విశాఖ, రాజమండ్రి.. ఈ రెండు కార్పొరేషన్లపై బీజేపీ నజర్
ఏపీలో స్థానిక ఎన్నికలకు శరవేగంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ నెలాఖరులో లేదా వచ్చేనెల ఆరంభంలో షెడ్యూల్ ప్రకటించే అవకాశాలు ఉన్నాయని ప్రచారం జరుగుతోంది.
By: Tupaki Political Desk | 16 Sept 2026 9:00 PM ISTఏపీలో స్థానిక ఎన్నికలకు శరవేగంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ నెలాఖరులో లేదా వచ్చేనెల ఆరంభంలో షెడ్యూల్ ప్రకటించే అవకాశాలు ఉన్నాయని ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో పొత్తులు, ఎత్తులపై రాజకీయ వర్గాల్లో విస్తృత చర్చ జరుగుతోంది. విపక్షం వైసీపీ యథావిధిగా ఒంటరి పోరుకు సిద్ధం అవుతుండగా, కూటమిలోని మూడు పార్టీల మధ్య ఇంతవరకు పొత్తు చర్చలు జరగలేదు. దీంతో కూటమిలో సీట్ల సర్దుబాటుపై అనేక అంచనాలు వెలువడుతూ రాజకీయ వాతావరణాన్ని హీటెక్కిస్తున్నాయి. ప్రధానంగా టీడీపీకి దీటుగా తమకు ముఖ్యమైన కార్పొరేషన్లు కావాలని కూటమిలోని జనసేన, బీజేపీ నేతలు పట్టుబడుతున్నారని ప్రచారం రాజకీయాన్ని మరింత ఆసక్తికరంగా మార్చేస్తున్నట్లు చెబుతున్నారు.
రాష్ట్రంలో మొత్తం 17 మున్సిపల్ కార్పొరేషన్లు ఉండగా, జనసేన, బీజేపీ నేతలు ముఖ్యమైన కార్పొరేషన్లపై ఇప్పటికే కర్చీఫ్ వేయడం రాజకీయంగా ఆసక్తి రేపుతోంది. రాష్ట్రంలో అతిపెద్ద నగరాలైన విశాఖ, విజయవాడ, గుంటూరు, తిరుపతి, రాజమండ్రి కార్పొరేషన్లను మిత్రపక్షాలు కోరుతుండటం టీడీపీ నేతల్లో గుబులు పుట్టిస్తోందని చెబుతున్నారు. కార్పొరేషన్ ఎన్నికలను ప్రత్యక్ష పద్ధతిలో నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించుకోవడం, ఎక్కువ ఓట్లు ఉన్న నగరాలలో పోటీకి మిత్రపక్షాలు ఉవ్విళ్లూరుతుండటంతో తమ పరిస్థితి ఏంటి అంటూ టీడీపీ నేతలు ఆవేదన చెందుతున్నారని చెబుతున్నారు. ప్రధానంగా బీజేపీ నేతలు విశాఖ, రాజమండ్రి కార్పొరేషన్ కోసం చేస్తున్న ప్రయత్నాలు కూటమిలో హాట్ టాపిక్ అవుతున్నాయి.
ఉత్తర కోస్తాలోని ముఖ్యమైన నగరాలు విశాఖపట్నం, రాజమండ్రిల్లో మేయర్ పదవులను బీజేపీ కోరుకుంటోందని చెబుతున్నారు. విశాఖలో నార్త్ ఇండియన్ ఓట్లు అధికంగా ఉండటం తమకు అడ్వాంటేజ్ అవుతోందని, రాజమండ్రి ఎంపీగా పురందేశ్వరి ఉండటంతో ఆ మున్సిపల్ కార్పొరేషన్ లోనూ బీజేపీ బలం పెరిగిందని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. అంతేకాకుండా ఆ రెండు నగరాలకు ఉన్న ప్రాముఖ్యత కారణంగా ఆయా కార్పొరేషన్ మేయర్ పదవులు తీసుకోవడం ద్వారా తమ పరపతిని జాతీయస్థాయిలో పెంచుకోవాలని బీజేపీ నేతలు ప్లాన్ చేస్తున్నారు. దీంతో కూటమిలో సీట్ల సర్దుబాటుపై ఒక అవగాహన కుదరకముందే విశాఖ, రాజమహేంద్రవరం (రాజమండ్రి) మేయర్లుగా పోటీ చేస్తామంటూ పలువురు బీజేపీ నేతలు ప్రచారం చేసుకుంటున్నారని అంటున్నారు.
దీంతో కూటమిలోని టీడీపీ నేతలు తమ రాజకీయ భవిష్యత్తుపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారని అంటున్నారు. ముఖ్యమైన నగరాలపై మిత్రపక్షాలు పాగా వేసేందుకు తహతహలాడుతుండటం, ప్రత్యక్ష ఎన్నికల్లో ఆయా పార్టీలు తలపడే పరిస్థితి లేకపోవడమే వారిని ఎక్కువ ఆందోళనకు గురిచేస్తోందని చెబుతున్నారు. ప్రత్యక్ష ఎన్నికల్లో అభ్యర్థి ఇమేజ్ తోపాటు ఆర్థిక బలం కూడా కీలకంగా పనిచేస్తుందని, ప్రస్తుత పరిస్థితుల్లో ఈ రెండింటిని సమకూర్చుకోగల నేతలు బీజేపీలో లేరని ప్రచారం చేస్తూ బీజేపీకి ముఖ్యమైన కార్పొరేషన్లు ఇచ్చే పరిస్థితి లేదని టీడీపీ నేతలు సంకేతాలు పంపుతున్నారు. దీంతో కూటమి రాజకీయాలు తీవ్ర ఆసక్తి రేపుతున్నాయని చెబుతున్నారు.
