కూటమి సీట్ల షేర్ : టీడీపీ 73 శాతం...జనసేన 20 శాతం...బీజేపీ 7 శాతం !
ఎట్టకేలకు కూటమి షేర్ అన్నది సాఫీగా సామరస్యంగా కుదిరింది. తొలి విడతలో జరిగే 123 పట్టన స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమిలోని మూడు పార్టీలు సీట్లను చర్చల ద్వారా సర్దుబాటు చేసుకున్నాయి.
By: Satya P | 16 Oct 2026 8:05 AM ISTఎట్టకేలకు కూటమి షేర్ అన్నది సాఫీగా సామరస్యంగా కుదిరింది. తొలి విడతలో జరిగే 123 పట్టన స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమిలోని మూడు పార్టీలు సీట్లను చర్చల ద్వారా సర్దుబాటు చేసుకున్నాయి. ఇందులో 17 మున్సిపల్ కార్పోరేషన్లు, 106 మున్సిపాలిటీలు, నగర పంచాయతీలు ఉన్నాయి. ఈ మొత్తం సీట్లలో టీడీపీకి 89, జనసేనకు 25, బీజేపీకి 9 స్థానాలు దక్కాయి. దీనిని బట్టి చూస్తే కూటమిలో సీట్ల షేర్ లో పెద్దన్నగా ఉన్న టీడీపీకి 73 శాతం సీట్ షేర్ దక్కగా జనసేనకు 20 శాతం సీట్ షేర్ లభించింది. బీజేపీకి 7 శాతం సీటు షేర్ దక్కినట్లు అయింది. ఆ ప్రకారమే సీట్లను కూడా మూడు పార్టీలు పంచుకున్నాయి.
మేయర్ పదవులలో ఇలా :
ఇక మేయర్ పదవులు చూస్తే మొత్తం 17 ఉంటే టీడీపీ 11 సీట్లకు జనసేన 4, బీజేపీ రెండు సీట్లకు పోటీ చేయడం జరుగుతోంది. అలాగే 106 మున్సిపాలిటీలు, నగర పంచాయతీల లెక్క చూసుకుటే ఇక్కడ టీడీపీకి 78, జనసేనకు 21, బీజేపీకి ఏడు స్థానాలలో పోటీ చేయనున్నాయి. జిల్లాలవారీగా పట్టణ స్థానిక సంస్థలను అక్కడ స్థానిక పరిస్థితులు బలాబలాలు అన్నీ అంచనా వేసుకుని మూడు పార్టీలకు సీట్లను పంపిణీ చేశారు. ఈ లెక్కన చూస్తే కొన్ని జిల్లాల్లో జనసేనకు, బీజేపీకి ప్రాధాన్యం లభించింది. అయితే కూటమిలో పెద్దన్నగా టీడీపీకి మెజారిటీ స్థానాలు సహజంగానే దక్కాయి.
జిల్లాల వారీగా :
ఇక జిల్లాల వారీగా చూస్తే కూటమి సర్దుబాటు ఇలా ఉంది. శ్రీకాకుళం జిల్లాలో ఇచ్ఛాపురం, పలాస–కాశీబుగ్గ, ఆమదాలవలస టీడీపీకి దక్కాయి. విజయనగరం జిల్లాలో రాజాం జనసేనకు, బొబ్బిలి టీడీపీకి, నెల్లిమర్ల బీజేపీకి కేటాయించారు. పార్వతీపురం మన్యం జిల్లాలో పాలకొండ, సాలూరు జనసేనకు, పార్వతీపురం టీడీపీకి దక్కాయి. అనకాపల్లి జిల్లాలో యలమంచిలి బీజేపీకి, నర్సీపట్నం టీడీపీకి కేటాయించారు. అలాగే కాకినాడ జిల్లాలో తుని, గొల్లప్రోలు, పిఠాపురం, సామర్లకోట జనసేనకు.. ఏలేశ్వరం, పెద్దాపురం టీడీపీకి దక్కాయి. కోనసీమ జిల్లాలో అమలాపురం, ముమ్మిడివరం జనసేనకు, రామచంద్రపురం టీడీపీకి కేటాయించారు. తూర్పు గోదావరి జిల్లాలో మండపేట, కొవ్వూరు టీడీపీకి, నిడదవోలు జనసేనకు దక్కాయి.
పశ్చిమ గోదావరిలో :
ఇక పశ్చిమ గోదావరి జిల్లాలో నరసాపురం, భీమవరం, తాడేపల్లిగూడెం జనసేనకు కేటాయించగా పాలకొల్లు, ఆకివీడు, తణుకు టీడీపీకి దక్కాయి. ఏలూరు జిల్లాలో చింతలపూడి, జంగారెడ్డిగూడెం, నూజివీడు టీడీపీకి కేటాయించారు. ఎన్టీఆర్ జిల్లాలో తిరువూరు జనసేనకు, కొండపల్లి, నందిగామ, జగ్గయ్యపేట టీడీపీకి దక్కాయి. కృష్ణా జిల్లాలో పెడన జనసేనకు, గుడివాడ, తాడిగడప, ఉయ్యూరు టీడీపీకి కేటాయించారు. అలాగే గుంటూరు, పల్నాడు, ప్రకాశం జిల్లాలలో చూస్తే గుంటూరు జిల్లాలో తెనాలి జనసేనకు, పొన్నూరు టీడీపీకి కేటాయించారు. బాపట్ల జిల్లాలో బాపట్ల బీజేపీకి, రేపల్లె, చీరాల టీడీపీకి దక్కాయి. పల్నాడు జిల్లాలో చిలకలూరిపేట జనసేనకు కేటాయించగా నరసరావుపేట, సత్తెనపల్లి, వినుకొండ, దాచేపల్లి, గురజాల, పిడుగురాళ్ల, మాచర్ల టీడీపీకి దక్కాయి.
ప్రకాశం నెల్లూరు లో :
అదే విధంగా ప్రకాశం జిల్లాలో దర్శి జనసేనకు, అద్దంకి, చీమకుర్తి, కందుకూరు టీడీపీకి కేటాయించారు. మార్కాపురం జిల్లాలో గిద్దలూరు బీజేపీకి, మార్కాపురం, పొదిలి, కనిగిరి టీడీపీకి దక్కాయి. నెల్లూరు జిల్లాలో కావలి బీజేపీకి కేటాయించగా అల్లూరు, ఆత్మకూరు, బుచ్చిరెడ్డిపాలెం, గూడూరు టీడీపీకి దక్కాయి. అలాగే రాయలసీమలోనూ సీట్ల పంపకం లెక్క చూస్తే కనుక తిరుపతి జిల్లాలో నాయుడుపేట, సూళ్లూరుపేట, వెంకటగిరి, శ్రీకాళహస్తి టీడీపీకి కేటాయించారు. చిత్తూరు జిల్లాలో నగరి, పలమనేరు, కుప్పం టీడీపీకి, పుత్తూరు జనసేనకు దక్కాయి. వైఎస్సార్ కడప జిల్లాలో ఎర్రగుంట్ల బీజేపీకి కేటాయించగా బద్వేలు, రాజంపేట, పులివెందుల, కమలాపురం, జమ్మలమడుగు, ప్రొద్దుటూరు, మైదుకూరు టీడీపీకి దక్కాయి.
సీమలో సీట్లు ఇలా :
ఇక అన్నమయ్య జిల్లాలో రాయచోటి, బి.కొత్తకోట, మదనపల్లె, పుంగనూరు టీడీపీకి కేటాయించారు. నంద్యాల జిల్లాలో ఆళ్లగడ్డ, ఆత్మకూరు, నందికొట్కూరు, నంద్యాల, బేతంచెర్ల, డోన్ టీడీపీకి దక్కాయి. కర్నూలు జిల్లాలో గూడూరు బీజేపీకి, ఎమ్మిగనూరు, ఆదోని టీడీపీకి కేటాయించారు. అనంతపురం జిల్లాలో రాయదుర్గం, గుత్తి, గుంతకల్లు, తాడిపత్రి, కళ్యాణదుర్గం టీడీపీకి దక్కాయి. శ్రీ సత్యసాయి జిల్లాలో మడకశిర, పుట్టపర్తి జనసేనకు. హిందూపురం, పెనుకొండ, ధర్మవరం, కదిరి టీడీపీకి కేటాయించారు.
