చల్లారని 'మండలి' మంటలు!
ఏపీ శాసనసభ తీరు ఎలా ఉన్నప్పటికీ.. ప్రధానంగా శాసన మండలిలో మాత్రం వైసీపీ వర్సెస్ టీడీపీ మధ్య మంటలు ఏమాత్రం చల్లారడం లేదు.
By: Garuda Media | 19 Aug 2026 5:00 PM ISTఏపీ శాసనసభ తీరు ఎలా ఉన్నప్పటికీ.. ప్రధానంగా శాసన మండలిలో మాత్రం వైసీపీ వర్సెస్ టీడీపీ మధ్య మంటలు ఏమాత్రం చల్లారడం లేదు. కేవలం నాలుగు రోజులు మాత్రమే జరగాల్సి ఉన్నప్పటికీ.. ఇప్పటికే రెండు రోజులు పూర్తియనప్పటికీ.. వైసీపీ సభ్యులు దారిలోకి రావడం లేదు. సోమవారం ప్రారంభమైన మండలి సమావేశాలు.. గురువారంతో ముగియనున్నాయి. ఈ నేపథ్యంలో సభలో ఏం చర్చించాలి? ఏయే అంశాలను ప్రస్తావించాలన్న విషయమే మూడో రోజు వరకు తేలలేదు.
డీఎస్సీ చుట్టూనే..
కూటమి ప్రభుత్వం నిర్వహించిన మెగా డీఎస్సీ-2025లో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తున్న వైసీపీ.. దీని పై మండలిలో చర్చకు పట్టుబడుతోంది. అయితే.. దీనికి తాము వ్యతిరేకం కాదని.. కానీ, ఒక విధానం ప్రకారం ముందుకు సాగుదామని అధికార పక్షం చెబుతోంది. దీనికి వైసీపీ ససేమిరా అంటుండడం గమనార్హం. దీంతో గత రెండు రోజులు ఎలాంటి చర్చలు లేకుండానే మండి వాయిదా పడింది. పైగా కీలకమైన బీఏసీ సమావేశంలో కూడా ఎలాంటి చర్చలు జరపడం లేదు.
బుధవారం కూడా..
ఇక, మూడో రోజు సమావేశాల్లో బుధవారం కూడా మండలి వాయిదా పర్వంతోనే కొనసాగుతోంది. సభ ప్రారంభం కాగానే వైసీపీ సభ్యులు డీఎస్సీపై చర్చించాలని కోరుతూ వాయిదా తీర్మానం ఇచ్చారు. అయితే.. దీనిని చైర్మన్ మోషేన్ రాజు తిరస్కరించారు. దీంతో వైసీపీ సభ్యులు పోడియంను చుట్టుముట్టి నినాదాలు చేశారు. నల్ల రిబ్బన్లు ధరించి ప్రభుత్వ వైఖరికి నిరసన తెలుపుతున్నామని పేర్కొన్నారు. దీంతో సభను చైర్మన్ వాయిదా వేశారు.
ప్రభుత్వ వాదన ఇదీ..
మండలిలో ప్రజలకుఅ త్యంత కీలకమైన ఎల్‌నినో పై చర్చిద్దామని ప్రభుత్వం పక్షం చెబుతోంది. దీనిపై ప్రజలకు కొన్ని సూచనలు, సలహాలు ఇచ్చే అవకాశం ఉందని.. వైసీపీ సభ్యులు కూడా తమ సూచనలు సలహాలు ఇవ్వాలని కోరుతోంది. అయితే.. వైసీపీ మాత్రం తొలుత డీఎస్సీపై చర్చకు పట్టుబట్టడంతో మండలి కార్యక్రమాలు వాయిదా పడుతున్నాయి. కాగా.. గురువారంతో సభలు ముగియనుండడం గమనార్హం.
