Begin typing your search above and press return to search.

ఏపీలో స్థానిక ఎన్నిక‌లు జ‌రిగేనా.. వాళ్లు రెడీనా...!

ఏపీలో స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల‌కు పార్టీలు రెడీ అవుతున్నాయి. ఇప్ప‌టికే జ‌న‌సేన‌, టీడీపీ వంటి కూట‌మి పార్టీలు ఎన్నిక‌ల‌ను స‌మ‌ర్థ‌వంతంగా ఎదుర్కొనేందుకు.. క్షేత్ర‌స్థాయిలో పార్టీల‌ను బ‌లోపేతం చేస్తున్నాయి.

By:  Garuda Media   |   10 Jan 2026 5:00 PM IST
ఏపీలో స్థానిక ఎన్నిక‌లు జ‌రిగేనా.. వాళ్లు రెడీనా...!
X

ఏపీలో స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల‌కు పార్టీలు రెడీ అవుతున్నాయి. ఇప్ప‌టికే జ‌న‌సేన‌, టీడీపీ వంటి కూట‌మి పార్టీలు ఎన్నిక‌ల‌ను స‌మ‌ర్థ‌వంతంగా ఎదుర్కొనేందుకు.. క్షేత్ర‌స్థాయిలో పార్టీల‌ను బ‌లోపేతం చేస్తున్నాయి. అదేస‌మ‌యంలో మండ‌లాలు గ్రామాల వారీగా పార్టీల‌కు క‌మిటీల‌ను కూడా రెడీ చేస్తున్నాయి. మొత్తంగా.. త్వ‌ర‌లోనే స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల‌కు ముహూర్తం రానుంద‌న్న ప్ర‌చారం కూడా ఊపందుకుంది. టీడీపీ మ‌రింత దూర‌దృష్టితో ఈ ఎన్నిక‌ల‌ను ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకుంది. పార్ల‌మెంట‌రీ స్థాయి క‌మిటీల‌ను కూడా రెడీ చేసుకుంది.

ఇక‌, రాష్ట్ర ఎన్నిక‌ల సంఘం కూడా త‌న‌వంతు ప్రిప‌రేష‌న్‌లో ముందుంది. ఇప్ప‌టికే రాష్ట్ర ఎన్నిక‌ల ప్ర‌ధాన అధికారి నీలం సాహ్ని .. ఎన్నిక‌ల‌పై దృష్టి పెట్టారు. ఈవీఎంల ద్వారానే ఈద‌ఫా ఎన్నిక‌లు నిర్వ‌హించాల‌ని ఆమె భావిస్తున్నారు. అయితే.. దీనిపై కేంద్ర ఎన్నిక‌ల సంఘం నుంచి అనుమ‌తి రావాల్సి ఉంది. మ‌రోవైపు క్షేత్ర‌స్థాయిలో ఎన్నిక‌ల ఓట‌ర్ల జాబితాల‌ను కూడా సిద్ధం చేసుకుంటున్నారు. ఇలాంటి స‌మ‌యంలో అంతా ప్రిపేర్ అవుతున్నార‌న్న చ‌ర్చ‌ల నేప‌థ్యంలో అనూహ్యంగా మునిసిప‌ల్ ఎన్నిక‌ల‌పై బ‌ల‌మైన వాద‌న తెర‌మీదికి వ‌చ్చింది.

ఈ ఏడాది ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలకు బ్రేక్ పడే అవకాశాలు లేక పోలేదని తెలుస్తోంది. ఈ ఎన్నికలు కుల‌, జనగణనలు పూర్తయిన తర్వాతే జరుగుతాయని అధికారులు సంకేతాలు ఇస్తున్నారు. దీంతో ఈ ఏడాది ఎన్నికలు జరిగే అవకాశాలు లేదని, ఈ ఏడాది కుల‌, వ‌చ్చే ఏడాది జ‌న గ‌ణ‌న‌లు చేప‌ట్ట‌నున్నారు. దీంతో ఎన్నిక‌లు 2028లో జరిగే అవకాశం ఉందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. కొద్ది రోజుల కిందట రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి నీలం సాహ్ని ఎన్నికల సన్నాహాలు ప్రారంభించినప్పటికి జనగణన అంశం తెరపైకి రావడంతో ఎన్నికల షెడ్యూల్ వాయిదా పడే సూచనలు కన్పిస్తున్నాయి.

ఏంటీ గ‌ణ‌న‌.. ?

కేంద్ర గ‌ణాంక శాఖ‌.. ప్ర‌తి 10 సంవ‌త్స‌రాల‌కు ఒక‌సారి జ‌నాభాను లెక్కించాల్సి ఉంటుంది. దీని ఆధారంగా కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వా లు.. ప్ర‌జ‌ల‌కు సంబంధించిన ప‌లు కీల‌క నిర్ణ‌యాలు తీసుకుంటాయి. ఈ లెక్క‌న 2011లో జ‌రిగిన జ‌న‌గ‌ణ‌న త‌ర్వాత‌.. 2021లో జ‌ర‌గాల్సి ఉంది. కానీ. అప్ప‌ట్లో క‌రోనా నేప‌థ్యంలో ఈ ప్ర‌క్రియ వాయిదా ప‌డింది. ఇక‌, ఆత‌ర్వాత‌.. 2024 ఎన్నిక‌ల‌కు ముందు ఎందుక‌ని రాష్ట్రాలు అన‌డంతో కేంద్రం దీని నుంచి త‌ప్పుకొంది. ఇలా.. వాయిదా ప‌డుతూ వ‌చ్చిన ప్ర‌క్రియ ఈ నెల ఆఖ‌రులో జ‌ర‌గ‌నుంది. తొలుత కుల గ‌ణ‌న చేప‌ట్ట‌నున్నారు. ఆ త‌ర్వాత‌.. జ‌న గ‌ణ‌న చేప‌డ‌తారు. ఈ రెండు ప్ర‌క్రియ‌లు పూర్త‌య్యే స‌రికి 2028 వ‌చ్చేస్తుంది. ఆ త‌ర్వాతే స్థానిక ఎన్నిక‌లు నిర్వ‌హించే అవ‌కాశం ఉంటుంది.