ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు అడ్డంకి ఎవరు... ?
ఏపీ మున్సిపల్ చట్టంలోని 5 చట్టం లేదా మున్సిపల్ చట్టాలకు అనుగుణంగా గ్రామాలను మున్సిపాల్టీలు, కార్పొరేషన్లలో విలీనం చేశారు.
By: Garuda Media | 3 Aug 2026 4:00 PM ISTఏపీలో స్థానిక సంస్థలు.. మరీ ముఖ్యంగా పురపాలక సంఘాలు, నగర పాలక సంస్థల ఎన్నికలకు ప్రభుత్వం రెడీ అవుతోంది. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో మున్సిపాల్టీలు, కార్పొరేషన్ల సరిహద్దుల విషయంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను స్థానిక ప్రజల తప్పుపట్టారు. అభ్యంతరాలు చెప్పారు. కోర్టులకు వెళ్లారు. ఈ విలీన ప్రక్రియలు ఇప్పుడు మున్సిపాల్టీలు, కార్పొరేషన్ల ఎన్నికలకు ప్రధాన అడ్డంకిగా మారాయి. స్థానిక ప్రజలకు ఇష్టం లేకుండానే కొన్ని గ్రామాలను బలవంతంగా మున్సిపాల్టీలో విలీనం చేయడం.. సరిహద్దులు మార్చడం చేశారు. ఈ న్యాయపరమైన చిక్కులు ఇప్పుడు స్థానిక ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వానికి పెద్ద అడ్డంకిగా మారాయి.
ఏపీ మున్సిపల్ చట్టంలోని 5 చట్టం లేదా మున్సిపల్ చట్టాలకు అనుగుణంగా గ్రామాలను మున్సిపాల్టీలు, కార్పొరేషన్లలో విలీనం చేశారు. ఈ నిబంధనల ప్రకారం ఓ గ్రామాన్ని దానికి దగ్గర్లో ఉన్న మున్సిపాల్టీలో విలీనం చేసినప్పుడు పబ్లిక్ హియరింగ్, సర్పంచ్ ఆమోదంతో పాటు గ్రామసభ ఆమోదం తప్పక ఉండాలి. అలాగే నోటిఫికేషన్ రిలీజ్ చేయడంతో పాటు దానికి తగినంత గడువు కూడా ఇవ్వాలి. పై నిబంధనలు అన్నీ తప్పక పాటించాకే గ్రామాల విలీన ప్రక్రియ జరగాలి. గత ప్రభుత్వం కొన్ని గ్రామాలను మున్సిపాల్టీలు, కార్పొరేషన్లలో కలిపే ప్రక్రియలో పై ప్రక్రియ పూర్తిగా పక్కన పెట్టేసి స్థానిక వైసీపీ నాయకుల ఇష్టారాజ్యం మేరకు వెళ్లిందన్న విమర్శలు ఉన్నాయి.
పంచాయతీ పాలనలో స్థానికంగా పట్టు కోల్పోవడానికి ఇష్టపడని వారు.. కార్పోరేషన్, మున్సిపాల్టీల్లో విలీనం అయితే స్థానికంగా తమ ఆధిపత్యం కోల్పోతామని భావించే వారు, పన్నుల భారం పెరుగుతోందని భావించిన గ్రామస్తులు హైకోర్టును ఆశ్రయించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇలా 15కు పైగా మున్సిపాల్టీలు, కార్పొరేషన్లలో ఎన్నికలు నిలిచిపోవడం లేదా పెండింగ్‌లో ఉండడానికి పైన చెప్పుకున్నవే కారణాలుగా కనిపిస్తున్నాయి. కీలకమైన కాకినాడ, రాజమహేంద్రవరం, నెల్లూరు, మంగళగిరి - తాడేపల్లి, గుంటూరు, విశాఖపట్నం పరిధిలోని పలు విలీన గ్రామాలు సహా కొత్తగా నోటిఫై చేసిన పలు నగర పంచాయతీలకు కూడా ఎన్నికలు జరగకుండా కోర్టుల కేసులు ఉన్నాయి.
పైన పేర్కొన్న స్థానిక సంస్థలకు ఎన్నికలు జరగాలంటే ముందుగా కేసులు అన్నీ పరిష్కారం అవ్వాలి. లేదా స్థానిక ప్రజలకు ఆమోద యోగ్యంగా ఉండేలా సరిహద్దులను మార్చాల్సి ఉంటుంది. వీటిని అన్నింటిని అధిగమించాలంటే ప్రభుత్వం చట్టం 5కు సవరణలు చేయడం లేదా ఇంతకు ముందు ప్రభుత్వం ఇచ్చిన విలీన నోటిఫికేషన్లను మరోసారి పునః సమీక్షించాలని భావిస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికలు పూర్తికాకపోతే కేంద్రం నుంచి వచ్చే డవలప్‌మెంట్ ఫండ్స్ అన్నీ ఆగిపోతాయి. ఈ క్రమంలోనే ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ వివాదాలు అన్నీ పరిష్కరించుకుని త్వరగా స్థానిక ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.
