మద్యం స్కాం కేసులో కీలక తీర్పు.. ముగ్గురికి బెయిలు!!
ఏపీ మద్యం స్కాం కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. బెయిలు కోసం నిందితులు పెట్టుకున్న పిటిషన్ పై గురువారం హైకోర్టులో విచారణ జరిగింది
By: Tupaki Political Desk | 29 Jan 2026 5:21 PM ISTఏపీ మద్యం స్కాం కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. బెయిలు కోసం నిందితులు పెట్టుకున్న పిటిషన్ పై గురువారం హైకోర్టులో విచారణ జరిగింది. ఎప్పటి నుంచో బెయిలు కోసం ప్రయత్నిస్తున్న మాజీ ఎమ్మెల్యే ఏ38 చెవిరెడ్డి భాస్కరరెడ్డికి విముక్తి లభించింది. ఆయనతోపాటు ఏ6 సజ్జల శ్రీధర్ రెడ్డి, ఏ34 చెరుకూరి వెంకటేశ్ నాయుడుకు కూడా హైకోర్టు బెయిలు మంజూరు చేసింది. బెయిలు పొందిన నిందితులు దేశం విడిచి వెళ్లరాదని షరతు విధిస్తూ హైకోర్టు తీర్పునిచ్చింది. ఏ1 రాజ్ కేసిరెడ్డితోపాటు ఆయన బంధువు మరో నిందితుడు ముప్పిడి అవినాశ్ రెడ్డి బెయిలు పిటిషన్ను మాత్రం హైకోర్టు తిరస్కరించింది.
మద్యం స్కాంలో మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డికి బెయిలు రావడం విస్తృత చర్చకు దారితీసింది. దాదాపు 226 రోజుల పాటు జైల్లో ఉన్న చెవిరెడ్డి బెయిలు కోసం విస్తృతంగా ప్రయత్నించారు. ఎట్టకేలకు ఆయన ప్రయత్నం ఫలించింది. ఇటీవల వెన్ను నొప్పితో బాధపడిన చెవిరెడ్డికి విజయవాడ సమీపంలో ఉన్న డాక్టర్ మంతెన సత్యనారాయణ రాజు ప్రకృతి చికిత్సాలయంలో వైద్యం కోసం కోర్టు అనుమతించింది. ఇలాంటి సమయంలో చెవిరెడ్డికి బెయిలు లభించడం పెద్ద ఊరటగానే వ్యాఖ్యానిస్తున్నారు.
మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డితోపాటు ఆయన సన్నిహితుడు వెంకటేశ్ నాయుడు గత ఏడాది జూన్ 17న బెంగళూరులో అరెస్టు అయ్యారు. మద్యం కేసులో లుక్ అవుట్ నోటీసు జారీ కావడంతో చెవిరెడ్డితోపాటు వెంకటేశ్ నాయుడును బెంగళూరు విమానాశ్రయ పోలీసులు విదేశాలకు వెళ్లకుండా అడ్డుకున్నారు. అప్పటి వరకు చెవిరెడ్డి అరెస్టుపై ఎవరికీ ఎలాంటి సమాచారం లేదు. మద్యం కేసులో చెవిరెడ్డి పాత్రపై ఎలాంటి కథనాలు బయటకు రాలేదు. ఇలాంటి సమయంలో మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి శ్రీలంక వెళ్లేందుకు బెంగళూరు ఎయిరుపోర్టుకు వెళ్లగా, మద్యం కేసులో ఆయన నిందితుడు అన్న విషయం వెలుగుచూసింది.
గత ఏడాది జూన్ 17న చెవిరెడ్డిని బెంగళూరులో అరెస్టు చేసిన పోలీసులు విజయవాడ తరలించారు. అప్పటి నుంచి బెయిలు కోసం తీవ్ర ప్రయత్నాలు చేశారు చెవిరెడ్డి. తాను జీవితంలో ఎప్పుడూ మద్యం ముట్టుకోలేదని, అటువంటిది తనను అన్యాయంగా అరెస్టు చేశారని కన్నీరు పెట్టుకున్నారు. అదేవిధంగా తన అక్రమ అరెస్టుపై పలుమార్లు కోర్టు ప్రాంగణంలో గట్టిగా నినాదాలు చేసి చెవిరెడ్డి కలకలం రేపారు. ఇక జైలులో ఉండగా, ఆయన పలుమార్లు అనారోగ్యానికి గురయ్యారు. ప్రభుత్వ వైద్య శాలలో చికిత్స చేయించుకున్నారు.
మద్యం స్కాంలో డిస్టలరీల నుంచి దాదాపు రూ.250 కోట్లు సేకరించి గత ఎన్నికల్లో ఖర్చుచేశారని మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డిపై సిట్ అభియోగాలు మోపింది. అదేవిధంగా ఆయన సన్నిహితుడు వెంకటేశ్ నాయుడు ఫోన్ నుంచి రికవరీ చేసిన డేటాలో డబ్బు కట్టలు లెక్కపెడుతున్న వీడియో వైరల్ గా మారింది. మద్యం స్కామ్ నిధులతో చెవిరెడ్డి కుటుంబం రూ. 54.87 కోట్లకు పైగా ఆస్తులను అక్రమంగా కొనుగోలు చేసిందని, రిజిస్ట్రేషన్ పత్రాల్లో మాత్రం తక్కువ విలువ రూ. 8.85 కోట్లగా చూపించారని సిట్ ఆరోపిస్తోంది. ఈ ఆరోపణల నేపథ్యంలో చెవిరెడ్డికి బెయిలు లభించడం చాలా క్లిష్టం మారిందని అంటున్నారు. అయితే ఎట్టకేలకు ఆయన పిటిషన్ ను హైకోర్టు పరిష్కరించింది.
ఏపీ మద్యం స్కాంలో చెవిరెడ్డితోపాటు మరో ఇద్దరికి బెయిలు లభించడం కీలక పరిణామంగా వ్యాఖ్యానిస్తున్నారు. రూ.3,500 కోట్ల విలువైన మద్యం స్కాంలో మొత్తం 50 మందిని నిందితులుగా సిట్ గుర్తించింది. ఇందులో కొన్ని సంస్థలు ఉన్నాయి. మొత్తం 16 మంది నిందితులను అరెస్టు చేసి జైలుకు తరలించారు. అరెస్టు అయిన వారిలో గతంలో ఐదుగురికి బెయిలు మంజూరైంది. తాజాగా ముగ్గురికి బెయిలు మంజూరు కావడంతో మిగిలిన నిందితుల్లో ఆశలు చిగురిస్తున్నాయని అంటున్నారు.
