమావేశంలో నిర్ణయిస్తారు. బీఏసీలో నాలుగు పార్టీలు ఉన్నాయి. కూటమిలో మూడు పార్టీలైన టీడీపీ జనసేన బీజేపీ ఉంటే విపక్షంలో ఉన్న వైసీపీ కూడా ఇందులో ఉంది. అయితే అసెంబ్లీకే రాని వైసీపీ బీఏసీకి కూడా రావడం లేదు. మరో వైపు ఇప్పటిదాకా వైసీపీ ఫ్లోర్ లీడర్ కూడా ఎంపిక జరగలేదని అంటున్నారు. తమ పార్టీకి చెందిన నాయకుడు ఫలానా అని స్పీకర్ కి లేఖా పత్రం ఇవ్వాలి. అపుడు ఆ పార్టీని శాసనసభా పక్షం గా గుర్తించి దానికి నాయకుడిని కూడా స్పీకర్ గుర్తిస్తారు అని అంటున్నారు. మరి వైసీపీ ఈ విధంగా లేఖ ఇచ్చింది లేనిది కూడా తెలియదని అంటున్నారు.
వైసీపీ రాదు కదా :
అయితే బీఏసీలో నాలుగు పార్టీలు ఉన్నాయని బీజేపీ శాసన సభా పక్ష నాయకుడు విష్ణు కుమార్ రాజు మీడియాతో మాట్లాడుతూ తాజాగా వెల్లడించారు. అయితే ఇందులో వైసీపీ కూడా ఉందని అంటూ ఆ పార్టీ అసెంబ్లీకే రావడం లేదని ఆయన గుర్తు చేశారు. బీఏసీకి అసెంబ్లీకి వైసీపీ వస్తే బాగుంటుంది అని రాజు సూచించారు. అయితే వారు వచ్చే పరిస్థితి ఉండదని కూడా ఆయనే చెప్పేశారు. దాంతో రాజు చేసిన ఈ హాట్ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
ఎన్నో సమస్యలు ఉన్నాయి :
ఏపీలో ఎన్నో సమస్యలు అయితే ప్రస్తుతం ఉన్నాయి. ప్రజా సమస్యల పరిష్కారానికి తమ పార్టీ కృషి చేస్తోంది అని వైసీపీ నేతలు చెబుతున్నారు. మరో వైపు చూస్తే జగన్ కూడా ఆక్వా రైతుల సమస్యలు అని అలాగే పొగాకు సమస్యలు అని అంటూ జిల్లాల పర్యటనలు చేపడుతున్నారు. మరి మెగా డీఎస్సీ అక్రమాలు అంటూ వైసీపీ ఆందోళన చేస్తోంది. ఏపీలో లా అండ్ ఆర్డర్ లేదని కూడా జగన్ సహా కీలక నేతలు అంతా వరస ట్వీట్లు చేస్తున్నారు. మరి ఇవన్నీ కూడా అసెంబ్లీలో చర్చించాల్సి ఉంటుంది కదా అన్న మాట అయితే జనం నుంచి వినిపిస్తోంది. అయితే బీజేపీ ఎమ్మెల్యే రాజు అన్నట్లుగా వైసీపీ అసెంబ్లీ కి హాజరయ్యే అవకాశాలు తక్కువే అని అంటున్నారు.
ముద్రగడ కోసమైనా :
ఇదిలా ఉంటే కాపు ఉద్యమ నేత మాజీ మంత్రి, తన రాజకీయ జీవిత చరమాంకంలో వైసీపీలో ఉన్న ముద్రగడ పద్మనాభంకి సంతాపం తెలియచేసే తీర్మానం ఇదే సభలో ఉండబోతోంది. మరి ముద్రగడ మీద గౌరవంతో అభిమానంతో అయినా వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వస్తారా లేదా అన్నది చూడాల్సి ఉందని అంటున్నారు. ఏది ఏమైనా అసెంబ్లీ అన్న ప్రతీ సారీ అందరి చూపూ ఆలోచనలు వైసీపీ మీదకే వెళ్తున్నాయి. దాంతో అసెంబ్లీలో కంటే బయట చర్చలలోనే వైసీపీ ఎక్కువగా నలుగుతోంది అని చెప్పాలి.
