Begin typing your search above and press return to search.

స్థానిక ఎన్నికలపై హైకోర్టు తీర్పుకి కౌంట్ డౌన్ !

ఏపీలో స్థానిక ఎన్నికల విషయంలో హైకోర్టు తీర్పు అక్టోబర్ 1వ తేదీ గురువారం వెలువడనుంది అని అంటున్నారు.

By:  Satya P   |   1 Oct 2026 6:00 AM IST
స్థానిక ఎన్నికలపై హైకోర్టు తీర్పుకి కౌంట్ డౌన్ !
X

ఏపీలో స్థానిక ఎన్నికల విషయంలో హైకోర్టు తీర్పు అక్టోబర్ 1వ తేదీ గురువారం వెలువడనుంది అని అంటున్నారు. దీంతో సర్వత్రా ఉత్కంఠ వాతావరణం నెలకొంది. ఏపీలో స్థానిక ఎన్నికల విషయంలో వివిధ రాకాలుగా దాఖలు అయిన పిటిషన్ల మీద హైకోర్టు విచారణ జరిపింది. వాటిని కొద్ది రోజుల క్రితం రిజర్వ్ లో పెట్టింది. ఇపుడు తీర్పుని వెలువరించనుందని తెలుస్తోంది. ఇంతకీ హైకోర్టు తీర్పు ఈ విధంగా రానుంది అన్నది సర్వత్రా చర్చించుకుంటున్నారు.

వైసీపీ పిటిషన్ కూడా :

ఇదిలా ఉంటే ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలను సర్ ఎన్నికల ప్రక్రియ పూర్తి అయిన తరువాత నిర్వహించాలని కోరుతూ వైసీపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఆ పార్టీ ఎమ్మెల్సీ లేళ్ళ అప్పిరెడ్డి ఈ పిటిషన్ దాఖలు చేశారు. ఇందులో పేర్కొన్న మేరకు సర్ ప్రక్రిత పూర్తి అయి ఓటర్ల జాబితా అక్టోబర్ 9న విడుదల అవుతుంది కాబట్టి ఆ తరువాత ఎన్నికలు పెట్టాలని ఆయన కోరుతూ ఈ మేరకు ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోర్టుని ఆశ్రయించారు. సర్ ప్రక్రియలో ఏకంగా 40 లక్షల ఓట్లు గల్లంతు అయ్యాయని గుర్తు చేశారు. ఆ ఓట్లు అన్నీ తప్పుడు తడకలు అని పేర్కొన్నారు. అందులో చనిపోయిన వారు, అలాగే డబుల్ ఎంట్రీలు, ఇతర ప్రాంతాలకు వలస పోయిన వారిని ఉన్నాయని చెప్పారు. దీని మీద హైకోర్టు ఏ విధమైన తీర్పు ఇస్తుంది అన్నది ఆసక్తిని రేపుతోంది.

బీసీ రిజర్వేషన్ల మీద :

ఇక స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లు 34 శాతం పెంచుతూ ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మీద కూడా ప్రైవేట్ వ్యక్తులు కొందరు పిటిషన్ దాఖలు చేశారు. మొత్తం రిజర్వేషన్లు యాభై శాతానికి మించరాదని రాజ్యాంగపరమైన విధానం ఉండగా ఏపీలో యాభై శాతం పైగా రిజర్వేషన్లు ఎలా ఇస్తారు అన్నది ఆ పిటిషన్ సారాంశం. ఈ విషయంలో కూడా హైకోర్టు విచారణ జరిపింది. మరి కోర్టు తీర్పు దీని మీద ఎలా ఇస్తుంది అన్నది అంతా వేచి చూస్తున్నారు. ఇవే కాకుండా స్థానిక సంస్థల ఎన్నికలు ఏపీలో సమయానికి నిర్వహించాలని మరో పిటిషన్ కూడా దాఖలు అయింది. దాని మీద సైతం కోర్టు విచారించింది.

సర్వత్రా ఆసక్తి :

ఇక చాలా చోట్ల పంచాయతీలను మున్సిపాలిటీల్లో విలీనం చేయడాన్ని సవాల్ చేస్తూ పిటిషన్ దాఖలు అయింది వీటి మీద కూడా హైకోర్టు తీర్పు ఏమిటో చూడాలి. మొత్తం మీద చూస్తే అయిదు పిటిషన్ల మీద ఉన్నత న్యాయస్థానం తీర్పు ఇవ్వనుంది అని అంటున్నారు. ఇక హైకోర్టు తీర్పు తర్వాత స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్‌పై ఒక స్పష్టత రానుంది. మొత్తం మీద ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల కోసం సర్వం సిద్ధం చేసుకున్న ఎన్నికల సంఘం కూడా ఈ తీర్పు కోసం చూస్తోంది. అలాగే రాజకీయ పార్టీలు ఆశావహులు అంతా హైకోర్టు వైపే దృష్టి సారించారు.