Begin typing your search above and press return to search.

టీడీపీ - వైసీపీ: నామినేషన్ వేళ రచ్చలో ఎవరు ఎక్కువ? ఎవరు తక్కువ?

ఎవరిని నమ్మాలి? ఎవరిని నమ్మకూడదు? మీడియా.. సోషల్ మీడియా.. వేదిక ఏదైనా.. ఎవరి వాదనలు వారివి అన్నట్లుగా మారాయి.

By:  Garuda Media   |   23 Oct 2026 12:42 PM IST
టీడీపీ - వైసీపీ: నామినేషన్ వేళ రచ్చలో  ఎవరు ఎక్కువ? ఎవరు తక్కువ?
X

ఎవరిని నమ్మాలి? ఎవరిని నమ్మకూడదు? మీడియా.. సోషల్ మీడియా.. వేదిక ఏదైనా.. ఎవరి వాదనలు వారివి అన్నట్లుగా మారాయి. ఒకరిపై ఒకరు నిందలు.. ఆరోపణలు చేసుకుంటూ.. ఒకరికి మించి మరొకరు ఆధారాలు చూపిస్తూ ఏపీ రాజకీయ వాతావరణాన్ని మాత్రమే కాదు.. పార్టీల విభేధాలు వ్యక్తిగత కక్షల స్థాయికి దించేసిన వైనం తాజాగా జరుగుతున్న స్థానిక ఎన్నికల్లో స్పష్టంగా కనిపిస్తోంది. ఏపీలో జరుగుతున్న పురపాలక ఎన్నికల్లో నామినేషన్ల పర్వాన్ని చూస్తే.. ఒకప్పటి రాష్ట్రమేనా? అన్న సందేహం కలుగక మానదు. నువ్వు ఒకటంటే.. నేను రెండు అంటా? అన్నట్లు ఎవరు మాత్రం తగ్గేదే లేదన్నట్లుగా వ్యవహరించిన వైనం చూస్తుంటే.. రానున్న రోజుల్లో ఏపీ రాజకీయాలు మరింత దారుణంగా.. దౌర్జన్యపూరితంగా మారతాయన్న విషయం అర్థం కాక మానదు.

ఏపీలో జరుగుతున్న స్థానిక ఎన్నికలకు సంబంధించి అధికార.. విపక్షాలకు దూరంగా.. ఏ పార్టీ వైపు మొగ్గు చూపకుండా సాపేక్షంగా.. తప్పు ఎవరిదైనా వేలెత్తి చూపించే ఉద్దేశంతో ఉన్నవారికి.. నామినేషన్ల పర్వంలో అభ్యర్థులు దాఖలు చేసే నామినేషన్ పత్రాల్ని అందరూ చూస్తుండగా.. పోలీసులు సమక్షంలోనే దౌర్జన్యంగా లాగేసుకొని పత్రాల్ని చించేస్తున్న వైనం చూసినప్పుడు.. ఇదేం దిక్కుమాలిన రాజకీయం? అనుకోకుండా ఉండలేం.

ఈ సందర్భంగా ఈ తరహా అరాచకానికి బాధ్యులు ఎవరు? బాధితులు ఎవరు? అన్న ప్రశ్నకు సమాధానం వెతికటం అంత సులువైన విషయం కాదు. ఎందుకంటే.. ఇక్కడ ఎవరు తక్కువ తినలేదన్నదే అసలు నిజం కావటమే దీనికి కారణం. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలలో అధికార టీడీపీ.. విపక్ష వైసీపీకి చెందిన వారి వీడియోలు ఉన్నాయి. కొన్నింట్లో టీడీపీ బాధ్యులుగా.. వైసీపీ బాధిత పక్షంగా ఉంటే.. మరికొన్ని వైరల్ వీడియోల్లో వైసీపీ బాధ్యులుగా.. టీడీపీ బాధిత పక్షంగా ఉండటం కనిపిస్తుంది.

నామినేషన్ పత్రాల్ని బలవంతంగా లాక్కొని చించేస్తున్న వీడియోల్లో ఉన్న వారు ఏ పార్టీకి చెందిన వారు? అన్నది చూస్తే.. రెండు పార్టీలకు చెందిన వారు ఉండటం కనిపిస్తుంది. అయితే.. ఈ తరహా ఉదంతాలు ఎక్కువగా అధికార టీడీపీకి చెందిన వారు చేస్తున్నట్లుగా వైసీపీ నేతలు ఆరోపిస్తుంటే.. అధికారంలో ఉండి కూడా విపక్ష హోదా లేని వైసీపీ నాయకుల అరాచకాలకు తాము బలి అవుతున్నట్లుగా టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు.

ఈ గందరగోళంలో ఎవరేం చేశారన్న విషయాన్ని నిష్పక్షపాతంగా చూసినప్పుడు టీడీపీ నేతల దూకుడు.. నామినేషన్ పత్రాల్ని బలవంతంగా లాక్కున్న ఉదంతాలకు సంబంధించిన వీడియోలు ఎక్కువగా వైరల్ అవుతున్నాయి. ఈ సందర్భంగా ఒక్క విషయాన్ని ప్రస్తావించాలి. బాధితులుగా తమను తాము చూపించుకోవటంలో వైసీపీ వారు నూటికి నూరు మార్కుల్ని సొంతం చేసుకోవటం కనిపిస్తుంది. అదేసమయంలో ఈ తరహా ఇమేజ్ ను సొంతం చేసుకోవటంలో అధికార టీడీపీ వెనుకబడి పోయిందని చెప్పక తప్పదు. ఎందుకంటే.. వైసీపీ బలంగా ఉన్న ప్రాంతాల్లో అధికార పార్టీకి చెందిన అభ్యర్థులు బాధితులుగా మారినప్పటికి.. వారి ఆవేదనను బలంగా చూపించే వీడియోలు ఎక్కువగా వైరల్ కాకపోవటమే దీనికి కారణం.

వైసీపీ రాష్ట్ర సమన్వయకర్త రామకృష్ణారెడ్డి వెల్లడించిన వివరాల ప్రకారం ఏపీ వ్యాప్తంగా 11 జిల్లాల్లో మొత్తం 76 హింసాత్మక ఉదంతాలు చోటు చేసుకున్నాయని.. అత్యధికంగా వైఎస్సార్ కడప జిల్లాలో 22, పల్నాడులో 18, అన్నమయ్య - తిరుపతి జిల్లాల్లో 11 ఘటనలు చోటు చేసుకున్నాయని చెప్పారు. అయితే.. ఈ ఆరోపణల్ని అధికార టీడీపీ తీవ్రంగా ఖండిస్తోంది. ఎన్నికల్లో ఓటమి భయంతోనే వైసీపీ డ్రామాలు ఆడుతుందని.. శాంతిభద్రతల సమస్యను ఎత్తి చూపిస్తూ ఎన్నికల్ని వాయిదా వేయించే కుట్ర పన్నుతుందని వారు చెబుతున్నారు.

ఇరు పార్టీల వాదనల్ని పక్కన పెట్టి.. క్షేత్రస్థాయిలో అసలేం జరుగుతుందన్న విషయాన్ని చూస్తే.. ఏ పార్టీకి పట్టు ఉందో.. ఆ పార్టీకి చెందిన వారు తమదైన శైలిలో హడావుడి చేసిన వైనం కనిపిస్తుంది. పెనుగొండ.. కడప.. చిత్తూరు.. శ్రీకాళహస్తి.. పులివెందుల ప్రాంతాల్లో వైసీపీ అభ్యర్థుల చేతుల్లో నుంచి నామినేషన్ పత్రాల్ని టీడీపీ వర్గీయులు లాక్కొని చించేసినట్లుగా వీడియో ఆధారాలు కనిపిస్తున్నాయి. అదే సమయంలో అధికార పార్టీ అభ్యర్థుల మీదా పుంగనూరులోని సదుం ప్రాంతం.. రాయచోటి.. మాచర్ల లాంటి వైసీపీ బలంగా ఉన్న చోట్ల టీడీపీ అభ్యర్థులు.. నేతలపై దాడులు జరిగాయి. చిత్తూరులో గాయపడి.. వాకర్ సాయంతో నామినేషన్ వేసేందుకు వెళుతున్న టీడీపీ మహిళా అభ్యర్థి అరుణపై జరిగిన తోపులాట.. వాకర్ వదిలేసి ఫైల్ కోసం వెళ్లిన వీడియో వైరల్ అయ్యింది.

గురువారం ఒక్కరోజునే పరిగణలోకి తీసుకుంటే.. అధికార టీడీపీ.. విపక్ష వైసీపీలు ఎవరికి వారు తగ్గేదేలే.. అన్నట్లుగా వ్యవహరించిన వైనం కనిపిస్తుంది. కర్నూలు.. అన్నమయ్య, శ్రీసత్యసాయి, అనంతపురం జిల్లాల్లో వైసీపీ నాయకులు, క్యాడర్ టీడీపీ అభ్యర్థులపై దాడులకు దిగి.. నామినేషన్లు వేయకుండా అడ్డుకునే ఉదంతాలు నమోదయ్యాయి. అదే సమయంలో పల్నాడు,మార్కాపురం, తిరుపతి జిల్లాలో పలుచోట్ల వైసీపీ అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయకుండా దాడులకు దిగిన వైనాలు చోటు చేసుకున్నాయి. పలు ఉదంతాల్లో పోలీసులకు సైతం తీవ్ర గాయాలయ్యాయి. పలు చోట్ల దాడుల కారణంగా వాహనాలు దగ్థమయ్యాయి. కొన్ని చోట్ల జనసేన క్యాడర్ సైతం వైసీపీ అభ్యర్థులను అడ్డుకోవటం.. దాడులకు దిగటం గమనార్హం.

నామినేషన్ల సందర్భంగా పార్టీల తీరు మాత్రమే కాదు పోలీసుల తీరుపైనా విమర్శలు వెల్లువెత్తాయి. కొన్నిచోట్ల అధికార టీడీపీకి కొమ్ముకాస్తున్నట్లు వైసీపీ నేతలు ఆరోపించగా.. మరికొన్నిచోట్ల వైసీపీకి అనుకూలంగా వ్యవహరిస్తూ టీడీపీ నేతలు.. కార్యకర్తలపై లాఠీలతో విరుచుకుపడ్డారన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. శ్రీసత్యసాయి జిల్లాలో టీడీపీ శ్రేణులపై పోలీసులు లాఠీలకు పని చెప్పటంతో పలువురికి గాయాలైనట్లుగా చెబుతున్నారు. చెన్నైకొత్తపల్లిలో ఎంపీడీవో కార్యాలయంలో ఏర్పాటు చేసిన నామినేషన్ కేంద్రం వద్దకు టీడీపీ అభ్యర్థులు రాగా.. వారిని కాసేపు ఆగాలని పోలీసులు అడ్డుకున్నారు. అదే సమయంలో వైసీపీ అభ్యర్థులను మాత్రం లోపలకుపంపి తమను అడ్డుకున్నారంటూ రామగిరి సీఐ ఇస్మాయిల.. చెన్నైకొత్తపల్లి ఎస్ఐ సత్యనారయణతో వాగ్వాదానికి దిగారు. దీంతో పోలీసులు లాఠీలకు పని చెప్పినట్లుగా టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఇదంతా చూసినప్పుడు అర్థమయ్యేది ఒక్కటే.. పోటీ తీవ్రంగా ఉన్న ప్రాంతాల్లో.. అధిపత్య పోరు అత్యధిక స్థాయిలో ఉన్న చోట్ల.. ఏ పార్టీ అయితే బలంగా ఉందో.. అక్కడ తమ పట్టును ప్రదర్శించేందుకు ఎంతకైనా తగ్గేదే లేదన్నట్లుగా వ్యవహరించిన వైనం కనిపిస్తుంది. మొత్తంగా చూస్తే.. అధికార టీడీపీ.. విపక్ష వైసీపీ దొందూ దొందే అన్నట్లుగా పరిస్థితులు ఉన్నాయన్న మాట వినిపిస్తోంది. కాకుంటే.. అధికార పార్టీని బాధ్యులుగా చూపే విషయంలో వైసీపీ కాస్త పైచేయి సాధించగా.. అధికారంలో చేతిలో ఉండి కూడా రాజకీయ ప్రత్యర్థులపై పట్టు ప్రదర్శించే విషయంలో టీడీపీ కాస్తంత వెనుకబడిందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.