కూటమి గెలుపు బాగుంది.. అసలు స్టోరీ ఏంటంటే.. !
స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి విజయాలు మూడు పార్టీల్లో ఉత్సాహం నింపాయి. అయితే ఈ ఫలితాలే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లోనూ విజయానికి పునాది అవుతాయని భావించడం సరికాదనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. 2021లో స్థానిక ఎన్నికల్లో ఘన విజయం సాధించిన వైసీపీ, 2024 అసెంబ్లీ ఎన్నికల్లో 11 స్థానాలకే పరిమితమైంది. కాబట్టి కూటమి స్థానిక విజయాలతో పాటు ప్రజల్లో ఉన్న అసంతృప్తిని తగ్గించుకోవడంపైనా దృష్టి పెట్టాల్సి ఉంటుంది.
By: Garuda Media | 8 Nov 2026 8:00 PM ISTరాష్ట్ర వ్యాప్తంగా కూటమి పార్టీలు దిగ్విజయం సాధించాయి. స్థానిక సంస్థల ఎన్నికలతో పాటు జడ్పిటిసి ఎంపిటిసి స్థానాల్లో కూడా మెరుగైన ఫలితాలు దక్కించుకున్నాయి. ఇది ఒక రకంగా 2024తో పోలిస్తే ఇప్పుడు భారీ స్థాయిలో కూటమికి జోష్ వచ్చిందని చెప్పాలి. ఎందుకంటే వచ్చే ఎన్నికల నాటికి ఇది తొలి మెట్టుగా మూడు పార్టీలు భావిస్తున్నాయి. క్షేత్రస్థాయిలో పార్టీ బలంగా ఉంటే వచ్చే ఎన్నికల నాటికి విజయం మరింత సునాయాసంగా మారుతుంది అనేది ఒక అంచనా.. మండల స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు మున్సిపల్ స్థాయి నుంచి కార్పొరేషన్ల వరకు కూడా పార్టీలు బలంగా ఉంటే మన నాయకులే ఉంటే మరింతగా విజయం సొంతం చేసుకునే అవకాశం ఉంటుందన్నది సాధారణంగా పార్టీలు వేసే అంచనా.
అయితే ఈ అంచనా ఒక్కొక్కసారి తలకిందులైన పరిస్థితులు కూడా ఉన్నాయి. ఉదాహరణకు 2021 లో వైసీపీకి భారీ స్థాయిలో స్థానిక సంస్థల్లో కావచ్చు కార్పొరేషన్లలో కావచ్చు బలమైన నాయకులు రంగంలోకి ఉన్నారు. అన్ని స్థానాలను కూడా దాదాపు వైసీపీ సొంతం చేసుకుంది. విజయవాడ, విశాఖపట్నం, కర్నూలు, కడప ఇలా అన్నిప్రాంతాల్లోనూ వైసీపీ జెండాలే కనిపించేవి. కానీ 2024 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈ నాయకుల బలం ఏమైపోయింది అనేది ప్రశ్న. కేవలం 11 స్థానాలకే వైసీపీ పరిమితం అయింది.
ఇదిలా ఉంటే ఇప్పుడు కూటమికి వచ్చే ఎన్నికల విషయం కూడా అంతే ప్రాధాన్యం ఏర్పడింది. వైసీపీ వచ్చినంత భారీ స్థాయిలో తేడా వస్తుంది అని అంచనా వేయలేక పోయినప్పటికీ గెలిచినంత మాత్రాన లేదా ఒక స్థానిక సంస్థను సొంతం చేసుకున్నంత మాత్రాన వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు ఇది ప్రాతిపదికగా మారుతుందా అనేది ప్రధానమైనటువంటి ప్రశ్న. ఇదే ప్రాతిపదిక నిజమైతే గతంలో వైసిపి కూడా గెలిచి ఉండాలి. కాబట్టి స్థానిక సంస్థల్లో గెలిచిన కార్పొరేషన్లను సొంతం చేసుకున్నా అసెంబ్లీ ఎన్నికలకి స్థానిక సంస్థల ఎన్నికలకు లింకు పెట్టడం అనేది సాధ్యమయ్యే పని కాకపోవచ్చు.
అయితే కూటమిపై ప్రజల్లో తీవ్ర స్థాయిలో వ్యతిరేకత అయితే లేదు. స్వల్పంగా మాత్రమే అసంతృప్తి మాత్రం ఉంది. దీనిని తగ్గించుకునే దిశగా అడుగులు వేస్తేనే కూటమి మరోసారి అధికారంలోకి వచ్చే అవకాశం ఉంటుంది. అంతే తప్ప స్థానిక సంస్థల్లో గెలిచేసాం కాబట్టి కార్పొరేషన్ దక్కించుకున్నాం కాబట్టి మొత్తం పూర్తిస్థాయిలో రాష్ట్రమంతా విజయం సాధిస్తాం అనే విషయంలో కూటమి ఎక్కువగా దృష్టి పెట్టడం సరికాదని అంటున్నారు. దీనికి వైసీపీనే పెద్ద ఉదాహరణగా ఉన్న నేపథ్యంలో కూటమి ఈ విషయంపై మరింత కసరత్తు చేయాల్సి ఉంటుందని పరిశీలకులు భావిస్తున్నారు.
