Begin typing your search above and press return to search.

కూటమి పద్మవ్యూహం....వైసీపీ తట్టుకోగలదా ?

అంతవరకూ బాగానే ఉంది కానీ కూటమి ప్రభుత్వం కూడా ఆనాడు వైసీపీ చేసినట్లుగా అధికార బలం చూపిస్తే ఏమవుతుంది అన్నదే ఫ్యాన్ పార్టీలో సందేహంగా ఉంది.

By:  Satya P   |   4 Oct 2026 2:00 PM IST
కూటమి పద్మవ్యూహం....వైసీపీ తట్టుకోగలదా ?
X

ఏపీలో కూటమి ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలను త్వరలో నిర్వహించనుంది. అయితే 2021లో వైసీపీ ప్రభుత్వం హయాంలో కూడా స్థానిక ఎన్నికలు జరిగాయి. అప్పటికీ ఇప్పటికీ తేడా ఏమిటి అంటే ఆనాడు పరోక్ష ఎన్నికలు జరిగాయి. మేయర్ జెడ్పీ చైర్మన్లను సభ్యులు ఎన్నుకునే వారు. దాంతో పెద్ద ఎత్తున సభ్యుల బలం కోసం ఏకగ్రీవాలను వైసీపీ ప్రోత్సహించింది అన్న విమర్శలు వచ్చాయి. అంతే కాదు ప్రతిపక్ష పార్టీలు నామినేషన్లు కూడా వేయకుండా అధికార బలంతో అడ్డుకుందని కూడా ఆరోపణలు వెల్లువెత్తాయి. దీంతో జెడ్పీ ఎన్నికల నుంచి టీడీపీ మధ్యలోనే తప్పుకుని తన నిరసనను వ్యక్తం చేసింది. మొత్తానికి నూటికి తొంబై శాతం దాకా వైసీపీ గెలిచి లోకల్ బాడీస్ లో పాగా వేసింది. అయినా ఏమి లాభం, 2024 లో ఈ స్థానిక ఎన్నికల ఫలితాలు పెద్దగా ఉపయోగపడలేదు, వైసీపీ చిత్తుగా ఓటమి పాలు అయింది.

కట్ చేస్తే కూటమి సర్కార్ :

ఇక ప్రస్తుతం కూటమి ప్రభుత్వం స్థానిక ఎన్నికలను నిర్వహిస్తోంది. ఈ ఎన్నికల్లో నిజానికి వైసీపీ మొదట పాల్గొనరాదనే చర్చ సాగింది అని అంటున్నారు. ఎపుడైతే మేయర్ జెడ్పీ చైర్మన్లు మునిసిపలి చైర్మన్లకు ప్రత్యక్ష ఎన్నికల విధానం అమలులోకి తీసుకుని వచ్చారో దాంతో వైసీపీలో కొత్త ఆశలు చిగురించాయి. ప్రత్యక్ష ఎన్నికలు కాబట్టి కీలక పదవుల విషయంలో పార్టీ జెండా జగన్ ఇమేజ్ ఉపయోగపడతాయని భావిస్తూ ఆ పార్టీ పోటీ చేయాలని నిర్ణయించుకుంది. ఇక జగన్ అయితే వెరీ సీరియస్ అన్నట్లుగా లోకల్ బాడీ ఎన్నికలను తీసుకున్నారు. పదే పదే పార్టీ సమావేశాలలో ఆయన ఎన్నికలు చాలా కీలకం అని ప్రస్తావిస్తున్నారు. పార్టీ శ్రేణులను ఆయన ఎన్నికల సమరం వైపుగా నడిపించే ప్రయత్నం చేస్తూ ఉత్సాహం నింపుతున్నారు.

అదే సందేహంగా :

అంతవరకూ బాగానే ఉంది కానీ కూటమి ప్రభుత్వం కూడా ఆనాడు వైసీపీ చేసినట్లుగా అధికార బలం చూపిస్తే ఏమవుతుంది అన్నదే ఫ్యాన్ పార్టీలో సందేహంగా ఉంది. నామినేషన్ల నుంచే నాడు వైసీపీ ప్రభుత్వ హయాంలో ఇబ్బందులు ప్రతిపక్షాలు ఎదుర్కొన్నారు. ఇప్పుడు కూడా అలాంటి పరిస్థితి ఉంటుందా అని చర్చిస్తున్నారు. అభ్యర్ధులను నిలబెట్టడం వరకూ అయితే వైసీపీ అధినాయకత్వం వారికి ఉత్సాహం ఇస్తోంది. అయితే వారు రంగంలో చివరి దాకా ఉండాలి. అధికార కూటమి ఒత్తిళ్లను తట్తుకోవాల్సి ఉంటుంది. అంతే కాదు పోలీసులను ప్రయోగిస్తే ధీటుగా ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇక అభ్యర్ధులుగా ఉన్న వారి చరిత్రను మొత్తం తిరగతోడే చాన్స్ ఉంది. ఇలా అన్ని వైపుల నుంచి వచ్చే కష్టాలను నష్టాలను భరిస్తూ వైసీపీ శ్రేణులు ఎంతవరకూ ముందుకు వెళ్తాయి అన్నది పార్టీ పెద్దలలో కూడా ఉంది అని అంటున్నారు.

నిలిచి పోరాడితేనే :

అన్ని ఇబ్బందులు అధిగమించి నిలిచి పోరాడితేనే వైసీపీ గెలిచినట్లు అని అంటున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల వరకూ చూస్తే ప్రజాభిప్రాయంలో పెద్దగా తేడా ఏమీ ఉండదని అంటున్నారు. ఇంకా కూటమి చేతిలో సగం పాలన ఉండగా జనాలు ప్రతిపక్షాన్ని గెలిపించి అభివృద్ధిని తమ ప్రాంతంలో దూరం చేసుకోరని కూడా అంటున్నారు. అందువల్ల వైసీపీ పెద్ద ఎత్తున గెలిచేస్తుంది అన్నది ఆ పార్టీలో ఉత్సాహం కోసం అన్నట్లుగానే చూడాలని అంటున్నారు అదే సమయంలో వైసీపీ తుది వరకూ పోరాడి తన ఓటు బ్యాంక్ ని కాపాడుకుంటూ నిలిస్తే మాత్రం అదే అసలైన గెలుపుగా చూడాలని అంటున్నారు. అధినాయకత్వం కూడా అందుకోసమే పోటీకి దింపుతోందని చెబుతున్నారు. మరి వైసీపీ తట్టుకుంటుందా అన్నదే అతి పెద్ద ప్రశ్నగా ఉంది.