Begin typing your search above and press return to search.

ఎమ్మెల్యేల్లో అతడే పవర్ ఫుల్.. విపక్షంలో ఉంటూ అధికారపక్షానికి ముప్పుతిప్పలు

నేను రాజు - నేనే మంత్రి అన్నట్లు ఉంటుంది ప్రస్తుత ప్రజాప్రతినిధుల పరిస్థితి.

By:  Tupaki Political Desk   |   1 Oct 2026 5:00 AM IST
ఎమ్మెల్యేల్లో అతడే పవర్ ఫుల్.. విపక్షంలో ఉంటూ అధికారపక్షానికి ముప్పుతిప్పలు
X

నేను రాజు - నేనే మంత్రి అన్నట్లు ఉంటుంది ప్రస్తుత ప్రజాప్రతినిధుల పరిస్థితి. తమ అనుకూల ప్రభుత్వం అధికారంలో ఉంటే చాలు నియోజకవర్గంలో తన మాటే శాసనం అన్నట్లు రాజ్యం నడవాలన్నది నేతల ఆలోచన. ముఖ్యమంత్రి, మంత్రి వంటి పదవులు ఒక ఎత్తైతే.. నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలే అన్నీ అని చెప్పుకుంటున్నారు ఇప్పుడు. ప్రధానంగా అధికార పార్టీకి చెందిన వారు అయితే ఇక ఎదురులేనట్లే.. ఎమ్మెల్యే అనుమతి లేకుండా చిన్న కాగితం కూడా కదపడానికి వీలు లేని పరిస్థితులే ఇప్పుడు ఉన్నాయి. అయితే అధికారం లేకపోయినా, తన నియోజకవర్గంలో అంతకుమించి అన్నట్లు అధికారం చలాయిస్తున్నారు వైసీపీకి చెందిన ఓ ఎమ్మెల్యే. రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న రాజకీయ పరిస్థితుల్లో విపక్ష నేతలపై తీవ్ర అణచివేత, ఆంక్షలు అమలు అవుతున్నాయనే ప్రచారం నడుమ రాయలసీమకు చెందిన వైసీపీ ఎమ్మెల్యే తన నియోజకవర్గంలో పవర్ ఫుల్ అంటూ ముద్ర వేసుకోవడమే హాట్ టాపిక్ అవుతోంది.

రాష్ట్రంలో ప్రస్తుతం స్థానిక ఎన్నికలు జరుగుతున్నాయి. మున్సిపల్ ఎన్నికలకు ఆదివారం ఓటింగ్ జరుగుతుంది. జడ్పీ, మండల పరిషత్ ఎన్నికలకు ఇంకా ఐదు రోజుల సమయం ఉంది. అయితే స్థానిక పోరుకు షెడ్యూల్ విడుదలైన నుంచి రాష్ట్రంలో అధికార కూటమి నేతల హవా చూపుతున్నారనే ప్రచారమే ఎక్కువ జరుగుతోంది. విపక్షానికి చెందిన నేతలు పోటీ చేయాలని ఆలోచన ఉన్నా, కొన్ని చోట్ల నామినేషన్లు వేయలేకపోయారని చెబుతున్నారు. మాజీ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి సొంత నియోజకవర్గం పులివెందులలోనూ ఇదే పరిస్థితి ఎదురైనట్లు పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. పులివెందుల మున్సిపాలిటీలో 20 వార్డులు, గ్రామీణ ప్రాంతంలో 3 జడ్పీటీసీ స్థానాలు, 7 మండల పరిషత్ అధ్యక్ష పదవులను కూటమి ఏకగ్రీవం చేసుకుంది. ఈ పరిస్థితుల్లో విపక్ష ఎమ్మెల్యేలు బయటకు రావడమే కష్టంగా ఉందని, ప్రభుత్వం తమపై తీవ్ర నిర్భంధం విధిస్తోందని ఆరోపిస్తున్నారు.

అయితే, రాయలసీమకు చెందిన ఒక వైసీపీ ఎమ్మెల్యే మాత్రం రివర్స్ అటాక్ తో రాజకీయ చర్చకు కేంద్రం అయ్యారు. తన నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో అధికార కూటమి అభ్యర్థులకు చుక్కలు చూపిస్తున్నారని వార్తలు వస్తున్నాయి. తన అనుమతి లేనిదే కాకి కూడా కదల్లేని నియోజకవర్గంలో అధికార కూటమి నేతలు ఎలా అడుగు పెడతారు? అన్న ఆయన ఆలోచన కారణంగా టీడీపీ జడ్పీటీసీ, ఎంపీటీసీ అభ్యర్థులు పోలీసులను వెంట బెట్టుకుని ప్రచారం చేసుకోవాల్సి వస్తోందన్న వార్తలు తీవ్ర ఆసక్తి రేపుతున్నాయి. రాష్ట్రంలో మొత్తం 175 మంది ఎమ్మెల్యేలు ఉంటే, విపక్షానికి కేవలం 11 మంది బలం మాత్రమే ఉంది. ఇందులో చాలామంది ప్రభుత్వంపై పోరాడేందుకు తీవ్రంగా ప్రయత్నించారని అంటున్నారు. మరికొందరైతే లోలోల రాజీ పడిపోయారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.

ఇలాంటి పరిస్థితుల్లో విపక్షానికి చెందిన ఈ ఎమ్మెల్యే తీరు మాత్రం రాజకీయంగా ఆసక్తికర చర్చకు తెరలేపిందని అంటున్నారు. కూటమి గాలిని తట్టుకుని నిలబడిన ఆ ఎమ్మెల్యే ఇప్పటికీ నియోజకవర్గంలో తనకు ఎదురే లేదన్నట్లు రాజకీయం నడిపిస్తుండటమే హాట్ టాపిక్ అవుతూందని అంటున్నారు. ఆ ఎమ్మెల్యే జోరుకు అధికార కూటమి కూడా దాసోహం అవ్వాల్సి వస్తోందని చెబుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా కూటమి ప్రభుత్వం బలంగా ఉందని చెబుతున్న సమయంలో ప్రభుత్వ అనుకూల పార్టీ వారు తమ గుమ్మం ముందుకు వచ్చినా, ఆ నియోజకవర్గంలోని కొన్ని గ్రామాల వారు తలుపు కూడా తీయడం లేదన్న వార్తలు అత్యంత ఆసక్తికరంగా మారాయని అంటున్నారు. మొత్తానికి అధికార కూటమికి ఆ ఎమ్మెల్యే కొరుకుడుపడటం లేదన్న విషయంపై హాట్ డిబేడ్ జరుగుతోంది.