సీమలో ఉద్రిక్తం...పల్నాడులో హై టెన్షన్ !
పులివెందులలో తమకు ఓటు వేయాలని ఉందని కానీ అవకాశం లేదని పలువురు మహిళలు పోలీసులను అడుగుతున్న దృశ్యాలు చానళ్ళలో కనిపించాయి.
By: Satya P | 1 Nov 2026 1:29 PM ISTఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు రాయలసీమలో ఉద్రిక్త వాతావరణాన్ని సృష్టించాయి. మొత్తం రాయలసీమ నాలుగు ఉమ్మడి జిల్లాలలోనూ పోలింగ్ సందర్భంగా పలు చోట్ల తీవ్ర స్థాయిలో ఘర్షణలు చోటు చేసుకున్నాయి. పులివెందుల అయితే అట్టుడికింది, జమ్మలమడుగులో సైతం బాహా బాహీగా వైసీపీ టీడీపీ బీజేపీ వర్గాలు తలపడ్డాయి. కడపలో అనేక చోట ఘర్షణలు జరిగాయి. పులివెందుల ఈసారి మొత్తం వేడెక్కించేలా పరిస్థితులు ఏర్పడ్డాయి. అనేక వాహనాలు ధ్వంసం అయ్యాయి. అలాగే పోలీసులు పెద్ద ఎత్తున మోహరించినా ఇరు వర్గాల వైపు నుంచి రాళ్లు రువ్వుకోవడాలు పరస్పరం తలపడడం వంటి సంఘటనకు అనేకం చోటు చేసుకున్నాయి.
ఓటు కోసం అంటూ :
పులివెందులలో తమకు ఓటు వేయాలని ఉందని కానీ అవకాశం లేదని పలువురు మహిళలు పోలీసులను అడుగుతున్న దృశ్యాలు చానళ్ళలో కనిపించాయి. అయితే పరిస్థితి చక్కబట్టాక ఓటుకు చాన్స్ ఇస్తామని పోలీసులు చెబుతున్నా దొంగ ఓట్లు వేస్తున్నారు అందుకే అడ్డుకుంటున్నారు అని వైసీపీ నేతలు ఆరోపించారు. మరో వైపు చూస్తే వైసీపీ అధినేత జగన్ పులివెందులలో మీడియాతో మాట్లాడుతూ ప్రస్తుతం జరుగుతున్నవి ఎన్నికలు కానే కావని అన్నారు. అయితే వైసీపీ నేతలే ఉద్రిక్త పరిస్థితులను సృష్టించారని పులివెందుల టీడీపీ నేత బీటెక్ రవి విమర్శించారు.
ఆర్వో ఆఫీస్ వద్ద జగన్ నిరసన :
ఇక తమ ఏజెంట్లను ఎవరినీ పోలింగ్ బూతులలోకి వెళ్లనీయడం లేదని ఆరోపిస్తూ వైఎస్ జగన్ ఏకంగా పులివెందుల ఆర్వో కార్యాలయం ముందు బైఠాయించి నిరసన తెలపడం విశేషం. మొత్తం 70 మంది వైసీపీ ఏజెంట్లతో కలిసి అక్కడే బైఠాయించారు. ఆర్వో శ్రీనివాస్, ఆర్డీవో చిన్నయ్యతో మాట్లాడిన జగన్ తన ఏజెంట్లను ఎలా అడ్డుకుంటారు అని ప్రశ్నించారు. పోలింగ్ కేంద్రాలలో సీసీ కెమెరాలు ఎందుకు లేవని ఆయన నిలదీశారు. అధికారులు మౌనంగా ఉంటారా లేక చర్యలు తీసుకుంటారా అని ఆయన ప్రశ్నించారు. ఒక మాజీ సీఎం నియోజకవర్గంలో ఈ పరిస్థితులేంటని జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
పల్నాడులో టెన్షన్ :
మరో వైపు పల్నాడు జిల్లాలో టెన్షన్ వాతావరణంతోనే పోలింగ్ సాగింది. అక్కడ మాజీ ఎమ్మెల్యేలు వైసీపీ నేతలు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సహా కీలక నేతలను పోలీసులు ముందస్తుగా హౌజ్ అరెస్ట్ చేశారు. దాంతో వైసీపీ నేతలు తమ వారిని పోలింగ్ బూతులలోకి అనుమతించడం లేదని విమర్శించారు. పోలీసులే అడ్డుకుంటున్నారని స్వేచ్చగా పోలింగ్ ఎలా సాధ్యమని ప్రశ్నించారు. దాంతో పల్నాడులో ఇరు వర్గాల మధ్యన ఘర్షణలు చోటు చేసుకోవడం జరిగింది.
ప్రశాంతంగానే :
అయితే ఉత్తరాంధ్రా ఉభయగోదావరి కోస్తాంధ్రాలో మాత్రం పోలింగ్ ప్రశాంతంగా సాగింది. విశాఖలో అయితే చాలా కూల్ గా పోలింగ్ సాగడం విశేషం. అధికార విపక్ష నేతలు ఎక్కడా ఎటువంటి రెచ్చగొట్టే చర్యలు కానీ మాటలు కానీ లేకుండా పోలింగ్ లో పాలు పంచుకున్నారు. ఇదే తీరున విజయనగరం శ్రీకాకుళంతో పాటు గోదావరి జిల్లాలలో పోలింగ్ సాఫీగా సాగింది. అలాగే విజయవాడలో కూడా పోలింగ్ చాలా ప్రశాంతంగా సాగడం విశేషం.
