Begin typing your search above and press return to search.

స్థానికంపై జనసేన వ్యూహమేంటి? 28 జడ్పీల్లో సేన వాటా ఎంత?

రాష్ట్రంలో స్థానిక ఎన్నికల వాతావరణం క్రమంగా అలుముకుంటోంది. అన్నిపార్టీలు ఎన్నికల సన్నాహాక సమావేశాలతో శ్రేణులను సిద్ధం చేస్తున్నారు.

By:  Tupaki Political Desk   |   28 Aug 2026 6:00 PM IST
స్థానికంపై జనసేన వ్యూహమేంటి? 28 జడ్పీల్లో సేన వాటా ఎంత?
X

రాష్ట్రంలో స్థానిక ఎన్నికల వాతావరణం క్రమంగా అలుముకుంటోంది. అన్నిపార్టీలు ఎన్నికల సన్నాహాక సమావేశాలతో శ్రేణులను సిద్ధం చేస్తున్నారు. అయితే అధికార కూటమిలోని జనసేన వైఖరి ఎలా ఉంటుందనేదే ఇప్పుడు ఆసక్తి రేపుతోంది. స్థానిక ఎన్నికల్లో ఆ పార్టీ ఎన్నిస్థానాల్లో పోటీ చేస్తుందనేది ప్రధాన చర్చనీయాంశంగా మారిందని చెబుతున్నారు. తమకు బలం ఉన్న చోట పోటీకి రెడీ అంటూ జనసేన నేతలు సంకేతాలు ఇవ్వడం కూటమి రాజకీయాలను వేడెక్కిస్తోంది. మరోవైపు టీడీపీ కూడా పోటీకి సై అంటుండటంతో స్థానిక ఎన్నికలు హీట్ పుట్టిస్తున్నాయని అంటున్నారు.

స్థానిక ఎన్నికల్లో జనసేన ఎన్ని స్థానాల్లో పోటీ చేస్తుందనే అంశమే ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది. గతంలో టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంటు, మంత్రి నారా లోకేశ్ ప్రతిపాదించిన 80:15:5 నిష్పత్రి తమకు అంగీకారం కాదని జనసేన తేల్చిచెప్పడం, ఆ తర్వాత ఏ ప్రాతిపదికన పోటీ చేస్తారనే అంశమై స్పష్టత ఇవ్వకపోవడంతో స్థానిక ఎన్నికల్లో జనసేన పోటీపై కార్యకర్తలే అయోమయ పరిస్థితి ఎదుర్కొంటున్నారు. ఇదే సమయంలో కొన్నిచోట్ల కూటమి సర్దుబాట్లపై అవగాహన రాకుండానే పదవుల కోసం జనసేనలో అంతర్గత రాజకీయాలు ఊపందుకోవడం చర్చకు తావిస్తోందని అంటున్నారు.

రాష్ట్రంలో 123 మున్సిపాలిటీలు ఉండగా, జనసేన ఎన్ని స్థానాల్లో పోటీ చేస్తుందనేది అంతుచిక్కని అంశంగా ఉందని వ్యాఖ్యానిస్తున్నారు. అదేవిధంగా 28 జిల్లా పరిషత్తులలో ఎన్నిస్థానాలను జనసేన తీసుకుంటుంది అనేది ఆసక్తి రేపుతోందని అంటున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో కూటమి కోసం తాము కాస్త తగ్గామని జనసేన అధినేత పవన్ కల్యాణ్ చెబుతున్నారు. అంటే స్థానిక ఎన్నికల్లో తాము తగ్గే పరిస్థితి లేదని ఆయన పరోక్షంగా చెబుతున్నారా? అని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. జనసేనాని పవన్ వ్యాఖ్యలు, జనసైనికుల అభిప్రాయాలను పరిశీలిస్తే స్థానిక ఎన్నికల్లో కూటమిలో టీడీపీతో సమానంగా పోటీకి సై అంటున్నట్లు కనిపిస్తోందని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. మరికొందరు మాత్రం తమకు 40 శాతం సీట్లు ఇవ్వాలని జనసేన కోరుకుంటోందని అంటున్నారు.

ఈ ప్రచారమే నిజమైతే జనసేన రాష్ట్రంలో 50కి పైగా మున్సిపాలిటీలు, 10 నుంచి 14 జిల్లా పరిషత్తు స్థానాలను కోరుకుంటున్నట్లేనని వ్యాఖ్యానిస్తున్నారు. అయితే ఈ స్థాయిలో జనసేనకు కేటాయించేందుకు టీడీపీ సమ్మతిస్తుందా? అన్నదే చూడాల్సివుందని అంటున్నారు. మరోవైపు స్థానిక ఎన్నికల్లో బలం ఉన్న అన్నిస్థానాల్లో పోటీ చేస్తామని జనసేన ప్రకటించడాన్ని టీడీపీ సీనియర్లు తప్పుపడుతున్నారని ప్రచారం జరుగుతోంది. పొత్తులో ఉన్నప్పుడు ఎవరికి ఇష్టం వచ్చినట్లు వారు ఇలాంటి మాటలు ఆడటం సరికాదని వ్యాఖ్యానిస్తున్నారు. పొత్తులపై మూడు పార్టీల సమన్వయ సమావేశం ముగిసిన తర్వాతే ఎవరైనా పోటీపై ప్రకటన చేయాలని అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలో స్థానిక ఎన్నికల్లో పోటీపై జనసేన వ్యూహం ఎలా ఉంటుందనేది ఆసక్తి రేపుతోందని చెబుతున్నారు.