తిన్నోళ్లకు తిన్నంత.. తాగినోళ్లకు తాగినంత.. వచ్చే రెండు నెలలూ పండుగే..
స్థానిక ఎన్నికలకు లైన్ క్లియర్ కావడంతో రాష్ట్రంలో వచ్చే రెండు నెలలు పండుగ వాతావరణమే నెలకొంటుందని అంటున్నారు.
By: Tupaki Political Desk | 9 Oct 2026 9:13 PM ISTరేపటి నుంచి దసరా ఉత్సవాలు ప్రారంభం కాబోతున్నాయి. ఇదే సమయంలో స్థానిక ఎన్నికలకు షెడ్యూల్ వచ్చే అవకాశం ఉండటంతో ఈ దసరా వేడుకలలో మరింత సందడి కనిపించే అవకాశం ఉందని అంటున్నారు. ముఖ్యంగా స్థానిక ఎన్నికలకు లైన్ క్లియర్ అవడంతో రాష్ట్రంలో ప్రతిచోటా సందడి కనిపిస్తోందని చెబుతున్నారు. ముఖ్యంగా పదవులు ఆశిస్తున్న నాయకులు తమ బలాబలాలను నిరూపించుకునేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు. అధిష్టానం దృష్టిలో పడేందుకు కార్యకర్తల మద్దతు సమీకరణను వేగవంతం చేశారని అంటున్నారు. దీంతో క్షేత్రస్థాయిలో నేతల ఇళ్లు, కార్యాలయాల వద్ద కోలాహలం కనిపిస్తోంది. మందు, విందుతో కార్యకర్తలను ఖుషీ చేయాల్సి వుండటంతో డబ్బు కూడా భారీగా ఖర్చయ్యే పరిస్థితి ఉందంటున్నారు.
ఎన్నికలు అంటే మందు, విందు, పసందే..
ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ముందుగా కార్యకర్తల గౌరవం రెట్టింపు అవుతోంది. అప్పటివరకు కార్యకర్తలను తప్పించుకునే నాయకులు ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని కార్యకర్తల చుట్టూ ప్రదక్షిణలు చేస్తుంటారు. ముఖ్యంగా ఈ పరిస్థితి అధికార పార్టీల్లో ఎక్కువగా ఉంటుందని విశ్లేషకులు చెబుతున్నారు. అధికార బలంతో గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉండటం వల్ల స్థానిక ఎన్నికల్లో అధికార పార్టీ నేతలు ఎక్కువ ఖర్చు పెట్టేందుకు ముందుకు వస్తారని అంటున్నారు. దీంతో ముందుగా అధిష్టానం దృష్టిలో పడేందుకు రకరకాలుగా పావులు కదుపుతుంటారని అంటున్నారు. ఎన్నికల సమయంలో కార్యకర్తల మద్దతు అత్యవసరం కావడంతో వారికి ఎక్కడా లేని గౌరవం ఇచ్చేందుకు నాయకులు పోటీపడుతుంటారని చెబుతున్నారు. దీంతో ప్రతి నాయకుడి ఇళ్లు, కార్యాలయాల వద్ద పండుగ వాతావరణం కనిపిస్తోందని చెబుతున్నారు. కార్యకర్తలను ఆకట్టుకోడానికి ప్రతి నేత మందు, విందుతో ఖుషీ చేయాల్సివుందని చెబుతున్నారు.
డబ్బులే డబ్బులు
ఇక స్థానిక ఎన్నికల్లో డబ్బు ప్రభావం కూడా విపరీతంగా ఉందని అంటున్నారు. ప్రధానంగా గ్రామాలు, పట్టణాల్లో తమ గౌరవం, ప్రతిష్ఠకు పరీక్షగా నిలిచే ఎన్నికలలో గెలిచేందుకు నేతలు ఎక్కువ ఖర్చు చేయాల్సివుందని అంటున్నారు. మందు, విందుతోపాటు కొందరు కార్యకర్తలను ప్రసన్నం చేసుకోడానికి డబ్బు కూడా ఖర్చు చేయాల్సి ఉంటుందని చెబుతున్నారు. నాలుగు ఓట్లు ఉన్నవారు, గెలుపు ఓటములను ప్రభావితం చేస్తారని భావించిన వారికి కానుకలు, కాసులు చెల్లించేందుకు నేతలు పోటీ పడే పరిస్థితి ఉంటుందని అంటున్నారు. గ్రామస్థాయిలో 50 - 100 ఓట్లు కూడా కీలకం కావడంతో నేతలకు స్థానిక ఎన్నికల్లో నెగ్గుకు రావడం నేతలకు పెద్ద పరీక్షగానే చెబుతున్నారు.
రెండు నెలల పండుగ
స్థానిక ఎన్నికలకు లైన్ క్లియర్ కావడంతో రాష్ట్రంలో వచ్చే రెండు నెలలు పండుగ వాతావరణమే నెలకొంటుందని అంటున్నారు. ప్రచారాలు, పైరవీలు, బుజ్జగింపులు వంటి కార్యక్రమాలతో ప్రతి ఊరువాడలో అనేక సిత్రాలు చూడాల్సివస్తుందని చెబుతున్నారు. ముందుగా పట్టణాలతో ప్రారంభమయ్యే ఈ ప్రక్రియ పంచాయతీ ఎన్నికలు ముగిసే వరకు కొనసాగుతుందని అంటున్నారు. మున్సిపాలిటీలకు 15 రోజుల్లో, జడ్పీ మండల పరిషత్తులకు మరో 15 రోజుల్లో ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉందని అంటున్నారు. ఇక పంచాయతీలకు మాత్రం షెడ్యూల్ బట్టి రెండు లేదా మూడు విడతల్లో నిర్వహిస్తే సుమారుగా నెల రోజుల సమయం పడుతుందని అంటున్నారు. దీంతో వచ్చే రెండు నెలలు సందడి వాతావరణమే ఉంటుందని అంటున్నారు. రాజకీయ కూలీల నుంచి ప్రచార కార్యక్రమాలకు అవసరమైన వివిధ రంగాల వారికి చేతినిండా పనికూడా లభిస్తుందని అంటున్నారు. కరువు తీరా పని లభించే అవకాశం ఉండటంతో ఈ దసరా నుంచి సంక్రాంతి వరకు అందరికీ డబ్బు లోటు లేని విధంగా రొటేషన్ లోకి వస్తుందని చెబుతున్నారు.
