నకిలీ సర్టిఫికెట్ల ఇష్యూ : మోసం ఒక్కరిది.. అందరిపై నింద వేస్తే ఎలా?! ఇంట్రెస్టింగ్ పాయింట్
నకిలీ సర్టిఫికెట్లతో ప్రభుత్వ ఉద్యోగాలు పొందే ప్రయత్నాలు జరగడం ఇదే మొదటిసారి కాదని ప్రభుత్వం చెబుతోంది.
By: Tupaki Political Desk | 7 Sept 2026 3:12 PM ISTఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన మెగా డీఎస్సీపై నకిలీ సర్టిఫికెట్ల వివాదం తీవ్ర దుమారం రేపుతోంది. కొందరు అభ్యర్థులు చేసిన మోసాన్ని గుర్తించిన ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకున్నట్లు చెబుతోంది. అయినప్పటికీ ఈ విషయాన్ని సాకుగా చూపి మొత్తం డీఎస్సీపైనే తప్పుడు ప్రచారం చేయడంపై ప్రభుత్వ వర్గాలు అభ్యంతరం చెబుతున్నాయి. ఒకరిద్దరు అభ్యర్థులు చేసిన మోసాన్ని ఏకంగా మొత్తం ఎంపికైన అభ్యర్థులకు ఎలా అంటగడతారని ప్రశ్నిస్తున్నారు. నిజానికి ఈ తరహా మోసాలు దేశవ్యాప్తంగా జరుగుతూనే ఉంటాయని, విషయం వెలుగు చూసిన తర్వాత సంబంధిత అభ్యర్థులపై చర్యలు తీసుకున్న ఉదంతాలు ఉన్నాయని చెబుతున్నారు. కానీ, ఆయా వ్యవహారాల్లో పరీక్షను రద్దు చేసిన ఘటన ఒక్కటి కూడా లేదని అంటున్నారు.
మెగా డీఎస్సీలో స్పోర్ట్సు కోటా కింద కొందరు తప్పుడు పత్రాలతో ఉద్యోగాలు పొందారని, టెట్ అర్హత మార్కులు సాధించకపోయినా, తప్పుడు పత్రాలు చూపించి ఉద్యోగాల్లో చేరారని ఫిర్యాదులు వచ్చాయి. దీనిపై ప్రభుత్వం విచారణకు ఆదేశించి బాధ్యులపై చర్యలు తీసుకుంది. అయితే ఈ ఉదంతాన్ని పట్టుకుని కొందరు మొత్తం డీఎస్సీ నిర్వహణపై విమర్శలు చేయడంపై ప్రభుత్వం ఘాటుగా స్పందించింది. ప్రభుత్వ ఉద్యోగానికి దరఖాస్తు చేసే సమయంలో ప్రతి అభ్యర్థి తమ అర్హతలను నిరూపించేందుకు అవసరమైన సర్టిఫికెట్లను సమర్పిస్తారని, ఆ పత్రాల నిజానిజాలపై ప్రాథమిక బాధ్యత పూర్తిగా అభ్యర్థిదే అవుతుందని స్పష్టం చేస్తోంది. ఎవరైనా నకిలీ సర్టిఫికెట్ సమర్పించినట్లు నిర్ధారణ అయితే, ఆ అభ్యర్థిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటారని వివరించింది. సర్టిఫికెట్లు ఎవరు జారీ చేశారు? దాని వెనుక ఎవరైనా వ్యక్తులు లేదా సంస్థల ప్రమేయం ఉందా? అనే కోణంలో సమగ్ర విచారణ జరిపి తప్పు చేసిన అందరిపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది. సర్టిఫికెట్ వెరిఫికేషన్‌లో ఎవరైనా ఉద్దేశపూర్వకంగా తప్పు చేసి ఉంటే, వారి బాధ్యతను కూడా నిర్ధారించి చర్యలు తీసుకోవడంలో ఎలాంటి సందేహం లేదని తేల్చిచెప్పింది.
ఒకరిద్దరి తప్పుకు ప్రభుత్వాన్ని నిందించడం తగదు
వేలాది మంది అభ్యర్థులు పాల్గొన్న భారీ నియామక ప్రక్రియలో ఎవరైనా తప్పుడు పత్రాలు సమర్పించే అవకాశం ఉండొచ్చు కాబట్టే పటిష్టమైన వెరిఫికేషన్ ప్రక్రియ ఉంటుందని ప్రభుత్వ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. ఒక వ్యక్తి చేసిన మోసాన్ని మొత్తం ప్రభుత్వానికి లేదా ప్రభుత్వ నాయకత్వానికి ఆపాదించడం పూర్తిగా అన్యాయమని భావిస్తున్నారు. ఒకరిద్దరు మోసం చేసి ఉద్యోగాలలో చేరేందుకు ప్రయత్నిస్తే, వారి తప్పు బయటపడిన వెంటనే తగిన చర్యలు తీసుకుంటారు. కానీ ఒకరిద్దరు చేసిన తప్పు ఆధారంగా ఏకంగా డీఎస్సీ పరీక్ష నిర్వహణ విధానమే సరిగా లేదని ఆరోపణలు చేయడం వల్ల నష్టపోయేది నిజాయితీగా, కష్టపడి ఉద్యోగం సాధించిన నిరుద్యోగ అభ్యర్థులే అన్న విషయాన్ని గుర్తించాలని ప్రభుత్వం హితవు పులుకుతోంది.
గతంలో వివిధ రాష్ట్రాల్లో వెలుగుచూసిన నకిలీ సర్టిఫికెట్ల ఉదంతాలు
నకిలీ సర్టిఫికెట్లతో ప్రభుత్వ ఉద్యోగాలు పొందే ప్రయత్నాలు జరగడం ఇదే మొదటిసారి కాదని ప్రభుత్వం చెబుతోంది. ఇలాంటి ఘటనలు గతంలో వివిధ రాష్ట్రాల్లో, వివిధ ప్రభుత్వాల హయాంలో చాలానే జరిగాయని చెబుతోంది. మహారాష్ట్రలో స్పోర్ట్స్ కోటా కింద నకిలీ ట్రామ్‌పోలిన్ సర్టిఫికెట్లతో ప్రభుత్వ ఉద్యోగాలు పొందిన కేసులు పెద్ద ఎత్తున బయటపడ్డాయి. అధికారులు జరిపిన విచారణలో ఏకంగా 261 సర్టిఫికెట్లలో 258 బోగస్‌గా తేలగా, ఆ ఉద్యోగాలు పొందిన వారిపై కఠిన చర్యలు తీసుకున్నారని ప్రభుత్వం చెబుతోంది. అదేవిధంగా రాజస్థాన్ రాష్ట్రంలో పీటీఐ నియామకాల్లో నకిలీ విద్యార్హతలతో ఉద్యోగాలు పొందిన 134 మందిని గుర్తించి వెంటనే తొలగించిన విషయాన్ని గుర్తు చేస్తోంది. ఇక తెలంగాణలో పోలీస్ నియామకాలలో కూడా ఇలాంటి మోసాలు వెలుగుచూశాయని చెబుతున్నారు. నకిలీ విద్యా బోనాఫైడ్ సర్టిఫికెట్లు సమర్పించిన 59 మంది అభ్యర్థుల ఎంపికను రద్దు చేసి, వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేసి తగిన చర్యలు తీసుకున్నారని చెబుతున్నారు.
అంతేకాకుండా సిస్టమ్‌లోని లొసుగులను ఆసరాగా చేసుకుని ఫ్రాడ్ చేసిన పెద్దపెద్ద ఐఏఎస్ అధికారులను సైతం గుర్తించి సర్వీసు నుంచి తొలగించిన ఉదంతాలు దేశంలో ఉన్నాయని చెబుతున్నారు. సిస్టమ్‌లో ఎక్కడైనా లోపాలు జరిగినా, తప్పు చేసిన వారిని పట్టుకుని ఏరివేయడం నిరంతరం జరుగుతుంటుందని ప్రభుత్వం స్పష్టం చేస్తోంది. నకిలీ సర్టిఫికెట్ సమర్పించిన వ్యక్తి చేసిన మోసానికి ఆ వ్యక్తే పూర్తి బాధ్యుడని ప్రభుత్వం తేల్చిచెబుతోంది. మోసం నిర్ధారణ అయితే చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేస్తోంది. కానీ దీనిని రాజకీయ ఆరోపణల అస్త్రంగా మలచడం సరికాదని హితవు పలుకుతోంది.
