సరిహద్దులు చెరిపేసిన ఏపీ మంత్రి.. హైదరాబాద్‌లో ప్రజాదర్బార్!
సాధారణంగా ఒక రాష్ట్రానికి చెందిన మంత్రులు తమ సొంత నియోజకవర్గాలు లేదా జిల్లా కేంద్రాల్లో ప్రజా దర్బార్‌లు నిర్వహించి సమస్యలను పరిష్కరించడం మనం చూస్తుంటాం. కానీ, ఏపీ కార్మికశాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ సరికొత్త సంప్రదాయానికి తెరలేపారు.
By: Tupaki Gallery Desk | 7 July 2026 12:00 AM ISTసాధారణంగా ఒక రాష్ట్రానికి చెందిన మంత్రులు తమ సొంత నియోజకవర్గాలు లేదా జిల్లా కేంద్రాల్లో ప్రజా దర్బార్‌లు నిర్వహించి సమస్యలను పరిష్కరించడం మనం చూస్తుంటాం. కానీ, ఏపీ కార్మికశాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ సరికొత్త సంప్రదాయానికి తెరలేపారు. పక్క రాష్ట్రమైన హైదరాబాద్‌లో ఏకంగా ప్రజా దర్బారుతోపాటు జాబ్ మేళా నిర్వహించి అందరి దృష్టిని ఆకర్షించారు. హైదరాబాద్‌లో బిక్షపతి యాదవ్ కళ్యాణ మండపంలో మంత్రి సుభాష్ ఆధ్వర్యంలో నిర్వహించిన జాబ్ మేళా తెలుగు రాష్ట్రాల రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.
హైదరాబాద్‌లో నివసిస్తున్న ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ప్రభుత్వ సేవలను మరింత చేరువ చేయడమే లక్ష్యంగా మంత్రి సుభాష్ వినూత్నంగా ఈ కార్యక్రమం నిర్వహించారని అంటున్నారు. సాధారణంగా వృత్తి, వ్యాపార రీత్యా హైదరాబాద్‌లో స్థిరపడిన లక్షల మంది ఏపీ వాసులు తమ సొంత రాష్ట్ర ప్రభుత్వం నుంచి అందాల్సిన సేవలు, పరిష్కారాల కోసం చాలా ఇబ్బందులు పడుతుంటారు. చిన్నచిన్న పనుల కోసం హైదరాబాద్ నుంచి స్వస్థలాలకు వెళ్లి ఆ పనులు చేయించుకునేందుకు వ్యయప్రసాలకు గురవుతుంటారు. ఇలాంటి వారి కోసం మంత్రి సుభాష్ చేసిన ప్రయోగం అభినందనలు అందుకుంటోంది. సహజంగా ఎన్నికల సమయంలో ఓటర్లు ఎక్కడ ఉంటే నేతలు అక్కడకు క్యూ కడుతుంటారు. అదేవిధంగా ప్రజలకు పాలన చేరువ చేయాలనే ఉద్దేశంతో రాష్ట్రంలోని మారుమూల పల్లెల్లో అధికారులు, ప్రజాప్రతినిధులు పర్యటిస్తుంటారు. కానీ, తమ ప్రాంత ప్రజల కోసం పక్క రాష్ట్రంలో ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించడం నిజంగా అభినందనీయమే అంటున్నారు.
ఈ పరిణామంపై రాజకీయ విశ్లేషకులు సైతం భిన్నమైన అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. పక్క రాష్ట్రంలో ఒక మంత్రి ప్రజా దర్బార్ నిర్వహించడం రాజకీయంగా ఒక వ్యూహాత్మక అడుగుగా కనిపిస్తోందని వ్యాఖ్యానిస్తున్నారు. తమ ప్రాంతీయులు ఎక్కడ ఉన్నా వారికి అండగా ఉంటామనే సంకేతాన్ని పంపడం ద్వారా మంత్రి తన సొంత నియోజకవర్గంలో క్రేజ్ పెంచుకునే ఎత్తుగడ అమలు చేశారని అంటున్నారు. స్థానిక ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే మంత్రి సుభాష్ ప్రజాదర్బార్, జాబ్ మేళా అంటూ హడావుడి చేస్తున్నారని విపక్షాలు విమర్శిస్తున్నాయి. ఏది ఏమైనా, హైదరాబాద్ కేంద్రంగా జరిగిన ఈ కార్యక్రమం రాజకీయ వేడిని పెంచడమే కాకుండా, ప్రజా రవాణా, సంక్షేమ పథకాలపై కూడా చర్చను రేకెత్తించింది.
కాగా, తన ప్రజాదర్బార్ కార్యక్రమానికి లభించిన విశేష స్పందనను చూసి మంత్రి వాసంశెట్టి సుభాష్ సంతోషం వ్యక్తం చేశారు. హైదరాబాద్‌లోనే కాకుండా, భవిష్యత్తులో ఇలాంటి కార్యక్రమాలను మరిన్ని నగరాల్లో నిర్వహించే అవకాశం ఉందని ఆయన సంకేతాలిచ్చారు. ప్రజా సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం బాధ్యతాయుతంగా వ్యవహరిస్తుందని, ప్రజల సంక్షేమమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని ఆయన పునరుద్ఘాటించారు. ఈ తరహా వినూత్న ప్రయత్నాలు ప్రజాసేవలో సరికొత్త ఒరవడికి నాంది పలికే అవకాశం ఉందని పరిశీలకులు భావిస్తున్నారు.
