పవన్ తో కేబినెట్ మంత్రులు.. ఫొటోలు వైరల్
ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, ఆయన చుట్టూ దాదాపు పది మంది కేబినెట్ మంత్రులు ఉన్న ఫొటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
By: Tupaki Political Desk | 12 Dec 2025 10:03 AM ISTఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, ఆయన చుట్టూ దాదాపు పది మంది కేబినెట్ మంత్రులు ఉన్న ఫొటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మంత్రులు అంతా పవన్ చుట్టూ చేరి నవ్వుతూ ఉండగా, ఉప ముఖ్యమంత్రి కూడా వారితో ఆనందం పంచుకున్నట్లు ఉన్న ఫొటోలు చూసేందుకు చాలా ఆకర్షణీయంగా ఉన్నాయి. ఈ తాజా చిత్రాలు ఏపీలోని కూటమి ప్రభుత్వంలో మంత్రులు మధ్య పరస్పర గౌరవం, అభిమానం ఎంతలా అల్లుకున్నది స్పష్టంగా తెలియజేస్తోందని అంటున్నారు. కూటమిలో చిచ్చు రావాలని కోరుకుంటున్న ప్రత్యర్థులకు ఈ ఫొటోలు చాలా చికాకు కలిగిస్తాయని టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు.
ఇంతకీ ఉప ముఖ్యమంత్రి, మంత్రులు కలిసిన ఆకర్షణీయ చిత్రం ఎప్పటిదన్న చర్చ ఆసక్తి రేపుతోంది. గురువారం ఏపీ సచివాలయంలో కేబినెట్ భేటీ జరిగింది. ఈ సమావేశానికి ముఖ్యమంత్రి చంద్రబాబుతోపాటు మిగిలిన మంత్రులు హాజరయ్యారు. అయితే సీఎం సమావేశానికి రావడానికి ముందే ఉప ముఖ్యమంత్రితోపాటు మంత్రులు అనిత, డోల బాల వీరాంజనేయస్వామి, అనగాని సత్యప్రసాద్, సవిత, నారాయణ, మనోహర్, దుర్గేశ్, పయ్యావుల కేశవ్ తదితరులు వచ్చారు. సమావేశ మందిరంలోకి పవన్ రాగానే టీడీపీకి చెందిన మంత్రులు అంతా పవన్ ను కలిసి పూల బొకేలతో అభినందనలు తెలిపారు. పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా పనిచేస్తున్న పవన్ గ్రామాల్లో రోడ్ల నిర్మాణానికి అధిక ప్రాధాన్యమిస్తున్నారని అభినందనలు తెలిపారు.
రాష్ట్రంలో గ్రామీణ రహదారుల నిర్మాణానికి ప్రభుత్వం రెండు రోజుల క్రితం రూ.2,123 కోట్ల రూపాయలను విడుదల చేసింది. ఈ నిధులతో దాదాపు 4 వేల రోడ్లు నిర్మించనున్నారు. చాలాకాలంగా గుంతలమయంగా మారిన రోడ్ల నిర్మాణానికి నిధులు మంజూరు చేయడంపై మంత్రులు ఆనందం వ్యక్తం చేశారు. ఈ నిధులతో తమ నియోజకవర్గాలలో జరిగే అభివృద్ధిని ఉప ముఖ్యమంత్రి పవన్ దృష్టికి తీసుకువెళ్లారు. గత ప్రభుత్వంలో రోడ్ల నిర్మాణాన్ని నిర్లక్ష్యం చేయడంతో గ్రామీణ రోడ్లు పూర్తి అస్తవ్యస్తంగా తయారయ్యాయని, ఈ సమస్యను గుర్తించి రోడ్ల నిర్మాణానికి పవన్ అధిక ప్రాధాన్యం ఇవ్వడంపై మంత్రులు అభినందనలు తెలిపారు.
ఇక ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ మధ్య అనుబంధం రోజురోజుకు పెరుగుతుందనే దానికి ఈ ఫొటోలు నిదర్శనమంటున్నారు. గ్రామాల అభివృద్ధే ధ్యేయంగా పంచాయతీరాజ్ శాఖను కోరి మరీ తీసుకున్నానని ఇటీవల పవన్ వ్యాఖ్యానించారు. ఇదే సమయంలో సీఎం చంద్రబాబు సైతం పవన్ కల్యాణ్ కు పూర్తి స్వేచ్ఛ ఇస్తున్నారు. ఆయన నిధులు అడిగిన వెంటనే నో చెప్పకుండా సమకూర్చుతున్నారు. దీంతో మిగిలిన మంత్రులు కన్నా పవన్ చూస్తున్న శాఖలు పుష్కలంగా నిధులు సమకూర్చుకుని అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నాయి. గతంలో పల్లె పండుగ అనే ప్రత్యేక కార్యక్రమం నిర్వహించిన పవన్.. ఏజెన్సీ ప్రాంతాల్లో రోడ్లు నిర్మాణానికి చొరవ చూపారు. తాజాగా పల్లె పండుగ-2 ప్రారంభించారు. ఇందులో భాగంగా మైదాన ప్రాంతాల్లో కూడా ఛిన్నాభిన్నమైన రోడ్ల పునర్నిర్మాణానికి ప్రాధాన్యమిస్తున్నారు. ఈ కార్యక్రమం నిర్వహణతో ఎమ్మెల్యేలు, మంత్రులు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
