Begin typing your search above and press return to search.

ఎంపీలతో లోకేశ్.. ఢిల్లీలో ఇదే హాట్ టాపిక్!

కానీ, లోకేశ్ మిగిలిన నేతలకు భిన్నంగా తాను ఎక్కడికి వెళ్లినా, అందుబాటులో ఉన్న నేతలు అందరినీ తీసుకువెళ్లడం, మిత్రపక్షాలకు చెందిన నేతలను భాగస్వామి చేస్తుండటమే ఆకర్షిస్తోందని అంటున్నారు.

By:  Tupaki Political Desk   |   16 Dec 2025 4:56 PM IST
ఎంపీలతో లోకేశ్.. ఢిల్లీలో ఇదే హాట్ టాపిక్!
X

ఏపీ మంత్రి నారా లోకేశ్ ఢిల్లీ పర్యటనపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. సోమవారం ఢిల్లీకి వచ్చిన మంత్రి లోకేశ్ ఏపీకి సంబంధించిన పలు ప్రాజెక్టులు, నిధులపై ముగ్గురు కేంద్ర మంత్రులను కలిశారు. దీర్ఘకాలికంగా పెండింగులో ఉన్న సమస్యలు పరిష్కరించాలని కోరారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు బిజీబిజీగా గడిపిన మంత్రి లోకేశ్.. ముగ్గురు కేంద్ర మంత్రులను కలిశారు. ముఖ్యమంత్రి చంద్రబాబుకు బదులుగా ప్రభుత్వం తరఫున ఢిల్లీకి వస్తున్న లోకేశ్ కేంద్ర ప్రభుత్వంతో చర్చిస్తూ రాష్ట్రానికి అవసరమైన పనులు చేయించుకుంటున్నారు. అయితే లోకేశ్ పర్యటనల సందర్భంగా కనిపించే దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

సోమవారం ఢిల్లీ వచ్చిన లోకేశ్ ముగ్గురు కేంద్ర మంత్రులను కలవగా ఆయన వెంట టీడీపీ, జనసేన ఎంపీలు ఉండటం ప్రత్యేక ఆకర్షణగా వ్యాఖ్యానిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వంలో కీలకంగా పనిచేస్తున్న లోకేశ్.. పార్టీకి భావినేతగా ప్రచారంలో ఉన్నారు. దీంతో ఆయన దృష్టిలో పడేందుకు పార్టీలో మిగిలిన నేతలు ఆరాటపడుతుంటారు. ఇదే సమయంలో లోకేశ్ కూడా తన పార్టీ వారితో చాలా సన్నిహితంగా ఉంటూ వారినీ తనతోపాటే తిప్పడంపై ఎక్కువగా చర్చ జరుగుతోంది. సహజంగా లోకేశ్ స్థాయి నేతలు అంటే ఒక పార్టీని నడిపే నేతలు ఇలా గుంపుగా ఎక్కడికి వెళ్లేందుకు ఇష్టపడరని, ఒకరో ఇద్దరినో తమతో తీసుకువెళ్లి కావాల్సిన పనులు చేయించుకుంటారని అంటున్నారు.

కానీ, లోకేశ్ మిగిలిన నేతలకు భిన్నంగా తాను ఎక్కడికి వెళ్లినా, అందుబాటులో ఉన్న నేతలు అందరినీ తీసుకువెళ్లడం, మిత్రపక్షాలకు చెందిన నేతలను భాగస్వామి చేస్తుండటమే ఆకర్షిస్తోందని అంటున్నారు. దీనివల్ల ప్రభుత్వ పనుల్లో పార్లమెంటు సభ్యులకు భాగస్వామ్యం ఇచ్చినట్లు అవుతోందని అంటున్నారు. గతంలో పార్లమెంటు సభ్యులు అంటే రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధం లేదన్నట్లు ఉండేదని, కానీ ఇప్పుడు రాష్ట్రానికి ఏం కావాలి? ఏం చేయాలి? అన్న విషయాలపై మంత్రి లోకేశ్ సారథ్యంలో ఎంపీలకు అవగాహన కల్పిస్తున్నారని అంటున్నారు.

నిజానికి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎంపీలకు కొన్ని కీలక బాధ్యతలు అప్పగించారు. రాష్ట్రానికి చెందిన కూటమి ఎంపీలు 21 మందికి ఢిల్లీలో ప్రభుత్వ విభాగాల బాధ్యతలను సమానంగా అప్పగించారు. దీనిప్రకారం ప్రతి ఎంపీ తనకు కేటాయించిన శాఖ ద్వారా రాష్ట్రానికి పథకాలు తీసుకురావాల్సివుంటుంది. అయితే ఇంతవరకు ఎంపీలు ఈ దిశగా పనిచేసినట్లు ఎక్కడా కనిపించలేదు. అయితే యువనేత లోకేశ్ మాత్రం.. కూటమి ఎంపీలు అందరినీ కలుపుకొని కేంద్ర మంత్రులను కలుస్తుండటం వల్ల వారికి పరిచయాలు పెరుగుతున్నాయని అంటున్నారు.

దీనివల్ల కేంద్రంలో కూడా టీడీపీ ఎంపీలు ప్రత్యేక ముద్ర వేసేలా పనిచేసే అవకాశం దొరుతుందని వ్యాఖ్యానిస్తున్నారు. సోమవారం ఢిల్లీలో ముగ్గురు కేంద్ర మంత్రులను కలిసిన లోకేశ్ తనతో రాష్ట్రానికి చెందిన కేంద్ర మంత్రులు రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్ తోపాటు టీడీపీ, జనసేన పార్లమెంటు సభ్యులు అందరినీ తీసుకువెళ్లారు. దీనివల్ల వారందరికీ కేంద్రం నుంచి రాష్ట్రానికి కావాల్సిన నిధులు, కేంద్రం ఇస్తామన్న పథకాలు ఏ దశలో ఉన్నాయి..? ఏం చేయాలన్న విషయాలపై అవగాహన కలిగించినట్లైందని అంటున్నారు.