Begin typing your search above and press return to search.

లోకల్ ఎలక్షన్స్ వాయిదా ప్రచారం.. ఈసీ సీరియస్ యాక్షన్

అయితే ప్రభుత్వం, ఎన్నికల సంఘంతో సంబంధం లేకుండా ఎన్నికలు వాయిదా పడ్డాయని కొందరు సోషల్ మీడియా వేదికగా ప్రచారం చేస్తున్నారని.

By:  Tupaki Political Desk   |   1 Oct 2026 3:47 PM IST
లోకల్ ఎలక్షన్స్ వాయిదా ప్రచారం.. ఈసీ సీరియస్ యాక్షన్
X

రాష్ట్రంలో స్థానిక ఎన్నికల చుట్టూనే చర్చ జరుగుతోంది. ఈ నెలలో స్థానిక ఎన్నికల ప్రక్రియ ఎలాగైనా మొదలుపెట్టాలనే ఆలోచనతో ప్రభుత్వం ఉండగా, కొన్ని ఫేక్ ప్రకటనలతో ఎన్నికలు వాయిదా పడ్డాయనే ప్రచారం విస్తృతంగా జరుగుతోంది. దీనిపై ఎన్నికల సంఘం సీరియస్ గా స్పందించింది. ప్రజల్లో గందరగోళం సృష్టించేలా జరుగుతున్న ప్రచారాన్ని ఖండించడమే కాకుండా, ఎన్నికల సంఘం అధికారిక చిహ్నాలను, లెడర్ హెడ్ లను దుర్వినియోగం చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేసింది.

రాష్ట్రంలో అన్ని స్థానిక సంస్థలకు పదవీకాలం పూర్తి కావడంతో ఈ నెలలో ఎన్నికల ప్రక్రియ మొదలుపెట్టాలని ఎన్నికల సంఘం, ప్రభుత్వం పనిచేస్తున్నాయి. ఇప్పటికే ఈ అంశంపై వివిధ అభ్యంతరాలతో కోర్టులో పిటిషన్లు వేయగా, వాటిపై కోర్టు తీర్పు వెలువరించింది. ప్రధానంగా బీసీ రిజర్వేషన్లు పెంచుతూ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను కొట్టివేసిన హైకోర్టు, ఆరు నెలల్లోగా ఎన్నికల ప్రక్రియ ప్రారంభించాలని ఆదేశించింది. ప్రభుత్వం కూడా హైకోర్టు ఆదేశాల కోసమే ఎదురుచూస్తుండటంతో ఇప్పుడు ఎన్నికల ప్రక్రియ మరింత జోరు అందుకునే అవకాశం ఉందని అంటున్నారు.

అయితే ప్రభుత్వం, ఎన్నికల సంఘంతో సంబంధం లేకుండా ఎన్నికలు వాయిదా పడ్డాయని కొందరు సోషల్ మీడియా వేదికగా ప్రచారం చేస్తున్నారని. గత నెల నుంచి ఈ విషయమై ప్రజలను తప్పుదారి పట్టించాలనే ఆలోచనతో కొందరు ఉద్దేశపూర్వకంగా తప్పుడు కథనాలు ప్రచారంలోకి తేవడమే కాకుండా ఎన్నికల సంఘం అధికారిక చిహ్నాలను లెటర్ హెడ్లను వాడుకుని మీడియా ప్రతినిధులను సైతం బురిడీ కొట్టించారని చెబుతున్నారు. దీంతో ఎన్నికలు జరుగుతాయా? లేదా? అని తెలుసుకునేందుకు పలువురు ఎన్నికల సంఘం కార్యాలయానికి ఫోన్లు చేస్తున్నారు.

తప్పుడు ప్రచారంతో ఫోన్ల మోత మోగిపోవడంపై ఎన్నికల సంఘం సీరియస్ అయింది. తమ లెటర్ హెడ్లను దుర్వినియోగం చేయడమే కాకుండా, తప్పుడు ప్రచారాన్ని వ్యాప్తి చేసి తమ సమయాన్ని కూడా వృధా చేశారని, దీనివల్ల ఎన్నికల ఏర్పాట్లకు అవాంతరం ఏర్పడుతుందని భావిస్తూ పోలీసులకు లిఖిత పూర్వక ఫిర్యాదు చేసిందని చెబుతున్నారు. ఇక ఫేక్ ప్రచారాన్ని పసిగట్టిన పోలీసులు ఐటీ యాక్ట్ - 2000, భారతీయ న్యాయ సంహిత -2023 కింద క్రిమినల్ కేసులు నమోదు చేశారు. సోషల్ మీడియాలో ఎన్నికలు వాయిదా పడ్డాయని ప్రచారం చేసిన వారి లింకులు సేకరిస్తున్నారని చెబుతున్నారు.

మొత్తానికి ఈ వ్యవహారంతో ఎట్టి పరిస్థితుల్లో ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం మొగ్గు చూపుతోందని వెల్లడైందని అంటున్నారు. బీసీ రిజర్వేషన్లపై సుప్రీంలో అప్పీలు చేసిన తర్వాత ఎన్నికల షెడ్యూల్ విడుదలపై నిర్ణయం తీసుకోవచ్చునని అంటున్నారు. హైకోర్టు తీర్పుపై సుప్రీం స్టే విధించి, ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు ఎన్నికల నిర్వహణకు అడ్డు లేదని చెబితే 34 శాతం రిజర్వేషన్లతో ఎన్నికలు నిర్వహణకు సిద్ధమయ్యే అవకాశం ఉందని అంటున్నారు. లేనిపక్షంలో పార్టీ పరంగా రిజర్వేషన్ అమలు చేయాలని అధికార కూటమి నేతలు భావిస్తున్నారని చెబుతున్నారు. ఏదిఏమైనా సుప్రీం నిర్ణయం తెలిసిన వెంటనే ఎన్నికలకు వెళ్లేలా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించినట్లుగా ప్రచారం జరుగుతోంది.