స్థానిక ఎన్నికల్లో పోటీ చేయాలంటే ఏ అర్హతలు ఉండాలి ?
ఆంధ్రప్రదేశ్ లో స్థానిక ఎన్నికల సమరం మొదలయింది. అన్ని పార్టీలలోని ఔత్సాహికులు పోటీకి సిద్దం అవుతున్నారు.
By: Tupaki Political Desk | 16 Oct 2026 12:52 PM ISTఆంధ్రప్రదేశ్ లో స్థానిక ఎన్నికల సమరం మొదలయింది. అన్ని పార్టీలలోని ఔత్సాహికులు పోటీకి సిద్దం అవుతున్నారు. రాష్ట్రంలో మొత్తం 17 మున్సిపల్ కార్పోరేషన్లు ఉండగా 13 కార్పోరేషన్లకు, 106 మున్సిపాలిటీలకు గాను 87 మున్సిపాలిటీలు, 3942 కౌన్సిలర్, కార్పోరేటర్ స్థానాలకు, 13,354 గ్రామ పంచాయతీలలో సర్పంచ్, 1,33,932 వార్డులకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఎన్నికల్లో పోటీ చేయాలంటే ఎలాంటి అర్హతలు ఉండాలి ? వాటి నిబంధనలు, ఇతర విషయాలను తెలుసుకుందాం.
ఎన్నికల్లో పోటీ చేయాలంటే ఉండాల్సిన అర్హతలు ఏమిటి ?
ఎంత వయసు ఉంటే అర్హులు ?
గ్రామ పంచాయతీ, మున్సిపాలిటీ, మున్సిపల్ కార్పోరేషన్లలో పోటీ చేయాలంటే సర్పంచ్, వార్డు సభ్యుడు, కౌన్పిలర్, కార్పోరేటర్లుగా పోటీ చేసే వారికి నామినేషన్లు దాఖలు చేసే నాటికి 21 సంవత్సరాలు నిండి ఉండాలి.
ఓటరు జాబితాలో పేరు ఎక్కడ ఉండాలి ?
గ్రామ పంచాయతీల్లో పోటీ చేసే వారికి సంబంధిత గ్రామ పంచాయతీలోని ఓటరు జాబితాలో పేరు ఉండాలి. మున్సిపాలిటీ కార్పొరేషన్, మున్సిపాలిటీలోని ఏదైనా వార్డు ఓటరు జాబితాలో పేరు నమోదై ఉండాలి. కేవలం తన వద్ద ఓటరు కార్డు ఉంటే సరిపోదు. ఖచ్చితంగా అది ఎన్నికల ఓటరు జాబితాలో ఉండాలి.
ఎంత మంది పిల్లలు ఉంటే పోటీకి అర్హులు ?
గతంలో ఇద్దరికి మించి పిల్లలు ఉంటే పోటీకి అనర్హులుగా నిర్ణయించారు. 2024లో దానికి సవరణలు చేశారు. ఇద్దరు పిల్లలు మాత్రమే అన్న నిబంధన రద్దు అయింది. ఎంత మంది పిల్లలు ఉన్నా పోటీ చేయవచ్చు.
పోటీ చేయాలంటే ఏ విద్యార్హతలు ఉండాలి ?
ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఎలాంటి విద్యార్హతలు అవసరం లేదు. సర్పంచ్, వార్డు సభ్యుడు, కౌన్సిలర్, కార్పొరేటర్ పదవులకు ఎలాంటి అధికారిక విద్యా అర్హతలు ఉండాల్సిన అవసరం లేదు.
క్రిమినల్ కేసులు ఉంటే పోటీకి అర్హులు కాదా ?
రిప్రజెంటేషన్ ఆఫ్ ద పీపుల్ యాక్ట్, 1951 ప్రకారం కొన్ని నేరాలకు శిక్ష పడితే అనర్హత వర్తిస్తుంది. నైతిక అవినీతి కేసులు, ఎన్నికలకు సంబంధించిన నేరాలు అనర్హతకు దారితీస్తాయి. బెయిలు మీద బయట ఉన్నా శిక్ష అమలులో ఉంటే అనర్హత వర్తిస్తుంది. అప్పీలులో శిక్ష మీద స్టే ఉన్నట్లయితే పోటీకి అర్హులు అవుతారు. నామినేషన్ పత్రాలతో పాటు క్రిమినల్ కేసులకు సంబంధించిన వివరాలు తప్పనిసరిగా ప్రకటించాల్సి ఉంటుంది.
రిజర్వ్ స్థానాలలో పోటీ చేయాలంటే ఏం చేయాలి ?
రిజర్వ్ చేసిన స్థానాలలో పోటీ చేయాలంటే సంబంధిత కుల ధ్రువపత్రం తప్పని సరిగా పొందు పరచాలి. మహిళలకు రిజర్వ్ చేసిన స్థానాలలో పురుషులు పోటీకి అర్హులు కారు. కుల ధ్రువపత్రం తప్పు అయినా, రద్దు అయినా అనర్హత వర్తిస్తుంది.
ప్రభుత్వ ఉద్యోగులుగా ఉంటే పోటీ చేయవచ్చా ?
ప్రభుత్వ ఉద్యోగి, స్థానిక సంస్థల ఉద్యోగి అయితే వారి రాజీనామాలు ఆమోదం పొందినట్లయితేనే ఎన్నికల్లో పోటీకి అర్హులు. స్థానిక సంస్థలకు బకాయిలు ఉన్నా పోటీకి అనర్హులు అవుతారు. నామినేషన్ ఫారంతో పాటు డిపాజిట్, అఫిడవిట్, క్రిమినల్ కేసుల వివరాలు, ఆస్తులు, అపపులు, విద్యా వివరాలు తప్పనిసరిగా జతచేయాలి. అఫిడవిట్లో తప్పుడు వివరాలు ఉంటే నామినేషన్ తిరస్కరిస్తారు. ఒక వ్యక్తి గరిష్టంగా నాలుగు నామినేషన్లు దాఖలు చేయవచ్చు.
నామినేషన్ వేసేందుకు ఎవరెవరు ఎంత డిపాజిట్ చెల్లించాలి ?
గ్రామపంచాయతీ వార్డు సభ్యులుగా పోటీ చేసే వారు ఎస్సీ, ఎస్టీ, బీసీలు అయితే రూ.500, ఇతరులు అయితే రూ.1000, సర్పంచ్, ఎంపీటీసీ స్థానాలకు పోటీ చేసే వారు ఎస్సీ, ఎస్టీ, బీసీలు అయితే రూ.1500, ఇతరులు అయితే రూ.3 వేలు, జడ్పీటీసీలుగా పోటీ చేసేవారు ఎస్సీ, ఎస్టీ, బీసీలు అయితే రూ.3 వేలు, ఇతరులు అయితే రూ.6 వేలు, మున్సిపాలిటీ లేదా, కార్పోరేషన్లలో పోటీ చేసే వారు ఎస్సీ, ఎస్టీ, బీసీలు అయితే రూ.2500, ఇతరులు అయితే రూ.5 వేలు డిపాజిట్ చెల్లించాలి.
నామినేషన్ ఎప్పుడు తిరస్కరిస్తారు ?
వయసు తక్కువ ఉన్నా, ఓటరు జాబితాలో పేరు లేకున్నా, రిజర్వేషన్ స్థానంలో అర్హత లేకున్నా, డిపాజిట్ చెల్లించకుననా, అఫిడవిట్లో లోపాలు ఉన్నా, క్రిమినల్ కేసులు, ఉద్యోగాలు, బకాయిల చెల్లింపులో అనర్హతలు ఉన్నా, నామినేషన్ వేసిన వారికి ప్రపోజల్ చేసిన వారు అనర్హులయినా నామినేషన్ తిరస్కరించే అవకాశం ఉంది.
