అక్టోబరులో స్థానిక సమరం లేనట్లేనా?! కోర్టు తీర్పుపై ఉత్కంఠ
స్థానిక ఎన్నికలకు కోర్టులు అడ్డుపడే పరిస్థితి ఉందా? అన్నదే ఇప్పుడు ప్రధాన చర్చగా మారింది.
By: Tupaki Political Desk | 26 Sept 2026 12:00 AM ISTస్థానిక ఎన్నికలకు కోర్టులు అడ్డుపడే పరిస్థితి ఉందా? అన్నదే ఇప్పుడు ప్రధాన చర్చగా మారింది. స్థానిక ఎన్నికలపై వివిధ అభ్యంతరాలతో హైకోర్టులో పలు కేసులు నమోదైన విషయం తెలిసిందే. వీటిపై విచారణ పూర్తిచేసిన హైకోర్టు తీర్పును రిజర్వు చేసింది. దీంతో ఎన్నికల విషయంలో ఎలాంటి నిర్ణయం వెలువడుతుందనేది ఉత్కంఠ రేపుతోంది. ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం సమాయుత్తమవుతుండగా, సాధ్యమైనంతలా ఎన్నికలను వాయిదా వేయించేలా విపక్షం పోరాడుతోంది. దీంతో న్యాయపోరాటంలో ఎవరిది పైచేయి అవుతుందనేది ఆసక్తికరంగా మారింది.
స్థానిక సంస్థలైన మున్సిపాలిటీలు, పంచాయతీలు, జడ్పీ, మండల పరిషత్ ఎన్నికలను ఒకేసారి నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది. అయితే ఇందుకు ప్రధానంగా రెండు అంశాలు అడ్డుపడేలా ఉన్నాయని న్యాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ప్రధానంగా బీసీ రిజర్వేషన్లు పెంచుతూ కూటమి ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులు ఒకటి కాగా, రెండోది సర్ ప్రక్రియ అమలులో ఉండగా, పాత ఓటర్ల జాబితాతో ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం పూనుకోవడంపై వస్తున్న అభ్యంతరాలు రెండో కారణంగా చెబుతున్నారు. ఇప్పటికే బీసీ రిజర్వేషన్లు, ఓటర్ల జాబితా తయారీ తదితర ప్రధానమైన అంశాలపై దాఖలైన వ్యాజ్యాలను హైకోర్టు విచారించి తీర్పులను రిజర్వ్ చేసింది. దీంతో ఈ తీర్పులు ఎలా ఉండనున్నాయనే టెన్షన్ ఎక్కువగా కనిపిస్తోంది.
బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు, సర్ ప్రక్రియ ముగిసేంతవరకు ఎన్నికలను వాయిదా వేయాలనే రెండు పిటిషన్లతోపాటు మరికొన్ని వివాదాలు కూడా స్థానిక ఎన్నికలను వెంటాడుతున్నాయని చెబుతున్నారు. ఇందులో బీసీ గణన చేపట్టాలని ఒకటి, బీసీ ఉప వర్గీకరణ కోసం మరొకటి చొప్పున ప్రజాప్రయోజన వ్యాజ్యాలు దాఖలైనట్లు చెబుతున్నారు. వీటిపై విచారణ పూర్తయ్యేకా ఎన్నికల కమిషన్ ముందుకు వెళ్లాల్సివుంటుందని అంటున్నారు. వచ్చేనెలలో ఎన్నికలు నిర్వహిస్తామని ఒకవైపు ప్రభుత్వం చెబుతుండగా, మరో నాలుగు రోజుల్లో తీర్పు వచ్చి, ప్రభుత్వానికి అనుకూలంగా ఉంటేనే ప్రస్తుతం అనుకున్న పద్ధతిలో ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉందని అంటున్నారు.
1986 నాటి గణాంకాలతో రిజర్వేషన్లు ఎలా ?
వెనుకబడిన తరగతుల ఫైనాన్స్ కమిషన్ 1986లో సేకరించిన గణాంకాల ఆధారంగా బీసీలకు రిజర్వేషన్ ఖరారు చేస్తూ వస్తున్నారని, ఇది ఎంతవరకు సమంజసం అన్న పిటిషనర్లు వాదనపై హైకోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది? అనేది ఎన్నికలు వచ్చేనెలలో జరుగుతాయా? లేదా? అన్న అంశాన్ని నిర్దేశించే అవకాశం ఉందని న్యాయనిపుణులు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు సర్ కారణంగా స్థానిక ఎన్నికలు వాయిదా వేయడం కుదరదని ఎన్నికల సంఘం కోర్టుకు నివేదించడం కూడా ప్రాధాన్యం సంతరించుకుందని చెబుతున్నారు. అందుబాటులో ఉన్న ఓటర్ల జాబితాతోనే ఎన్నికలు జరపొచ్చునని గతంలో రాజ్యాంగ ధర్మాసనం స్పష్టం చేసినట్టు ఎన్నికల సంఘం తరఫున కోర్టుకి నివేదించడం చూస్తుంటే ఎట్టిపరిస్థితుల్లో అక్టోబరులో స్థానిక పోరుకు రెడీ అన్న సంకేతాలను ప్రభుత్వం ఇస్తోందని అంటున్నారు. ఈ పరిస్థితుల్లో రిజర్వులో ఉన్న కోర్టు తీర్పులు ఎప్పుడు వెలువడుతాయి? ఏమని తీర్పులు వచ్చే అవకాశం ఉందనే అంశమే ఉత్కంఠ రేపుతోందని చెబుతున్నారు.
