ఏపీలో అంతర్జాతీయ వర్సిటీ.. మండలిలో కీలక బిల్లు
ఇక అదేవిధంగా ఏపీ ప్రైవేటు వర్సీటీ (స్థాపన, క్రమబద్దీకరణ) చట్టం-2025, ఏపీ వర్సిటీల సవర్ణ బిల్లు - 2025ను కూడా శాసనమండలి ఆమోదించింది.
By: Tupaki Political Desk | 27 Sept 2025 5:27 PM ISTఏపీ శాసనమండలిలో కీలకమైన ఆరు బిల్లులకు ఆమోదం లభించింది. అంతర్జాతీయ వర్సిటీ ఏర్పాటుతోపాటు మరో ఐదు బిల్లులను సభ్యులు ఆమోదించినట్లు మండలి చైర్మన్ మోషేన్ రాజు ప్రకటించారు. అనంతరం శాసనమండలిని నిరవధిక వాయిదా వేస్తున్నట్లు వెల్లడించారు. ఈ ఆరు బిల్లులలో ప్రధానమైనది న్యాయవిద్య, పరిశోధన కోసం అమరావతిలో భారత అంతర్జాతీయ వర్సిటీ ఏర్పాటు చేయాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది.
ఇక అదేవిధంగా ఏపీ ప్రైవేటు వర్సీటీ (స్థాపన, క్రమబద్దీకరణ) చట్టం-2025, ఏపీ వర్సిటీల సవర్ణ బిల్లు - 2025ను కూడా శాసనమండలి ఆమోదించింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు కుష్టువ్యాధి అనే పదం తొలగించేందుకు చేసిన చట్ట సవరణకు మండలి ఆమదం తెలిపింది. ఏపీ వ్యవసాయ భూమి (వ్యవసాయేతర ప్రయోజనాలకు మార్పు) చట్టం 2006 బిల్లు, ఏపీ పబ్లిక్ సర్వీసులకు నియామకాల నియంత్రణ, వేతన సరళీకరణ బిల్లు - 2025, టెన్నిస్ క్రీడాకారుడు సాకేత్ సాయిని డిప్యూటీ కలెక్టరుగా నియమించే ప్రతిపాదన కోసం చేసిన చట్ట సవరణను సభ ఆమోదించింది.
ఏపీ వస్తు సేవల పన్ను (సవరణ) బిల్లు - 2025 కు ఆమోద ముద్ర పడింది. ఈ బిల్లులను సభ అంగీకారం తెలుపుతున్నట్లు ప్రకటించిన అనంతరం మండలిని చైర్మన్ మోషేన్ రాజు నిరవధికంగా వాయిదా వేశారు. ఈ నెల 18న మండలి సమావేశాలు ప్రారంభమవగా, 8 రోజుల పాటు సభా కార్యక్రమాలు నిర్వహించారు. పలు బిల్లులను ఆమోదించడంతోపాటు వివిధ అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. ప్రతిపక్షం వైసీపీకి మండలిలో సభ్యుల బలం ఎక్కువగా ఉండటంతో ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేలా అనేక అంశాలపై చర్చ జరిగింది.
8 రోజులు జరిగిన మండలి సమావేశాల్లో విపక్షం వైసీపీని ప్రభుత్వం కొన్నిసార్లు ఇరుకన పెట్టింది. ప్రధానంగా జీఎస్టీ సంస్కరణలపై జరిగిన చర్చలో విపక్షం ఆత్మరక్షణలో పడింది. జీఎస్టీ సంస్కరణలను వైసీపీ అధినేత జగన్ అభినందిస్తూ ట్విటర్ లో పోస్టు పెట్టడం, బీఏసీలో జీఎస్టీ బిల్లును వ్యతిరేకిస్తున్నట్లు మండలిలో ప్రతిపక్ష నేత బొత్స చెప్పడంతో గందరగోళం ఏర్పడింది. అదేవిధంగా మండలి చరిత్రలో తొలిసారిగా అధికార పార్టీ ప్రవేశపెట్టిన తీర్మానానికి వైసీపీ మద్దతు చెప్పడం ఈ సమావేశాల్లోనే చోటుచేసుకుంది. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను అడ్డుకున్న కేంద్ర ప్రభుత్వాన్ని అభినందిస్తూ ప్రభుత్వం తీర్మానం ప్రవేశపెట్టగా వైసీపీ సభ్యులు కూడా మద్దతు ప్రకటించారు. ఇలా ఈ సారి మండలి సమావేశాలు ఎంతో ఆసక్తికరంగా జరిగాయని అంటున్నారు.
