Begin typing your search above and press return to search.

గ్రౌండ్ లో క్యాడర్...లోకల్ ఫైట్ వెరీ టఫ్ !

స్థానిక సంస్థల ఎన్నికలకు మేము సిద్ధమని రాష్ట్ర ఎన్నికల సంఘం అయితే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది అని వార్తలు వస్తున్నాయి.

By:  Satya P   |   8 Aug 2026 9:22 AM IST
గ్రౌండ్ లో క్యాడర్...లోకల్ ఫైట్ వెరీ టఫ్ !
X

స్థానిక సంస్థల ఎన్నికలకు మేము సిద్ధమని రాష్ట్ర ఎన్నికల సంఘం అయితే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది అని వార్తలు వస్తున్నాయి. అన్ని రకాలుగా ఎన్నికల ప్రక్రియను సజావుగా నిర్వహించడానికి రాష్ట్ర ఎన్నికల సంఘం పూర్తి స్థాయిలో సమాయత్తం అవుతోంది. ఏపీలో చూస్తే అధికార కూటమి కూడా స్థానిక ఎన్నికలను తొందరగా జరిపించాలని చూస్తోంది. రెండున్నరేళ్ళ కూటమి పాలన పూర్తి కావడానికి ముందే ఈ తతంగాన్ని పూర్తి చేస్తే క్యాడర్ కి పదవులు దక్కుతాయి, మిగిలిన సగ భాగం పాలన కూడా జోరెత్తించవచ్చు అన్నది కూటమి పెద్దల ఆలోచనగా కనిపిస్తోంది అంటున్నారు.

మరోసారి భీకర పోరు :

ఏపీలో స్థానిక ఎన్నికలలో రాజకీయ పార్టీల గుర్తింపు లేనిది ఒక్క గ్రామ పంచాయతీ ఎన్నికల్లో మాత్రమే. అక్కడ పార్టీల మద్దతుదారులు మాత్రమే ఉంటారు. గెలిచిన అభ్యర్ధికి తమ పార్టీ వారిగా ముద్ర వేసుకుంటారు. ఇక అది తప్పించి ఎంపీటీసీ జెడ్పీటీసీ మునిసిపాలిటీలు కార్పోరేషన్లు అన్నీ కూడా పార్టీ గుర్తుల మీదనే జరుగుతాయి. దాంతో ఈ ఎన్నికలు మరోసారి సార్వత్రిక ఎన్నికల వేడిని రాజేయడం ఖాయమని అంటున్నారు. ఏపీలో 2024 మే 13న జరిగిన అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల తరువాత మళ్ళీ ఏపీలో మొత్తం ఓటర్లు ఎన్నికల ప్రక్రియలో పాల్గొనే సన్నివేశం కూడా ఇదే అవుతుంది.

సర్ ప్రక్రియ తరువాత :

ఇక ఈ మధ్యనే ఏపీలో సర్ ప్రక్రియ పూర్తి అయింది. 2024 ఎన్నికల్లో ఓటేసిన నాలుగు కోట్ల మంది ఓటరల్లో ఇపుడు 40 లక్షల మంది దాకా ఓటర్లు తగ్గారు అని ముసాయిదా జాబితా వెలువడింది. అయితే ఇందులో సవరణలకు చాన్స్ ఇచ్చారు. ఆ విధంగా ఓటర్లు మరింతగా పెరగనున్నారు. ఎంత పెరిగినా నాలుగు కోట్ల ఓటర్ల నంబర్ అయితే ఈసారి ఉండదని అంటున్నారు. దానికి కారణం డబులు ఎంట్రీ ఓటర్లు పెద్ద ఎత్తున ఉన్నారు, వారు తగ్గిపోతారు. అలాగే పక్కాగా మరణించిన ఓటర్లను తీసి పక్కన పెట్టేసారు. ఈ రెండు క్యాటగిరీ ఓటర్లే మొత్తం 40 లక్షల ఓటర్లలో ఎక్కువ. దాంతో సర్ తరువాత తగ్గిన ఓటర్ల జాబితాతో జరగబోయే లోకల్ వార్ లో విజేతలు ఎవరు అన్నది ఉత్కంఠను పెంచే అంశంగా చూస్తున్నారు.

వారినే ముందు పెట్టి :

ఈసారి స్థానిక ఎన్నికలు వేడిని పెద్ద ఎత్తున పుట్టిస్తాయి అనడానికి కీలకమైన విషయాలు ఏంటి అంటే కూటమి వర్సెస్ వైసీపీగా చెప్పాలి. కూటమి పార్టీలు అయితే తమ క్యాడర్ కి స్పష్టమైన ఆదేశాలనే ఇస్తున్నాయి. ప్రతీ చోటా గెలవాల్సిందే అని కూడా గట్టిగానే సూచిస్తున్నాయి. కూటమి ప్రభుత్వం పట్ల జనంలో సానుకూలత ఉంది. దానిని సొమ్ము చేసుకోవడానికి ఇదే అవకాశం అని కూడా అంటున్నారు. గెలిస్తే పదవులు మీవే అవుతాయని కూడా ఊరిస్తున్నారు. ఏకగ్రీవాలని ఎక్కువగా ప్రోత్సహించాలని కూడా కోరుతున్నారు. ఇక వైసీపీ విషయానికి వస్తే ఏకగ్రీవం అన్నది అసలు ఉండరాదని క్యాడర్ కి కోరుతోంది. అలా చేస్తే కనుక నేరుగా అసెంబ్లీ ఇంచార్జిల మీదనే యాక్షన్ తీసుకుంటామని అంటోంది. స్థానిక ఎన్నికల్లో పార్టీలో పనిచేసిన వారిని గెలిపిస్తే రేపటి సార్వత్రిక ఎన్నికల్లో వారే అండగా ఉంటారని కూడా చెబుతోంది. సరిగ్గా పనిచేయని వారి మీద చర్యలు ఉంటాయని టీడీపీ వైసీపీ గట్టి హెచ్చరికలు జారీ చేస్తున్న నేపధ్యంలో గట్టి పోరు అయితే గ్రౌండ్ లో జరిగే అవకాశం ఉంది. క్యాడర్ గ్రౌండ్ లో ఉంటే సైన్యం అంతా అటూ ఇటూ మోహరించినట్లే. మరి స్థానిక సంస్థల ఎన్నికలు మినీ కురుక్షేత్రాన్ని తలపిస్తాయా అంటే రెండు నెలలలో అంతా తేలుతుంది.