Begin typing your search above and press return to search.

కాఫీలు రుచిగా లేవ్‌: మండలిలో మ‌రో వివాదం

ఏపీ శాస‌న మండ‌లిలో చిన్న చిన్న విష‌యాలు పెద్ద పెద్ద వివాదాలుగా మారుతున్నాయి. గ‌త రెండు రోజులుగా కూడా మండ‌లిలో వివాదాలు పెరుగుతున్నాయి.

By:  Garuda Media   |   27 Sept 2025 9:00 PM IST
కాఫీలు రుచిగా లేవ్‌: మండలిలో మ‌రో వివాదం
X

ఏపీ శాస‌న మండ‌లిలో చిన్న చిన్న విష‌యాలు పెద్ద పెద్ద వివాదాలుగా మారుతున్నాయి. గ‌త రెండు రోజులుగా కూడా మండ‌లిలో వివాదాలు పెరుగుతున్నాయి. మండ‌లి చైర్మ‌న్ మోషేన్ రాజుకు అవమానం జ‌రిగింద‌ని పేర్కొంటూ .. వైసీపీ స‌భ్యులు పెద్ద వివాదం చేశారు. మండ‌లిని స్తంభింప‌జేశారు కూడా. ప్ర‌భుత్వం నిర్వ‌హించే కార్య‌క్ర‌మాల‌కు ప్రొటోకాల్ ప్ర‌కారం.. ఆయ‌న‌కు ఆహ్వానం అందాలి. అయితే.. ఈ విష‌యంలో ప్ర‌భుత్వం ఉద్దేశ పూర్వ‌కంగానే ఆయ న‌ను పక్క‌న పెడుతోంద‌ని వైసీపీ స‌భ్యులు వ్యాఖ్యానించిన విష‌యం తెలిసిందే.

అయితే.. దీనిపై ప్ర‌భుత్వం త‌ర‌ఫున ఎలాంటి స‌మాచారం రాలేదు. పైగా.. అధికారులే త‌ప్పు చేశార‌ని మంత్రులు తేల్చేసి చేతులు దులుపుకొన్నారు. ఇదిలా వుంటే.. తాజాగా మ‌రోరెండు విష‌యాలు మండ‌లిలో చ‌ర్చ‌కు వ‌చ్చాయి. అసెంబ్లీ, శాస‌న మండ‌లిలో క్యాంటీన్లు వేర్వేరుగా ఉంటాయి. రెండూ కూడా ఒకే కాంట్రాక్ట‌ర్‌కు అప్ప‌గించారు. అయితే.. తాజాగా మండ‌లి చైర్మ‌న్ స్వ‌యంగా జోక్యం చేసుకుని.. అసెంబ్లీ క్యాంటీన్‌లో కాఫీకి.. మండ‌లి క్యాంటీన్‌లో కాఫీకి మ‌ధ్య రుచి తేడా గా ఉంద‌ని తెలిపారు. దీనికి వైసీపీ స‌భ్యులు ఔనంటూ.. స‌మాధానం ఇచ్చారు.

అక్క‌డితో కూడా ఆగ‌కుండా.. మండ‌లిలో భోజ‌నాలకు, అసెంబ్లీ క్యాంటీన్‌లో భోజ‌నాల‌కు కూడా చాలా వ్య‌త్యాసం ఉంద‌ని వైసీపీ స‌భ్యులు చెప్పారు. ఈ విష‌యంలో చైర్మ‌న్ కూడా ఔనంటూ .. స‌మ‌ర్థించారు. దీనివెనుక కూడా రాజ‌కీయాలు ఉన్నాయ‌ని వైసీపీ స‌భ్యుడు మాజీ మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ విమ‌ర్శ‌లు గుప్పించారు. ఈ రెండు విష‌యాల‌పై చ‌ర్చ‌కు ప‌ట్టుబ‌ట్టారు. అయితే.. చైర్మ‌న్ మాత్రం చ‌ర్చ‌కు అవ‌కాశం లేద‌న్నారు.

ఈ క్ర‌మంలో ఆర్థిక‌, అసెంబ్లీ వ్య‌వ‌హారాల శాఖ‌ మంత్రి ప‌య్యావుల కేశవ్ మాట్లాడుతూ.. అలాగేం లేద‌ని.. తాను నిత్యం మండ‌లి క్యాంటీన్‌లోనే కాఫీ తాగుతున్నాన‌ని అన్నారు. అయితే.. చైర్మ‌న్ సందేహం వ్య‌క్తం చేసిన నేప‌థ్యంలో ఈ విష‌యంపై అధికారుల‌ను అడిగి తెలుసుకుంటాన‌ని చెప్పారు. ఈ నేప‌థ్యంలో ఒక పూట స‌భ కార్య‌క్ర‌మాలు దీనికే ప‌రిమిత‌మ‌య్యాయ‌ని చైర్మ‌న్ ప్ర‌క‌టించ‌డం గ‌మ‌నార్హం.