Begin typing your search above and press return to search.

సీట్ల సర్దుబాటుపై నాదెండ్ల కీలక వ్యాఖ్యలు !

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల వేడి రాజుకుంది. మరి కొద్ది రోజులలో నోటిఫికేషన్ విడుదల కానుంది అని అంటున్నారు.

By:  Satya P   |   19 Sept 2026 5:51 PM IST
సీట్ల సర్దుబాటుపై నాదెండ్ల కీలక వ్యాఖ్యలు !
X

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల వేడి రాజుకుంది. మరి కొద్ది రోజులలో నోటిఫికేషన్ విడుదల కానుంది అని అంటున్నారు. ముందుగా మునిసిపాలిటీలు, కార్పోరేషన్లు ఆ తరువాత జెడ్పీటీసీ ఎంపీటీసీలు, చివరిలో పంచాయతీలకు ఎన్నికలు జరుగుతాయి. దాంతో కూటమి పార్టీల మధ్య ఎన్నికల చర్చ కూడా పెద్ద ఎత్తున సాగుతోంది. ఇదిలా ఉంటే కూటమిలోని మూడు పార్టీలు స్థానిక సంస్థల ఎన్నికల్లో సీట్ల సర్దుబాటు ఏ విధంగా చేసుకుంటాయన్న ఆసక్తి అయితే ఏపీ రాజకీయాల్లో ఉంది. అదే సమయంలో జనసేన కోరినట్లుగా సీట్లు దక్కుతాయా అన్నది కూడా ఆ పార్టీలో చర్చగా ఉంది. ఈ క్రమంలో విశాఖలో జరిగిన జనసేన ఆత్మీయ సమావేశంలో మంత్రి నాదెండ్ల మనోహర్ కీలక వ్యాఖ్యలు చేశారు. స్థానిక ఎన్నికలల్లో సీట్లపైన ఎవరూ తొందరపడవద్దు అంటూ క్యాడర్ కి సూచించారు.

కమిటీ ఏం చెప్పింది :

ఇక జనసేన తరఫున స్థానిక సంస్థల ఎన్నికల్లో సీట్ల విషయం మీద నియమించిన కమిటీ ఏ రకమైన నివేదిక ఇచ్చిందో కూడా పార్టీ సమావేశంలో నాదెండ్ల మనోహర్ పంచుకున్నారు. జనసేన కమిటీ ప్రతీ పార్లమెంట్ పరిధిలో ఏ పార్టీకి ఎంత బలం ఉంది అన్నదే నిర్దారించి నివేదిక ఇచ్చింది అని అన్నారు. అంతే తప్ప ఎవరిని అభ్యర్దిగా పెట్టాలి అని చెప్పలేదని స్పష్టం చేశారు. అభ్యర్థుల గురించి చర్చ ఉండదని కేవలం పార్టీల మధ్యనే చర్చ అని కూడా ఆయన క్లారిటీ ఇచ్చారు. తొందరలో టీడీపీ అధినేత చంద్రబాబు జనసేన నుంచి పవన్ బీజేపీ నేతలు కలసి నిర్వహించే సమావేశంలో సీట్ల విషయం తేలుతుందని నాదెండ్ల అన్నారు. ఇంకా అంతదాకా వ్యవహారం రానందువల్ల పార్టీ నేతలు కానీ కార్యకర్తలు కానీ ఊహాగానాలు నమ్మవద్దు అని నాదెండ్ల కోరారు.

ఎన్డీయేని గెలిపించాలి :

జనసేన ఎక్కడ పోటీలో ఉన్నా గెలిపిస్తూనే మొత్తం ఎన్డీయే కూటమిని గెలిపించేందుకు అంతా కృషి చేయాలని కోరారు నూటికి నూరు శాతం సీట్లు ఎన్డీయే పరం కావాలని నాదెండ్ల కోరారు. జనసేన నాయకులు కార్యకర్తలు ప్రతీ ఇంటికీ వెళ్లి జనసేన చేసిన అభివృద్ధి కార్యక్రమలాతో పాటు ఎన్డీయే ప్రభుత్వం ఏపీలో చేసిన కార్యక్రమాల గురించి వివరించాలని నాదెండ్ల దిశా నిర్దేశం చేశారు. ప్రతీ ఒక్క ఓటరుని కలవాలని ఆయన సూచించారు. ప్రతీ ఓటూ చాలా ఇంపార్టెంట్ అని కూడా చెప్పారు.

విశాఖ గెలుపుతోనే :

విశాఖ గురించి కూడా నాదెండ్ల ప్రస్తావించారు. విశాఖ ఎన్నికలు చాలా ప్రాధాన్యతను కలిగి ఉంటాయని అన్నారు. ఉత్తరాంధ్రా మొత్తం మీద ఆ ప్రభావం పడుతుందని అన్నారు. అందువల్ల విశాఖలో జరిగే కార్పోరేషన్ ఎన్నికలను కార్యకర్తలు ఒక సవాల్ గా తీసుకోవాలని కోరారు. ఇప్పటి నుంచే కార్యకర్తలు అంతా జనంతో మమేకం కావాలని వరసబెట్టి ఎన్నికలు ఉన్నాయని ఎక్కువ సమయం కూడా లేదని నాదెండ్ల చెప్పారు.

ఇంతకీ సీట్లు ఎన్ని :

మొత్తానికి నాదెండ్ల చెప్పిన విషయాలు చూస్తే ఏపీలో ఏ ఒక్క పార్టీకి అధికారికంగా సీట్లు అయితే ఖరారు కాలేదు. అంతవరకూ బాగానే ఉన్నా జనసేనకు ఎన్ని సీట్లు ఇస్తారు అన్న కార్యకర్తల ప్రశ్నలకు తగిన జవాబు అయితే రాలేదని అంటున్నారు. జనసేన అయితే 30 శాతం సీట్లు తమకు కేటాయించాలని ఒక ఫార్ములాను చెప్పింది. ఆ విధంగా చూస్తే విశాఖ కార్పోరేషన్ లో జనసేనకు 35 దాకా డివిజన్లు రావాలి. ఇదే నిష్పత్తిలో అన్ని చోట్లా దక్కాలి. అందుకే జనసేన నేతలు ఉత్సుకతను ప్రదర్శిస్తున్నారు. ఆ విధంగా సీట్ల షేరింగ్ జరుగుతుందా లేదా అన్నది అయితే తేలలేదు. త్వరలో జరిగే ఎన్డీయే భేటీలో తేలుతుందని అంటున్నారు. అంతవరకూ జనసేనలో ఈ ఉత్సుకత ఉత్కంఠ తప్పవని అంటున్నారు.