Begin typing your search above and press return to search.

ఏకగ్రీవ ఎన్నికలు : అప్పుడు, ఇప్పుడు తేడా ఏంటి? ఆసక్తికర లెక్కలు

విపక్షం వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు 2021లో స్థానిక సంస్థల ఎన్నికలు జరిగాయి. అప్పట్లో అధికార పక్షం ఏకపక్షంగా వ్యవహరించి 99 శాతం విజయాలు నమోదు చేసిందని టీడీపీ ఆరోపిస్తోంది.

By:  Tupaki Political Desk   |   29 Oct 2026 5:58 PM IST
ఏకగ్రీవ ఎన్నికలు : అప్పుడు, ఇప్పుడు తేడా ఏంటి? ఆసక్తికర లెక్కలు
X

ఏపీలో స్థానిక ఎన్నికల చుట్టూ ఆసక్తికర చర్చ జరుగుతోంది. పట్టణ స్థానిక సంస్థలతోపాటు జిల్లా, మండల పరిషత్ పాలకవర్గాలు, పంచాయతీలకు వరుసగా ఎన్నికలు నిర్వహిస్తుండటంతో ఎటు చూసినా రాజకీయ నాయకుల హడావుడే కనిపిస్తోంది. ప్రధానంగా అధికార, విపక్షాల మధ్య హోరాహోరీ పోరు నడుస్తుందని భావించగా, కొన్నిచోట్ల ఏకగ్రీవంగా ఎన్నికల తంతు ముగించడం హాట్ టాపిక్ అవుతోంది. తమ నామినేషన్లు స్వీకరించకుండా, దౌర్జన్యంతో ఏకగ్రీవం చేసుకున్నారని విపక్షం ఆరోపిస్తుండగా, అభ్యర్థులు లేకపోవడంతో విపక్షం ఇలాంటి ఆరోపణలు చేస్తోందని అధికార కూటమి వాదిస్తోంది. అయితే ఏకగ్రీవ ఎన్నికలు జరిగిన చోట అధికారపక్షం బలప్రయోగం చేసిందనే ప్రచారమే ఎక్కువగా జరుగుతోందని సోషల్ మీడియాలో పలువురు విశ్లేషిస్తున్నారు. దీనిని సమర్థించుకునేందుకు గత ప్రభుత్వంలో వైసీపీ నేతలు దౌర్జన్యం చేశారని, వారిపై రివేంజ్ కోసం ఇప్పుతు తమవారు ఏకగ్రీవాలు చేసుకున్నారని కూటమి నేతలు చెప్పుకొస్తున్నారు. దీంతో అప్పుడు ఏం జరిగింది, ఇప్పుడు ఏం జరుగుతోందన్న చర్చ ఎక్కువగా నడుస్తోంది.

వైసీపీ హయాంలో ఏమైంది?

విపక్షం వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు 2021లో స్థానిక సంస్థల ఎన్నికలు జరిగాయి. అప్పట్లో అధికార పక్షం ఏకపక్షంగా వ్యవహరించి 99 శాతం విజయాలు నమోదు చేసిందని టీడీపీ ఆరోపిస్తోంది. ఆ సమయంలో దాడులు, దౌర్జన్యాలను నిరసిస్తూ టీడీపీ బహిష్కరించినట్లు చెబుతున్నారు. దీంతో అప్పట్లో రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 20 నుంచి 25 శాతం స్థానాలు ఏకగ్రీవమయ్యాయని గణాంకాలు చెబుతున్నాయి. ఈ ఏకగ్రీవ విజయాలు ఎన్నికల చరిత్రలోనే ఒక రికార్డుగా నమోదయ్యాయని అంటున్నారు. అప్పట్లో రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 660 జడ్పీటీసీ స్థానాలకు ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైతే 126 స్థానాలలో పోటీ లేకుండా వైసీపీ గెలుచుకుందని రికార్డులు చెబుతున్నాయి. అదేవిధంగా దాదాపు 10 వేల ఎంపీటీసీ స్థానాల్లో 2,371 స్థానాలను వైసీపీ ఏకగ్రీవం చేసుకున్నట్లు చెబుతున్నారు. ఇదేసమయంలో కడప, కర్నూలు, అనంతపురం, నెల్లూరు వంటి జిల్లాలను వైసీపీ ఏకగ్రీవంగా గెలుచుకుందని అంటున్నారు.

రాయలసీమ, పల్నాడులో అధికం

ప్రధానంగా రాయలసీమ, పల్నాడు ప్రాంతాల్లో అత్యధిక ఏకగ్రీవాలు నమోదైనట్లు చెబుతున్నారు. మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నియోజకవర్గమైన పుంగనూరు పరిధిలోని 84 గ్రామాల్లో 84 గ్రామాలు ఏకగ్రీవమయ్యాయి. పల్నాడులోని మాచర్ల నియోజకవర్గంలో 74 గ్రామాలకు 74 ఏకగ్రీవంగా వైఎస్సార్‌సీపీ కైవసం చేసుకుంది. ఇక మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రెడ్డి సొంత నియోజకవర్గమైన పులివెందులలో మెజారిటీ జడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలు ఏకగ్రీవంగా గెలుపొందారు. ఇక మున్సిపాలిటీల్లో మొత్తం 2,794 వార్డులు ఉండగా, సుమారు 578 వార్డులు వైసీపీకి ఏకగ్రీవమయ్యాయి. పుంగనూరు మున్సిపాలిటీలోని 31 వార్డులలో అన్ని స్థానాలూ ఏకగ్రీవమై, కౌన్సిల్ మొత్తం పోటీ లేకుండానే ఎన్నికైంది.

పంచాయతీలు ఏకపక్షం

అదేవిధంగా మాచర్ల, పులివెందుల మున్సిపాలిటీలు ఏకగ్రీవంగా వైఎస్సార్‌సీపీ ఖాతాలోకి వెళ్లాయని అంటున్నారు. ఇక 2021 ఫిబ్రవరిలో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో రాష్ట్రవ్యాప్తంగా 2,197 సర్పంచ్ స్థానాలు ఏకగ్రీవంగా ఎన్నికయ్యాయి. ఇందులో ఒక్క కడప జిల్లాలోనే అత్యధికంగా 76 శాతం స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. చిత్తూరు, కర్నూలు, గుంటూరు (పల్నాడు) జిల్లాల్లో కూడా వందలాది పంచాయతీలు ఏకగ్రీవ తీర్మానాలతో సర్పంచులను ఎన్నుకున్నాయి. ఇవన్నీ బలవంతుపు ఏకగ్రీవాలుగా చెబుతున్న కూటమి నేతలు ఇప్పుడు అదే పంథాను అనుసరించడంపై పరిశీలకులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. గత ప్రభుత్వంలో తప్పు చేశారని చెబుతూ ఇప్పుడు అదే తప్పును ప్రోత్సహించడంపై ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

కూటమిదీ అదే దారేనా?

ఇక గత ప్రభుత్వంపై విమర్శలు గుప్పించిన కూటమి నేతలు ఇప్పుడు చాలాచోట్ల ఏకగ్రీవంగా ఎన్నికలను నిర్వహించడంపై వాడివేడి చర్చ జరుగుతోంది. ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికల్లో 17 మున్సిపాలిటీలను, 130 మండల పరిషత్, 76 జడ్పీటీసీ స్థానాలను కూటమి పార్టీలు ఏకగ్రీవంగా గెలుచుకున్నట్లు చెబుతున్నారు. గత ఎన్నికల్లో వైసీపీ దూకుడు చూపిన రాయలసీమ, పల్నాడు ప్రాంతాల్లో రివేంజ్ తీర్చుకునేలా కూటమి నేతలు ఏకగ్రీవాలు నమోదు చేసిందని చెబుతున్నారు. అయితే వైసీపీ మాదిరిగానే టీడీపీ కూటమి సైతం బలవంతపు ఏకగ్రీవాలకు పాల్పడిందని ఎక్కువగా విమర్శలు వస్తున్నాయి. ఇదే సమయంలో కర్నూలు, నంద్యాల జిల్లాలలో టీడీపీ-వైసీపీ నేతలు అవగాహనతో ఏకగ్రీవాలు చేసుకోవడం చర్చనీయాంశం అవుతోంది.

ప్రస్తుత లెక్క ఇది..

గత ప్రభుత్వంలో రికార్డు స్థాయిలో ఏకగ్రీవ ఎన్నికలు జరిగితే, ఈ సారి అంత భారీగా కాకపోయినా చాలాచోట్ల ఏకగ్రీవాలు నమోదు కావడం రాజకీయ వర్గాలను ఆశ్చర్యానికి గురిచేస్తోందని చెబుతున్నారు. మొత్తం 1985 ఎంపీటీసీ స్థానాలు కూటమి ఏకగ్రీవంగా గెలుచుకోగా, వైసీపీ కూడా 93 ఎంపీటీసీ, ఒక జడ్పీటీసీ స్థానాన్ని ఏకగ్రీవంగా కైవసం చేసుకుందని లెక్కలు తెలియజేస్తున్నాయి. గతంలో వైసీపీ ఏకగ్రీవంగా గెలుచుకున్న పులివెందుల, పుంగనూరు, మాచర్ల, గురజాల వంటి నియోజకవర్గాల్లో ప్రస్తుతం సీన్ రివర్స్ అయిందని అంటున్నారు.

పుంగనూరు మున్సిపాలిటీని టీడీపీ ఏకగ్రీవంగా దక్కించుకోగా, పులివెందుల నియోజకవర్గంలోని ఏడు మండల పరిషత్తులు, మూడు జడ్పీటీసీలను టీడీపీ ఏకపక్షంగా దక్కించుకుందని అంటున్నారు. అదేవిధంగా పల్నాడు జిల్లాలోని మాచర్ల, నరసారావుపేట, పెదకూరపాడు, గురజాల నియోజకవర్గాల్లో వంద శాతం స్థానాలను కూటమి పార్టీలు కైవసం చేసుకున్నట్లు చెబుతున్నారు. ఇక వైసీపీ ఏకగ్రీవంగా గెలిచిన 93 స్థానాల్లో 69 కర్నూలు, నంద్యాల జిల్లాల్లో ఉన్నాయి. ఈ జిల్లాల్లో బనగానపల్లి, డోన్, మంత్రాలయం, పత్తికొండ నియోజకవర్గాల్లో టీడీపీ-వైసీపీ కలిసి ఏకగ్రీవం చేసుకున్నట్లు చెబుతున్నారు. మంత్రాలయం నియోజకవర్గంలోని కోసిగి మండలంలో 20 ఎంపీటీసీ స్థానాలు ఉండగా, టీడీపీ 12, వైసీపీ 7, బీజేపీ 1 చొప్పున పంచుకున్నాయి. అదేవిధంగా పత్తికొండలో 13 స్థానాలు ఏకగ్రీవమైతే టీడీపీ 9, వైసీపీ 3 దక్కించుకున్నాయి. ఇక వెల్దుర్తి మండలంలో కూడా వైసీపీ 4, టీడీపీ 11 చోట్ల ఏకగ్రీవం చేసుకున్నాయి.