స్థానికం అంటే ఇంతేమరి.. ఓటర్ల లెక్క వేరే, ఈ ఫలితాలే నిదర్శనం
స్థానిక సంస్థల ఎన్నికల్లో మున్సిపాలిటీల్లో కూటమి ఆధిపత్యం కనిపించినా, జడ్పీటీసీ, ఎంపీటీసీ ఫలితాల్లో భిన్నమైన తీర్పు వెలువడింది. బొత్స సోదరి గుర్ల జడ్పీటీసీగా, చెవిరెడ్డి కుమారుడు హర్షిత్ రెడ్డి విజయం సాధించడంలో క్రాస్ ఓటింగ్ ప్రభావం ఉందని విశ్లేషిస్తున్నారు. మొవ్వలో టీడీపీ రెబల్ వీరేంద్ర గెలుపు, గన్నవరంలో బీజేపీ అభ్యర్థి 63 ఓట్ల తేడాతో ఓడిపోవడం కూడా స్థానిక అభ్యర్థుల ప్రభావాన్ని చాటుతున్నాయి.
By: Tupaki Political Desk | 8 Nov 2026 4:42 PM ISTస్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. మున్సిపల్ ఎన్నికల్లో అధికార కూటమి హవా స్పష్టంగా కనిపించింది. జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో సైతం కూటమి దూసుకుపోయినా, కొన్నిచోట్ల ప్రతిపక్ష నేతలు కూడా తమ బలం నిరూపించుకోవడం హాట్ టాపిక్ అవుతోంది. ముఖ్యంగా వైసీపీకి చెందిన ముఖ్యనేతలు బొత్స సత్యనారాయణ, చెవిరెడ్డి భాస్కరరెడ్డి, జక్కంపూడి రాజా వంటివారు స్థానిక ఎన్నికల్లో తమ మద్దతుదారులు, కుటుంబ సభ్యులను గెలిపించుకుని అధికార కూటమికి గట్టి సవాల్ విసిరారని అంటున్నారు.
నిజానికి స్థానిక ఎన్నికల్లో ఎప్పుడూ అధికారంలో ఉన్న పార్టీలదే పైచేయిగా ఉంటుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అయితే తాజా ఎన్నికల్లో మాత్రం క్షేత్రస్థాయిలో ఓటర్ల నాడి పూర్తిగా భిన్నంగా ఉన్నట్లు సంకేతాలిస్తోందని చెబుతున్నారు. కొన్ని స్థానాల్లో ఫలితాలు రాజకీయ విశ్లేషకులను సైతం విస్మయానికి గురిచేశాయని అంటున్నారు. ఈ ఎన్నికల ఫలితాలను గమనిస్తే, ప్రధాన పార్టీల అంచనాలను తలకిందులు చేయడంలో 'క్రాస్ ఓటింగ్' కీలక పాత్ర పోషించినట్లు స్పష్టమవుతోందని చెబుతున్నారు.
మున్సిపల్ ఎన్నికల్లో చాలాచోట్ల ఏకపక్షంగా ఓటర్లు తీర్పునిచ్చారని చెబుతున్నారు. కానీ ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో మాత్రం చాలా చోట్ల ఓటర్లు భిన్నమైన తీర్పునిచ్చారని చెబుతున్నారు. ప్రధానంగా బలమైన నేతలకు ఓటు వేసి తమకు నచ్చని వారిని ఓడించారని చెబుతున్నారు. పార్టీ గుర్తులపై ఎన్నికలు జరిగినప్పటికీ కొన్నిచోట్ల ఒక పార్టీ జడ్పీటీసీ అభ్యర్థి గెలిస్తే, అదే మండలంలోని ఎంపీటీసీ స్థానాలు వేరే పార్టీకి ఎక్కువగా వచ్చాయని చెబుతున్నారు. అదే సమయంలో జడ్పీటీసీ ఓట్లకు, ఎంపీటీసీలకు వచ్చిన ఓట్లకు మధ్య చాలా వ్యత్యాసం కూడా ఉందని లెక్కలు చూపుతున్నారు. ఈ విభిన్నమైన పోలింగ్ సరళి కారణంగా రెండు ప్రధాన రాజకీయ పార్టీలకు చెందిన గెలుపు ఓటముల లెక్కలు పూర్తిగా తారుమారయ్యాయని చెబుతున్నారు. కొన్ని ప్రతిష్టాత్మక స్థానాల్లో ఊహించని పరిణామాలు చోటుచేసుకోవడానికి ఈ క్రాస్ ఓటింగే ప్రధాన కారణమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
ముఖ్యంగా సీనియర్ నేతలు బొత్స, చెవిరెడ్డి భాస్కరరెడ్డి తమ కుటుంబ సభ్యులను గెలిపించుకోవడంలో క్రాస్ ఓటింగ్ కీలక పాత్ర పోషించిందని చెబుతున్నారు. విజయనగరం గుర్ల మండల జడ్పీటీసీగా బొత్స సోదరి సంగిరెడ్డి వెంకటలక్ష్మి విజయం సాధించారు. ఈ మండలంలో వైసీపీకి 9, టీడీపీకి 9 ఎంపీటీసీ స్థానాలు వచ్చాయని చెబుతున్నారు. అయినప్పటికీ క్రాస్ ఓటింగ్ కారణంగా బొత్స సోదరి గెలుపొందారని అంటున్నారు. అదేవిధంగా చెవిరెడ్డి కుమారుడు హర్షిత్ రెడ్డి పోటీ చేసిన తిరుపతి రూరల్ నియోజకవర్గంలోనూ భారీగా క్రాస్ ఓటింగ్ జరిగిందని విశ్లేషిస్తున్నారు. ఈ కారణంగా హర్షిత్ రెడ్డి అనూహ్య విజయం సాధించారని చెబుతున్నారు. అదేవిధంగా కృష్ణ జిల్లాలో క్రాస్ ఓటింగ్ కారణంగా ఇద్దరు ఎమ్మెల్యేలకు షాక్ తగిలిందని చెబుతున్నారు. పామర్రు ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా నిర్ణయానికి వ్యతిరేకంగా పోటీ చేసిన మొవ్వ జడ్పీటీసీ టీడీపీ రెబల్ వీరేంద్ర సుమారు 6 వేల మెజార్టీతో గెలిచారు.
అదేవిధంగా గన్నవరం నియోజకవర్గంలో ఇద్దరు ఎంపీటీసీ అభ్యర్థులు రెబల్స్ గా పోటీకి దిగడంతో అధికార పార్టీకి ఝలక్ తగిలిందని చెబుతున్నారు. గన్నవరం జడ్పీటీసీగా బీజేపీ అభ్యర్థి కేవలం 63 ఓట్ల తేడాతో ఓడిపోయాడు. దీనికి ప్రధాన కారణం క్రాస్ ఓటింగేనని విశ్లేషిస్తున్నారు. అధికార, ప్రతిపక్ష పార్టీలనే తేడా లేకుండా క్షేత్రస్థాయిలో నాయకుల వ్యక్తిగత ప్రభావం, స్థానిక అంశాలు ఓటర్ల వ్యూహాత్మక ఆలోచనలు ఫలితాలను శాసించాయని చెబుతున్నారు. పార్టీలకంటే స్థానికంగా అభ్యర్థుల బలాబలాలు, ప్రజలతో వారి సంబంధాలు ఓటింగ్ సరళిని తీవ్రంగా ప్రభావితం చేశాయని తాజా ఫలితాలు నిరూపిస్తున్నాయి.
మొత్తంగా చూస్తే జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో చోటుచేసుకున్న ఈ అనూహ్య పరిణామాలు, క్రాస్ ఓటింగ్ ధోరణులు రాబోయే సాధారణ ఎన్నికలకు ప్రధాన రాజకీయ పార్టీలకు ఒక హెచ్చరికగా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. పార్టీలకంటే ఓటరు ఎంతో చైతన్యవంతంగా వ్యవహరిస్తున్నాడని, కేవలం పార్టీ గుర్తును చూసే కాకుండా అభ్యర్థి సామర్థ్యాన్ని బట్టి ఓటు వేస్తున్నారనేదానికి ఈ ఎన్నికల ఫలితాలే నిలువెత్తు నిదర్శనమని వ్యాఖ్యానిస్తున్నారు. ఈ అనూహ్య ఫలితాలు రానున్న కాలంలో పార్టీల వ్యూహాలను మార్చుకోవాల్సిన అవసరాన్ని సూచిస్తున్నాయని అంటున్నారు.
