అక్టోబరు వరకు సందడే సందడి.. కార్యకర్తలు ఫుల్ ఖుషీ!
వచ్చే అక్టోబరు లోగా రాష్ట్రంలో అన్ని స్థానిక సంస్థల ఎన్నికలను పూర్తి చేస్తామని ఇప్పటికే కోర్టుకు నివేదించింది.
By: Tupaki Political Desk | 20 Aug 2026 7:00 PM ISTకూటమి ప్రభుత్వం స్థానిక ఎన్నికలకు సై అంటోంది. వచ్చే అక్టోబరు లోగా రాష్ట్రంలో అన్ని స్థానిక సంస్థల ఎన్నికలను పూర్తి చేస్తామని ఇప్పటికే కోర్టుకు నివేదించింది. 17 మున్సిపల్ కార్పొరేషన్లతోపాటు 82 మున్సిపాలిటీలు, 24 నగర పంచాయతీలు, 13,352 పంచాయతీలు, 660 మండలాలు, ఆయా మండలాలకు జడ్పీటీసీలు, జిల్లా పరిషత్ చైర్మన్లకు అక్టోబరులో ఎన్నికలు జరగనున్నాయని అంటున్నారు. ఇక వార్డు మెంబర్లు, మున్సిపల్ కౌన్సిలర్లు, కార్పొరేటర్ల పదవులకు ఎన్నికలు జరగనుండటంతో 1.50 లక్షల మందికి కొత్తగా పదవులు దక్కే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.
ఇక ప్రభుత్వం స్థానిక ఎన్నికలకు సన్నాహాలు చేస్తుండటంతో క్షేత్రస్థాయిలో నాయకులు, కార్యకర్తలలో జోష్ కనిపిస్తోంది. ప్రధానంగా కూటమి పార్టీల్లో ఈ హడావుడి హంగామా ఎక్కువగా ఉంటోందని చెబుతున్నారు. మరోవైపు ప్రత్యక్ష ఎన్నికలు నిర్వహిస్తారన్న సమాచారంతో విపక్షం వైసీపీ కూడా స్థానిక సమరంపై ఎక్కువ ఆశలు పెట్టుకుంటోంది. తమకు 40 శాతం ఓటింగ్ ఉందన్న ధైర్యం, పంచాయతీలకు బ్యాలెట్ పద్ధతిలో ఎన్నికలు జరిగే అవకాశం ఉండటంతో వీలైనన్ని ఎక్కువ స్థానాల్లో పాగా వేస్తామని ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు ధీమా వ్యక్తం చేస్తున్నారు.
మొత్తానికి స్థానిక ఎన్నికల సంగ్రామంపై ప్రభుత్వం సంకేతాలు ఇవ్వడంతో అన్ని పార్టీలలో సందడి కనిపిస్తోంది. మరోవైపు ఎన్నికలకు సిద్ధమయ్యే క్రమంలో కార్యకర్తల ప్రాధాన్యం ఒక్కసారిగా పెరిగిపోయింది. సర్పంచ్, ఎంపీటీసీ, ఎంపీపీ, జడ్పీటీసీ, కౌన్సిలర్, కార్పొరేటర్ పదవులను ఆశిస్తున్న నాయకులు తమ పరిధిలో ఉన్న కార్యకర్తలను మచ్చిక చేసుకోడానికి ముమ్మరం చేశారని అంటున్నారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా గ్రామాలు, పట్టణాల వారీగా పార్టీలు, విందు సమావేశాలు ఎక్కువయ్యాయని అంటున్నారు. ప్రధానంగా కార్యకర్తల బలం ఉన్నవారికే అవకాశాలు లభించే పరిస్థితి ఉండటంతో ఎన్నికల వరకు వారికి మంచి మర్యాద చేయడంలో నేతలు వెనక్కి తగ్గే పరిస్థితి లేదని అంటున్నారు.
అక్టోబరు 31లోగా మున్సిపాలిటీలతోపాటు జిల్లా, మండల పరిషత్తులు, పంచాయతీలకు ఎన్నికల ప్రక్రియ పూర్తి చేస్తామని ప్రభుత్వం చెబుతోంది. ఇదే సమయంలో ఎన్నికలకు ముందస్తు సన్నాహాలు చేయాలని అధికారులకు సూచనలు జారీ చేసింది. దీంతో రాష్ట్రంలో ఎక్కడ చూసినా స్థానిక ఎన్నికలపైనే మాటలు జరుగుతున్నాయని అంటున్నారు. ముఖ్యంగా రాష్ట్రంలో 17 మున్సిపల్ కార్పొరేషన్లతోపాటు 28 జిల్లా పరిషత్ చైర్మన్ పదవులు ఎవరికి దక్కుతాయనే చర్చలు హీట్ పుట్టిస్తున్నాయి. ప్రధానంగా కూటమిలో మూడు పార్టీలు ఈ స్థానాల కోసం తీవ్రంగా ప్రయత్నించే అవకాశం ఉండటం, ఎక్కడైనా భేదాభిప్రాయాలు తలెత్తవా? పరిస్థితులు తమకు అనుకూలంగా మారవా అంటూ విపక్షం ఎదురుచూస్తోందని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు.
మరోవైపు ఈ ఎన్నికలతో ప్రభుత్వాన్ని వేధిస్తున్న రాజకీయ నిరుద్యోగ సమస్యకు పరిష్కారం లభించే అవకాశం ఉందని అంటున్నారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చాలా పదవులు భర్తీ చేసినా, వాటికన్నా ఎక్కువ గుర్తింపు, గౌరవం స్థానిక సంస్థల పదవులకు ఉంటాయని అంటున్నారు. దీంతో మున్సిపల్ చైర్మనులు, మండల, జిల్లా పరిషత్ అధ్యక్ష పదవుల కోసం నేతలు అప్పుడే పైరవీలు మొదలుపెట్టారనే టాక్ వినిపిస్తోంది. ఇదే సమయంలో కొన్ని జిల్లాలు, మున్సిపాలిటీలపై కన్నేసిన జనసేన, బీజేపీ నాయకత్వాలు స్థానికంగా బలమైన నాయకులపై ఫోకస్ చేయడంతో వైసీపీ నుంచి వలసలు ఎక్కువయ్యే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. మొత్తానికి స్థానిక ఎన్నికల సన్నాహాలు ఒకేసారి ఏపీ రాజకీయాలను వేడెక్కించాయని అంటున్నారు.
