Begin typing your search above and press return to search.

షర్మిలకు ఏమైంది?! కీలక సమయంలో వినిపించని వాయిస్

స్థానిక ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు షర్మిల వైఖరిపై ఆసక్తికర చర్చ జరుగుతోంది.

By:  Tupaki Political Desk   |   16 Oct 2026 7:00 PM IST
షర్మిలకు ఏమైంది?! కీలక సమయంలో వినిపించని వాయిస్
X

స్థానిక ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు షర్మిల వైఖరిపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. రాష్ట్ర విభజన తర్వాత పూర్తిగా దెబ్బతిన్న కాంగ్రెస్ పార్టీకి దిక్సూచిగా మారి ఆ పార్టీ శ్రేణుల్లో ధైర్యం నింపిన షర్మిల స్థానిక ఎన్నికల వేళ అసలు కనిపించకుండా తిరుగుతున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి. పార్టీని బలోపేతం చేసుకోవాల్సిన సమయంలో షర్మిల వెనకడుగు వేయడానికి కారణమేంటి? వ్యక్తిగత పనుల్లో బిజీగా ఉండి పార్టీని వదిలేస్తారా? అంటూ కార్యకర్తలు ప్రశ్నిస్తున్నారు. కీలకమైన స్థానిక సంస్థల ఎన్నికల సమయానికి షర్మిల సైలెంట్ కావడం కేడర్‌ తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నట్లుగా చెబుతున్నారు.

ఉనికి కోసం పోరాటం.. ఆపై సైలెంట్!

వైఎస్ షర్మిల రాష్ట్ర కాంగ్రెస్ పగ్గాలు చేపట్టిన తర్వాత పార్టీకి ఒక ఊపు వస్తుందని అంతా భావించారు. ముఖ్యంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని గద్దె దించడమే లక్ష్యంగా ఆమె చేసిన విమర్శలు, ఎన్నికల వేళ ఆమె దూకుడు ఏపీ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టించాయి. ఎన్నికల ఫలితాల తర్వాత కూడా కొన్ని కీలక అంశాలపై, ప్రజా సమస్యలపై ఆమె స్పందించిన తీరు కాంగ్రెస్ పార్టీ ఇంకా బతికే ఉందనే సంకేతాలను ఇచ్చింది. అయితే, ఎన్నికల హడావుడి ముగిసిన తర్వాత షర్మిల రాజకీయ కార్యకలాపాల్లో స్పష్టమైన అస్థిరత కనిపిస్తోందనే విమర్శలున్నాయి. తాజాగా ఎన్నికల సంఘం వద్ద నిరసనలు, కొన్ని పరిమిత కార్యక్రమాలు మినహా క్షేత్రస్థాయిలో ఆమె పెద్దగా కనిపించడం లేదని ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.

రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైనా.. ఏపీ కాంగ్రెస్ అధినాయకత్వం వైపు నుంచి ఎలాంటి హడావుడి కనిపించడం లేదని అంటున్నారు. సాధారణంగా స్థానిక ఎన్నికలు అంటేనే పార్టీల బలాబలాలకు అసలైన గీటురాయిగా చెబుతారు. పార్టీని గ్రామ స్థాయి నుంచి బలోపేతం చేసుకోవడానికి, కేడర్‌లో జోష్ నింపడానికి ఇదొక చక్కటి అవకాశంగా భావిస్తారు. కానీ, ఈ కీలక సమయంలో పీసీసీ చీఫ్ షర్మిల పూర్తిగా మౌనం దాల్చడం, అభ్యర్థుల ఎంపికపై లేదా ఎన్నికల సంసిద్ధంగా ఉండేలా కార్యకర్తల తయారీపై దృష్టి పెట్టకపోవడం అనేక సందేహాలకు తావిస్తోందని అంటున్నారు.

షర్మిల లాంటి ఫైర్‌బ్రాండ్ లీడర్ నుంచి ఇలాంటి నిరాసక్తతను కేడర్ అసలు ఊహించలేదు. ఎన్నికల్లో గెలుపోటములు పక్కన పెడితే, పోటీలో ఉండి పార్టీ జెండాను నిలబెట్టాల్సిన బాధ్యత అధినాయకత్వాని ఉందని అంటున్నారు. కానీ ఈ సమయంలో ఆమె కనిపించకపోవడం క్యాడర్‌ను తీవ్ర నైరాశ్యంలోకి నెట్టివేస్తోందని చెబుతున్నారు. స్థానిక సంస్థల్లో పోటీకి దూరంగా ఉండటం ద్వారా సంస్థాగతంగా కాంగ్రెస్‌ను పునరుద్ధరించుకునే మహావకాశాన్ని ఆ పార్టీ చేజేతులా వదులుకుంటోందన్న విశ్లేషణలు వెలువడుతున్నాయి. "స్థానిక ఎన్నికల్లో పోటీపై షర్మిలకు అసలు ఆశలు లేవా? లేక పార్టీ వనరుల కొరత, క్యాడర్ లేమితో ఈ ఎన్నికలను లైట్‌ తీసుకున్నారా? అనే ప్రశ్నలు రాజకీయ పరిశీలకుల నుంచి వస్తున్నాయి.