ఏపీలో మరో ఎన్నికల పోరు..!
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ ముగిసింది. కూటమి పార్టీలు రాష్ట్ర వ్యాప్తంగా విజయదుందుభి మోగించాయి.
By: Garuda Media | 4 Nov 2026 2:52 PM ISTఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ ముగిసింది. కూటమి పార్టీలు రాష్ట్ర వ్యాప్తంగా విజయదుందుభి మోగించాయి. ఇక, ఈ పరంపరలో తాజాగా పరిషత్ ఎన్నికల పోలింగ్ కూడా వచ్చేసింది. ఇప్పటికే ప్రచారం కూడా పూర్తయిన ఈ ఎన్నికలు గురువారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లోనూ కొన్ని చోట్ల ఏకగ్రీవాలు జరగ్గా.. మెజారిటీ ఎంపీటీసీ, జిల్లా పరిషత్ స్థానాల్లో కీలక పోరు సాగనుంది.
తుఫాను నేపథ్యంలో ఎన్నికలను వాయిదా వేస్తారని.. బుధవారం ఉదయం వరకు ప్రచారం జరిగినా.. అలా ఏమీ లేదని ఎన్నికల సంఘం ప్రకటించింది. జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు యథావిధిగా నిర్వహించనున్నట్టు తెలిపింది. తుపాను ప్రభావంతో పలు ప్రాంతాల్లో వరదలు, భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో బుధవారం రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠా జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
ఈ సందర్భంగా తుపాను ప్రభావం, వరదల పరిస్థితులు, పోలింగ్ నిర్వహణకు ఎదురవుతున్న ఇబ్బందులపై సమీక్షించారు. చాలా జిల్లాల్లో వరదలు తగ్గుముఖం పట్టాయని, ఎన్నికల నిర్వహణకు ఎలాంటి ఆటంకాలు లేవని కలెక్టర్లు నివేదించారు. కలెక్టర్ల నివేదికలను పరిశీలించిన అనంతరం, పరిస్థితులు అనుకూలంగా ఉన్న ప్రాంతాల్లో పోలింగ్ ప్రక్రియను ప్రశాంతంగా పూర్తి చేయాలని పునేఠా అధికారులను ఆదేశించారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా, మండల పరిషత్ ఎన్నికలు కొనసాగనున్నాయి.
ఇక్కడ మాత్రమే..
మురసు' తుఫాన్ ప్రభావంతో కొన్ని మండలాల్లో ఎంపీటీసీ, జిల్లాల్లో జిల్లాపరిషత్ ఎన్నికలను వాయిదా వేశారు. గుంటూరు జిల్లాలోని పెదనందిపాడు, కాకుమాను, ఫిరంగిపురం మండలాల్లో జరగాల్సిన ఎన్నికలు వాయిదా పడ్డాయి. అలానే బాపట్ల జిల్లా పరిధిలోని పరుచూరు సహా.. ఇతర మండలాల్లో పూర్తిగా ఎన్నికలు వాయిదా పడ్డాయి. ఆయా ప్రాంతాల్లో వరద పోటు పెరగడంతో ఎన్నికల సామగ్రిని సైతం అధికారులు ఆయా ప్రాంతాలకు పంపించలేని పరిస్థితి నెలకొంది. దీంతో అక్కడ మాత్రమే ఎన్నికలను వాయిదా వేస్తూ.. నిర్ణయం తీసుకున్నారు.
