లోకల్ రిజల్ట్ : జనాలకు ఇంట్రెస్ట్ తగ్గిందా ?
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలపై గతంలో కనిపించిన ఉత్కంఠ ఈసారి తగ్గిపోయింది. 2021లో వైసీపీ ఏకపక్ష విజయాలు సాధించగా, ప్రస్తుతం కూటమి ఘన విజయాలు నమోదు చేస్తోంది. దీంతో ఫలితాలు ముందే తెలిసిపోతున్నాయనే భావన ప్రజల్లో నెలకొందని విశ్లేషకులు అంటున్నారు. అయితే ప్రజాస్వామ్యంలో బలమైన ప్రతిపక్షం, పోటీ ఉండటం అవసరమని అభిప్రాయపడుతున్నారు.
By: Satya P | 7 Nov 2026 7:37 PM ISTఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు వరసగా జరిగాయి. ఫలితాలు వస్తున్నాయి. అయితే గతంలో ఉన్న క్యూరియాసిటీ ఇపుడు కనిపించడం లేదు. నిజానికి ఏపీలో ఏ చిన్న ఎన్నిక అయినా విపరీతమైన హైప్ క్రియేట్ అవుతుంది. పోటీలు పందేలు అటూ ఇటూ మోహరించి మరీ సవాళ్ళు ప్రతి సవాళ్ళూ ఉంటాయి. కానీ ఈసారి చూస్తే తేడా బాగానే కనిపిస్తోంది. ఎందుకు అనేది చర్చ కాదు, జనాలకు ఫలితం ముందే తెలిసిపోయింది అన్నదే దీనిని జవాబుగా ఉంది.
సహజంగానే :
ఇక చూస్తే సహజంగానే స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలు ఎపుడూ అధికార పక్షానికి అనుకూలంగా ఉంటాయి. అయితే అనేక రాష్ట్రాల్లో ఈ ఎన్నికలు చూసినపుడు 60 -40 రేషియో లేదా 70-30 రేషియోలో అధికార విపక్షాలకు మధ్య ఫలితాలు ఉంటాయి. కానీ ఏపీలో చూస్తే 2021 నుంచి సీన్ మారింది సెంట్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ ని అధికార పార్టీలు కోరుకుంటున్నాయి. అలాగే ఎన్నికల తతంగం సాగుతోంది. దాంతో రిజల్ట్ మీద కూడా పెద్దగా ఆసక్తి అయితే ఉండడం లేదని అంటున్నారు.
ఢీ అంటే ఢీ :
నిజానికి ఏపీలో రెండు పార్టీలు రెండు కుటుంబాలు అని అంటూంటారు. కానీ లోకల్ బాడీస్ విషయంలో చూస్తే 2021లో కానీ 2026లో కానీ ఈ రెండు అన్నది ఎక్కడా కనిపించలేదు. అంతా ఏకపక్షంగా సాగడమే దానికి కారణం. 2021లో కూడా వైసీపీ ఏకపక్ష వైఖరిని ప్రదర్శించింది. దాంతో ఫలితాలు అన్నీ ఫ్యాన్ నీడకు చేరిపోయాయి. ఇపుడు కూటమికి ఘన విజయాలు దక్కుతున్నాయి. తేడా ఏమీ లేదని జనం కూడా నిర్ధారణకు వచ్చేశారు అని అంటున్నారు. ఈ నేపథ్యంలో వైసీపీ నేతలు పెడుతున్న గగ్గోలు కానీ వారి పెడబొబ్బలు కానీ పెద్దగా జనాలకు పట్టని అంశాలుగా మారిపోతున్నాయని అంటున్నారు.
నీవు నేర్పిన విద్యయే :
ఇక నీవు నేర్పిన విద్యయే నీరజాక్షా అని పురాణ వ్యాఖ్యానం ఉంది. అలా వైసీపీ ఆనాడు చేసిన దానికి ఈనాడు రిజల్ట్ ఒక రిటార్ట్ అని సగటు జనం అనుకోవాల్సి వస్తోంది. అందుకే వైసీపీ వాదనలు వీగిపోతున్న పరిస్థితులు ఉన్నాయని అంటున్నారు. తమకు అన్యాయం జరుగుతోంది అని వైసీపీ గొంతెత్తుతున్నా అది ఒంటరి స్వరంగా మారిపోవడానికి ఇదే కారణం అని అంటున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలను ఒక ప్రహసనంగా మార్చడంలో అందరి పాత్ర ఉందని ఘాటు విమర్శలు ఉన్నాయి. ఈ కారణం చేతనే ఫలితాల పట్ల కూడా ఆసక్తి తగ్గిపోయింది అని అంటున్నారు. మామూలుగా అయితే టీవీ సహా ప్రధాన ప్రసార మాధ్యమాలలో బిగ్ డే జడ్జిమెంట్ డే అని ఉదయం నుంచే చర్చలు పెడతారు. అలాగే ప్రతీ ఫలితాన్ని విశ్లేషిస్తారు. కానీ ఈసారి అలాంటిది ఏదీ లేకుండా పోయింది అంటే రిజల్ట్ అందరికీ ముందే తెలుసు కాబట్టి అని అంటున్నారు.
ఇది మంచికేనా :
ఈ తరహా రాజకీయం మంచికేనా అంటే దీని మీద కూడా భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. రాజకీయం అంటే ఒకరు వేసే ఎత్తులకు మరొకరు పై ఎత్తు వేస్తారు అని అంటారు. అందువల్ల నాడు వైసీపీ అంతా తమదే అనుకుని చేసిన దానికి ఈ రోజు రీ సౌండ్ తో జవాబు వస్తోంది అని విశ్లేషించేవారు కూడా ఉన్నారు. అందుకే వైసీపీ సింపతీ కార్డు మద్దతు పెద్దగా వర్కౌట్ అవడం లేదని అంటున్నారు. అయితే రాజకీయాలు అయినా మరొకటి అయినా పోటీ ఉండాలి, ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షం సమర్ధంగా ఉండాలి. అలా ఉంటేనే ప్రగతి దారులు కనిపిస్తాయి. అంతా ఒకే పక్షం అయితే మజా ఉండదు, పైగా అది మంచిది కాదని అంటున్నారు. మరి అలాంటి వాతావరణం వస్తుందా అంటే వేచి చూడాల్సిందే అంటున్నారు విశ్లేషకులు.
