ఏపీలో కోడ్ కూస్తోంది...తొలి విడతలో అక్కడ ఎన్నికలు !
గత కొద్ది నెలలుగా చర్చలో ఉన్న స్థానిక ఎన్నికల వ్యవహారం ఇపుడు జనంలోకి వస్తోంది.
By: Satya P | 14 Oct 2026 8:51 AM ISTగత కొద్ది నెలలుగా చర్చలో ఉన్న స్థానిక ఎన్నికల వ్యవహారం ఇపుడు జనంలోకి వస్తోంది. జనాలు పోలింగ్ బూత్ లకు వెళ్ళి తన విలక్షణమైన తీర్పు వెల్లడించే సమయం ఆసన్నం అయింది. దానికి రాష్ట్ర ఎన్నికల సంఘం ముహూర్తం ఖరారు చేస్తోంది. ఈ మొత్తం ప్రక్రియకు శుభారంభంగా ఏపీ స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూలుని ఈ నెల 14న బుధవారం ఉదయం 11:30 గంటలకు విడుదల చేస్తున్నారు. ఇదిలా ఉంటే ఏపీలో లోకల్ బాడీ ఎన్నికలను మూడు దశలలో నిర్వహించనున్నారు. దాంతో మూడు దశల ఎన్నికల షెడ్యూల్ ని కూడా ఈ నోటిఫికేషన్ లో ప్రకటిస్తారు. ఈ మేరకు కసరత్తు పూర్తి అయింది. నవంబర్ 30లోపు 3 దశల ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయాలని నిర్ణయించారు.
కార్పోరేషన్లుతోనే :
ఇక చూస్తే ఏపీలో మూడు దశల స్థానిక ఎన్నికల్లో మొదట విడతలో కార్పోరేషన్లు, మునిసిపాలిటీలకు ఎన్నికలు ఉంటాయని తెలుస్తోంది. అంటే 17 నగర పాలక సంస్థలు 106 మునిసిపాలిటీలు తొలి దశలో ఉంటాయన్న మాట. అలాగే రెండవ దశలో జెడ్పీ చైర్మలు, జెడ్పీటీసీలు, ఎంపీపీలు, ఎంపీటీసీలకు ఎన్నికలు నిర్వహిస్తారు. మూడవ విడతలో పంచాయతీలకు ఎన్నికలు జరుపుతాయి. ఇందులో పంచాయతీలకు నిర్వహించే ఎన్నికలు పార్టీలకు రాజకీయాలకు అతీతంగా జరుపుతారు. ఇక నోటిఫికేషన్ జారీ చేసే ప్రతీ విడతలోనూ నామినేషన్ల దాఖలు నుంచి ఫలితాల విడుదల వరకూ పదిహేను రోజులు గడువు ఉంటుంది అని అంటున్నారు. ఇలా ఎన్నికలను మొత్తంగా నలభై అయిదు రోజుల వ్యవధిలోనే ముగించేలా పూర్తి స్థాయిలో షెడ్యూల్ ఖరారు చేస్తున్నారు.
ఎన్నికల కోడ్ :
ఏపీలో నోటిఫికేషన్ ఒక్కసారి విడుదల అయితే ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చినట్లే అని అంటున్నారు. దాంతో ప్రభుత్వ అధికార కార్యక్రమాలు ప్రారంభోత్సవాలు వంటివి ఉండవు. దాంతో పాటు ఎన్నికల ప్రచారం ఊపందుకుంటుంది. రాజకీయ సభలు సమావేశాలతో ఏపీ హోరెత్తనుంది. 2024 సార్వత్రిక ఎన్నికలు జరిగాక రెండేళ్లకు జరుగుతున్న ష్తానిక సంస్థల ఎన్నికలు మరో మినీ కురుక్షేత్రాన్ని తలపించనున్నాయి అని అంటున్నారు. వైసీపీ కూడా ఈసారి స్థానిక సంస్థల ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో గ్రౌండ్ లెవెల్ నుంచి కార్పోరేషన్ దాకా రాజకీయ సమరం భీకరంగా సాగనుంది. అంతే కాదు అటు కూటమి ఇటు వైసీపీ మోహరించి సై అంటే సై అనే తీరు కనిపించనుంది.
గ్రాఫ్ పెంచుకోవడానికి :
ఇక వైసీపీ అయితే ఈ ఎన్నికల్లో పాల్గొనడం ద్వారా తన గ్రాఫ్ పెంచుకోవాలని చూస్తోంది. గతం కంటే ఏ మాత్రం ఎక్కువ సీట్లు సాధించిన ఏపీలో తన రాజకీయానికి ఎదురు లేదని చాటి చెప్పనుంది. ఇక కూటమి అయితే నూటికి నూరు శాతం స్ట్రైక్ రేట్ సాధించి వైసీపీకి మరోసారి కోలుకోలేని దెబ్బ తీయాలని చూస్తోంది. మొత్తంగా చూస్తే ఏపీలో స్థానిక ఎన్నికలు మాత్రం సరికొత్త రాజకీయాన్ని చూపించడం ఖాయమనే అంటున్నారు. చూడాలి మరి ఏమి జరుగుతుందో.
