ఈవీఎం కాదు బ్యాలెట్ పేపర్ కాదు...వైసీపీ చాయిస్ అదేనా ?
సరిగ్గా పదిహేను నెలల క్రితం హోరా హోరీగా జరిగిన ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ అత్యంత ఘోరంగా ఓటమి పాలు అయింది.
By: Satya P | 16 Sept 2025 8:00 PM ISTసరిగ్గా పదిహేను నెలల క్రితం హోరా హోరీగా జరిగిన ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ అత్యంత ఘోరంగా ఓటమి పాలు అయింది. ఫలితాలు వచ్చిన రోజున సాయంత్రం వైసీపీ అధినేత ముఖ్యమంత్రి హోదాలో జగన్ అన్న మాటలు ఆయన ఆవేదనతో కూడిన వ్యాఖ్యలు అందరికీ గుర్తుండే ఉంటాయి. ఏమి జరిగిందో ఏమో తెలియదు ఫలితాలు ఇలా వచ్చాయి అని ఆయన అన్నారు. అంటే సాఫీగా సజావుగా ఎన్నికలు జరగలేదు అన్న అనుమానం ఏదో ఆయన అంతర్లీనంగా బయటపెట్టినట్లుగా భావించారు. అయితే జగన్ నేరుగా అనలేదు కానీ చాలా మంది వైసీపీ నేతలు మాత్రం ఈవీఎంల వల్లనే ఓటమి సంభవించింది అని అంటూ వచ్చారు. అంతే కాదు తాము ఓడలేదు ఓడించారని కూడా ఘాటైన వ్యాఖ్యలే చేశారు.
బ్యాలెట్ పేపర్ అంటూ :
ఇక ఆ తరువాత జరిగిన హర్యానా ఎన్నికల ఫలితాలను చూసిన మీదట జగన్ ఈవీఎంలు వద్దు బ్యాలెట్ పేపర్ మీదనే ఎన్నికలు జరిపించాలని డిమాండ్ చేశారు. నిజానికి ఈ డిమాండ్ ని ఇండియా కూటమి నేతలు ఆ ఎన్నికల్లో పరాజయం సందర్భంగా చేశారు. ఇక అదే వరసలో మహారాష్ట్ర ఎన్నికలు జరిగాయి వాటి ఫలితాలను ఇండియా కూటమి సీరియస్ గానే తీసుకుంది. ఈ మధ్యనే రాహుల్ గాంధీ అయితే ఈవీఎంల గురించిన దాని కంటే ఓట్ల చోరీ అని కొత్త విమర్శలు చేస్తున్నారు. ఏకంగా ఓట్లే లేకుండా చేస్తున్నారు అని ఆయన ఫైర్ అవుతున్నారు. అంటే ఈవీఎం అయినా బ్యాలెట్ అయినా ఓట్లు వేయాల్సిన వారివి తీసేస్తే ఇలా ఫలితాలు అధికార పార్టీకే అనుకూలంగా ఉంటాయన్న వాదనను ఇండియా కూటమి ముందుకు తెస్తోంది.
పులివెందుల ఫలితంతో :
ఇదే క్రమంలో గత నెలలో పులివెందుల ఒంటిమెట్ట జడ్పీటీసీలకు ఉప ఎన్నికలు జరిగాయి. ఈ రెండూ కూడా బ్యాలెట్ పేపర్ మీదనే జరిగాయి. అయితే ఈ రెండు ఫలితాలు వైసీపీకి దిమ్మ దిరిగేలా ఉన్నాయి. జగన్ సొంత ఊరు అయిన పులివెందుల ఫలితం అయితే మరీ దెబ్బేసేలా ఉంది. పోటీ చేసిన వైసీపీకి డిపాజిట్లు కూడా రాలేదు. దాంతో పాటుగా ఒంటిమెట్టలోనూ అదే ఫలితం వచ్చింది. ఈ రెండూ చూశాక వైసీపీ నేతలు మొదట అంతా దౌర్జన్యం అధికార పార్టీ ఆధిపత్యం అన్నారు కానీ ఆ మీదట మాత్రం ఏమీ పాలుపోని స్థితికి వచ్చారని అంటున్నారు.
లోకల్ ఫైట్ లో ఈవీఎం :
ఈ క్రమంలో కొత్త ఏడాది లోగానే రాష్ట్రంలో స్థానిక సంస్థలకు ఎన్నికలు జరిపించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్ణయించింది. అది కూడా ఈవీఎంలతోనే అని అంటున్నారు. గతంలో బ్యాలెట్ పేపర్ తో లోకల్ బాడీ ఎన్నికలు జరిగేవి. ఈసారి మాత్రం సిస్టం మారుస్తున్నారు. అయితే వైసీపీ దీని మీద ఏ విధంగా రియాక్ట్ అవాలో కూడా అర్ధం కాని పరిస్థితిలో పడిందా అన్న చర్చ అయితే వస్తోంది. జగన్ ఇటీవల నిర్వహించిన ప్రెస్ మీట్ లో ఒక విలేకరి లోకల్ బాడీ ఎన్నికల్లో ఈవీఎంలను తెస్తున్నారు వాటి ద్వారానే ఎన్నికలు అని చెబుతున్నారు. మీరేమంటారు అంటే దానికి జగన్ ఏ సిస్టం అయినా ఎన్నికలు జరిపించేది చంద్రబాబు పోలీసులతోనే కదా అని పెదవి విరిచారు. విషయం ఈవీఎంలది కాదు పేపర్ బ్యాలెట్ లది కాదని ఎన్నికలు నిష్పక్షపాతంగా జరగాలి అని ఆయన చెప్పారు. అలా జరగనప్పుడు ఏమి చేసినా ఒక్కటే కదా అని ఆయన కాస్తా వైరాగ్యమే వినిపించారు.
కేంద్ర బలగాలతో అయినా :
కేంద్ర బలగాలని పెట్టి ఏపీలో స్థానిక ఎన్నికలు జరిపించాలని వైసీపీ అంటోంది. కానీ కేంద్రంలోనూ ఎన్డీయే ఉంది. ఏపీలోనూ అదే ప్రభుత్వం ఉంది. అలాంటపుడు వారు వచ్చినా ఎన్నికలు సాఫీగా జరిగాయని వైసీపీ నమ్ముతుందా అన్నదే పెద్ద ప్రశ్న అని అంటున్నారు. సాధారణంగా లోకల్ బాడీ ఎన్నికలు అయినా ఉప ఎన్నికలు అయినా అధికారంలో ఉన్న ప్రభుత్వం వైపే ఎక్కువగా మొగ్గు ఉంటుంది. ఎటూ ప్రభుత్వం మారదు కాబట్టి ఆ ప్రభుత్వం అందించే ఫలితాలను తాము అందుకోవాలనే జనాలు చూస్తారు. 2021లో వైసీపీ అధికారంలో ఉండగా లోకల్ బాడీ ఎన్నికలు పెట్టింది. నూటికి ఎనభై నుంచి తొంబై శాతం ఫలితాలు ఆ పార్టీకే అనుకూలంగా వచ్చాయి.
బాయ్ కాట్ లోకల్ ఫైట్ :
ఇపుడు కూటమి కూడా అలాగే గెలుచుకోవచ్చు. మరి ఆనాడు కొంత వరకూ ఎన్నికలు అయ్యాక టీడీపీ ఎన్నికలను బాయ్ కాట్ చేసింది మరిపుడు అసలు ఎన్నికల్లో వైసీపీ పాల్గొంటుందా అన్నదే ఒక ప్రశ్న. ఎన్నికల్లో దౌర్జన్యాలు అని సాకు చూపించి తప్పుకుంటుందా అని కూడా చర్చ సాగుతోంది. ఏది ఏమైనా తప్పు ఈవీఎంలదా లేక బ్యాలెట్ పేపర్లదా అన్నది వైసీపీకి అర్థం కావడం లేదా లేక ఏ రాయి అయినా ఒక్కటే పళ్ళూడడానికి అన్న సామెతను గుర్తు చేసుకుంటూ బాయ్ కాట్ లోకల్ ఫైట్ అని అంటుందా అన్నదే చూడాల్సి ఉంది మరి.
