మోత మోగిస్తున్న ఏపీ బ్రాండ్
ఏపీలో రాష్ట్ర స్థాయి పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డ్ ఎస్ఐపీబీ ని అత్యంత కీలకం చేశారు. ఎంతలా అంటే 19 నెలల కూటమి పాలనలో ఇప్పటికి 14 రాష్ట్ర స్థాయి ఎస్ఐపీబీ సమావేశాలు జరిగాయి అంటే ఆలోచించాల్సిందే.
By: Satya P | 6 Jan 2026 10:10 PM ISTఏపీలో పెద్ద ఎత్తున పెట్టుబడులు తీసుకుని వచ్చేందుకు కూటమి ప్రభుత్వం నిర్విరామ కృషి చేస్తోంది. పెట్టుబడులకు పెద్ద పీట వేయడమే కాకుండా ఈజ్ ఆఫ్ బిజినెస్ డూయింగ్ తో ఎవరైనా ఏపీ వైపు చూస్తే చాలు వారికి అన్ని విధాలుగా ప్రోత్సాహకాలను అందిస్తున్నారు. సింగ్ విండో విధానంలో పెట్టుబడులు పెట్టేందుకు అవసరం అయిన అన్ని అనుమతులు మంజూరు చేస్తున్నారు. ఎక్కడా ఎలాంటి ఇబ్బంది లేకుండా టాప్ టూ బాటమ్ మానిటరింగ్ చేస్తున్నారు.
ఎస్ఐపీబీ కీలకంగా :
ఏపీలో రాష్ట్ర స్థాయి పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డ్ ఎస్ఐపీబీ ని అత్యంత కీలకం చేశారు. ఎంతలా అంటే 19 నెలల కూటమి పాలనలో ఇప్పటికి 14 రాష్ట్ర స్థాయి ఎస్ఐపీబీ సమావేశాలు జరిగాయి అంటే ఆలోచించాల్సిందే. అంటే సగటున నెలకు ఒక మీటింగ్ అన్న మాట. ఈ సమావేశాల ద్వారా ఆ కాల పరిధిలో వచ్చిన పెట్టుబడుల దరఖాస్తులను సమగ్రంగా పరిశీలించి ఎక్కడికక్కడ వెంటనే అనుమతులు మంజూరు చేస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యషతన తాజాగా అమరావతి లోని రాష్ట్ర సచివాలయంలో జరిగిన 14వ ఎస్ఐపీబీ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అంతే కాదు వివిధ ప్రాజెక్టులకు సంబందించి సమావేశంలో ఎస్ఐపీబి ఆమోదం తెలిపింది.
భారీ ఎత్తున పెట్టుబడులు :
ఇదిలా ఉంటే ఇప్పటిదాకా జరిగిన 13 ఎస్ఐపీబీ సమావేశాల ద్వారా ఏపీకి 8.55 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చాయి. వీటి ద్వారా 8.23 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు వచ్చాయని ఎస్ఐపీబీ పేర్కొంటూ వాటికి ఆమోదం తెలిపింది. పరిశ్రమలు, పర్యాటకం, ఫుడ్ ప్రాసెసింగ్, ఇంధన రంగాలలో పెద్ద ఎత్తున పెట్టుబడులు ఏపీకి వస్తున్నాయి.
మంత్రులు తీరు అద్భుతం :
ఈ సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ 2025 ఏడాది ఏపీకి గొప్ప అభివృద్ధి సంకేతంగా తెలిపారు. ఈ ఏడాది ఏపీలో పెట్టుబడులు భారీ ఎత్తున వచ్చాయని ఆయన తెలిపారు. అంతే కాదు అదే ఉత్సాహంతో 2026లో కూడా అంతా కలసి పూర్తి కో ఆర్డినేషన్ తో పనిచేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు కోరడం విశేషం. ఇక రాష్ట్రాభివృద్ధి కోసం మంత్రులు, అధికారులు అద్భుతంగా పని చేశారని ముఖ్యమంత్రి చంద్రబాబు కితాబు ఇవ్వడం మరో విశేషం.
ఏపీకి బ్రాండ్ :
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. గత ప్రభుత్వ పాలనలో రాష్ట్రానికి పోయిన బ్రాండ్ తిరిగి వచ్చిందని ఆనందం వ్యక్తం చేశారు. రాష్ట్రానికి పెద్ద ఎత్తున పెట్టుబడులు వరసబెట్టి రావడం శుభ సూచకం అని అన్నారు. ఎంతో ప్రతిష్టాత్మకమైన భారీ పరిశ్రమలు ఏపీలో పెట్టుబడులు పెడుతున్నాయని ముఖ్యమంత్రి అంటూ ఏపీ ప్రగతి గతిని మార్చే దిశగా అడుగులు పడుతున్నాయని అన్నారు. టాటా, జిందాల్, బిర్లా, అదానీ, రిలయెన్స్, టీసీఎస్, కాగ్నిజెంట్ వంటి ప్రముఖ సంస్థలు ఏపీలో పెట్టుబడులు పెట్టాయి అని ఆయన గుర్తు చేశారు. అయితే వెల్లువలా పెట్టుబడులు వస్తున్న క్రమంలో ఎక్కడా ఏ చిన్న పొరపాటు తావివ్వకుండా మంత్రులు, అధికారులు బాధ్యత తీసుకోవాలని చంద్రబాబు సూచించడం విశేషం.
