నెట్టింట్లో ఓటరన్న...డిజిటల్ మీడియాతో కుమ్మేయడమే !
అందుకే ఇపుడు ఏపీలో జరుగుతున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో అభ్యర్ధులు అంతా సోషల్ మీడియాను ఆయుధంగా చేసుకుంటున్నారు.
By: Satya P | 19 Oct 2026 9:08 AM ISTపాత కాలం ఎన్నికలు అయితే గోడల మీద రాతలు, కర పత్రాల ముద్రణలు, గోడ మీద పోస్టర్లు, ఇంటింటి గుమ్మాలకూ స్టిక్కర్లు ఇలా ఎన్నో ప్రచార హంగులు ఉండేవి. అలాగే రిక్షాలు ఇతర వాహనాలలో ప్రతీ వీధిలో తిరుగుతూ మైకులు పెట్టి హోరెత్తించేవారు. అమ్మా మీ ఓటూ ఫలనా గుర్తుకే అంటూ తెగ ఊదరగొట్టేవారు. అంతే కాదు ఒకటిని పది సార్లు ఇళ్ళకు వ్యక్తిగతంగా తిరిగి మరీ ఓటర్లను ప్రసన్నం చేసుకునే వారు. ఆ రోజులలో తీరే వేరు. అటు అభ్యర్ధులకు ఓపిక ఉండేది, ఇటు ఓటర్లకు తీరిక ఉండేది. కానీ ఇపుడు అంతా నయా ట్రెండ్ నడుస్తోంది. ఓటర్లను ఆకట్టుకోవాలీ అంటే ఇంటి గుమ్మం ఎక్కితే సరిపోదు, ఎక్కినా ఫలితమూ ఉండదు, నెట్టింటి గుమ్మంలో ఓటరన్న ఉన్నాడు. అందుకే వారిని చేరుకోవాలంటే డిజిటల్ మీడియాయే సాధనం. అందుకే ఇపుడు ఏపీలో జరుగుతున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో అభ్యర్ధులు అంతా సోషల్ మీడియాను ఆయుధంగా చేసుకుంటున్నారు.
సమయం తక్కువ కావడం :
ఇక చూస్తే ప్రచారానికి కూడా వారం రోజులు మాత్రమే సమయం ఉంది. దాంతో కార్పోరేషన్లలో అయితే ప్రతీ డివిజన్ లో కనీసంగా ఇరవై వేల మంది దాకా ఓటర్లు ఉన్నారు. వారిని రోజుకు మూడు వేల మంది లెక్కన కలవాలి. ఇది చాలా కష్టతరమైన వ్యవహారం. అసలు కుదిరేది కూడా కాదు డిజిటల్ వేదికల మీదనే ఓటర్లను పర్లకరించే మార్గాన్ని అభ్యర్థులు ఎంచుకుంటున్నారు. పైగా ఏపీలో వర్ష సూచనలు ఉన్నాయి, భారీగా వానలు పడతాయని కూడా వాతావరణ శాఖ చేస్తున్న హెచ్చరికలతో ఆ బెడద లేకుండా హ్యాపీగా తాపీగా సోషల్ మీడియాలో తమ ప్రచారాన్ని పీక్స్ చేర్చి ప్రత్యర్ధుల ఎత్తులను చిత్తు చేస్తూ కుమ్మేయడమే అభ్యర్ధుల అజెండాగా ఉంది.
ప్రతీ ఓటర్ నంబర్ కి :
ఇక్కడ కూడా నయా ట్రెండ్ ని ఫాలో అవుతున్నారు. అందరికీ కామన్ గా ఉండేలా పోస్టులు పెట్టకుండా తన వార్డు పరిధిలోకి వచ్చే ఓటర్ల ఫోన్ నంబర్లను సేకరిస్తున్నారు. దాని ద్వారా వారి మేసేజ్ లతో ఎంట్రీ ఇస్తున్నారు. ఇక వాట్సాప్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, ఎక్స్ వంటి సోషల్ మీడియాల ద్వారా ప్రచారాన్ని ముమ్మరం చేస్తున్నారు. ఈ విధంగా చేయడం వల్ల ప్రతీ ఒక్క ఓటర్ కి తమ సందేశం చేరుస్తుందని భావిస్తున్నారు. ఇక డివిజన్లలోని ప్రతి ఓటరు ఫోన్ నంబరును సేకరించేందుకు ప్రత్యేక ఐటీ బృందాలను కూడా అభ్యర్ధులు రంగంలోకి దించుతున్నారు. కేవలం తమ మంచిని చెప్పుకోవడమే కాదు ప్రత్యర్ధి లోపాలని కూడా ఎండగడుతూ విమర్శలు చేస్తున్నారు. దాంతో ఇపుడు సోషల్ మీడియా వేదికలు అన్నీ స్థానిక ఎన్నికల హీట్ తో మోత మోగుతున్నాయి.
డైరెక్ట్ గా ఓటరుకే :
ఇక్కడ ప్రత్యేక ఐటీ బృందాల పాత్ర కీలకంగా మారుతోంది. వారు ప్రతీ డివిజన్ లో అలాగే ఊళ్ళలోని వీధులకు వాట్సప్ గ్రూపును క్రియేట్ చేస్తున్నారు. అందులో అభ్యర్థి ప్రొఫైల్ అలాగే వారు ఇచ్చే ఎన్నికల హామీలు వివరంగా పొందుపరుస్తున్నార్జు. వారు గతంలో చేసిన సేవా కార్యక్రమాలతో కూడిన సంక్షిప్త సందేశాలను కూడా డిజిటల్ పాంప్లెట్లు చేసి మరీ నెట్టింటి ఓటరన్న ఎదుట పెట్టేస్తున్నారు. ఇక చదవడం రాని ఓటర్ల కోసం అభ్యర్థులు స్వయంగా మాట్లాడిన ఆడియో సందేశాలను నేరుగా వారి సెల్ఫోన్లకు పంపుతూ ఓట్లు అభ్యర్థిస్తున్నారు. అంతే కాదు కొత్తగా ఓటు హక్కు పొందిన జెన్-జీ ఓటర్లని కూడా ప్రత్యేకంగా ఆకట్టుకునే వ్యూహాన్ని సోషల్ మీడియా వేదికల ద్వారా అనుసరిస్తున్నారు. జెన్-జీల కోసం ఫేస్బుక్లో లైవ్ సెషన్లు నిర్వహిస్తూ డివిజన్ సమస్యలపై చర్చిస్తున్నారు
డిజిటల్ ప్రచారం :
ఇక్కడితో ఆగడం లేదు, ఏకంగా ఓటర్లను ఇన్స్టాగ్రామ్లో హలో అంటూ పలకరిస్తున్నారు. అక్కడ అభ్యర్ధుల తరఫున ఆకర్షణీయమైన రీల్స్ ని చేస్తూ పెడుతున్నారు. అలాగే ఆయా అభ్యర్ధులకు సంబంధించిన షార్ట్ వీడియోలను సైతం పోస్టులు చేసి మరీ ఈనాటి యువ తరాన్ని ఆకట్టుకుంటున్నారు. ఇవన్నీ చూసినపుడు నెట్టింట్లో ఉన్న ఓటరన్న కోసం ఎంత బాగా అభ్యర్ధులు ఎదిగిపోయి టెక్నాలజీతో కనెక్షన్ పెట్టుకున్నారో కదా అనిపిస్తోంది మరి.
