మండలి డిప్యూటీ చైర్మన్, వైసీపీ సిద్ధం.. కూటమి నిర్ణయంపైనే ఉత్కంఠ!
శాసనమండలి సమావేశాల వేళ డిప్యూటీ చైర్మన్ ఎన్నికపై విస్తృత చర్చ జరుగుతోంది. ప్రస్తుతం శాసనమండలి డిప్యూటీ చైర్మన్ పోస్టు ఖాళీగా ఉంది.
By: Tupaki Political Desk | 12 Aug 2026 5:20 PM ISTశాసనమండలి సమావేశాల వేళ డిప్యూటీ చైర్మన్ ఎన్నికపై విస్తృత చర్చ జరుగుతోంది. ప్రస్తుతం శాసనమండలి డిప్యూటీ చైర్మన్ పోస్టు ఖాళీగా ఉంది. గత నెల 27వ తేదీవరకు వైసీపీకి చెందిన జకియా ఖానమ్ డిప్యూటీ చైర్ పర్సనుగా ఉండేవారు. ఆమె పదవీకాలం పూర్తికావడంతో రిటైర్ అయ్యారు. దీంతో మండలి ఉపాధ్యక్ష పదవి ఖాళీ ఏర్పడింది. దీంతో ఈ సమావేశాల్లో డిప్యూటీ చైర్ పర్సన్ ఎన్నికకు నోటిఫికేషన్ విడుదల అవుతుందా? అనే చర్చ జరుగుతోంది. ఇదే సమయంలో ప్రభుత్వ నిర్ణయంతో సంబంధం లేకుండా వైసీపీ తమ పార్టీ తరఫున డిప్యూటీ చైర్ పర్సన్ గా ఎమ్మెల్సీ తూమాటి మాధవరావు పేరును ఖరారు చేశారు. దీంతో ప్రభుత్వ నిర్ణయం ఉత్కంఠ రేపుతోంది. ప్రభుత్వం వైసీపీ నిర్ణయించిన తూమాటి మాధవరావును డిప్యూటీ చైర్ పర్సన్ గా ఎంపిక చేయడానికి సిద్ధమవుతుందా? లేదా? అనే ప్రశ్న హాట్ టాపిక్ అవుతోంది.
శాసనమండలిలో సభ్యులు బలాబలాల ఆధారంగా ఎన్నిక నిర్వహిస్తే వైసీపీ ప్రతిపాదించిన ఎమ్మెల్సీ తూమాటి మాధవరావు డిప్యూటీ చైర్ పర్సన్ గా ఎంపిక అవడం ఖాయమే అంటున్నారు. ఎందుకంటే 58 మంది సభ్యులు ఉన్న శాసనమండలిలో ఇప్పటికీ వైసీపీకే పూర్తి మెజార్టీ ఉందని చెబుతున్నారు. ప్రస్తుతం సభలో వైసీపీకి అధికారికంగా 33 మంది సభ్యులు ఉన్నారు. ఇక అధికార కూటమికి 13 మంది సభ్యులు ఉండగా, ఇండిపెండెంట్లు, ఇతర పార్టీల వారు ఏడుగురు సభ్యులుగా వ్యవహరిస్తున్నారు. మొత్తం ఏడు ఖాళీలు ఉన్నాయి. ఈ సంఖ్యల ఆధారంగా వైసీపీ తన అభ్యర్థిని గెలుపించుకునే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు.
అయితే, వైసీపీ సభ్యుల్లో ఐదుగురు ఇప్పటికే రాజీనామాలు ప్రకటించారు. వీరు అధికార కూటమి పార్టీలలో చేరిపోయారు. అయితే వీరి రాజీనామాలను ఇప్పటివరకు మండలి అధ్యక్షుడు మోషేన్ రాజు ఆమోదించలేదు. దీంతో వైసీపీకి రాజీనామా చేసి టీడీపీ, జనసేనలో చేరిన సభ్యుల నిర్ణయం ఉత్కంఠ రేపుతోంది. పార్టీ సూచించిన అభ్యర్థికి కాకుండా వీరు తమ ఆత్మప్రబోధం మేరకు ఓటు వేస్తారా? అన్న చర్చ జరుగుతోంది. అయితే పార్టీ తరఫున ఎన్నికైన సభ్యులకు ఇలా సొంత నిర్ణయం తీసుకునే వీలు లేదని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. పార్టీ విప్ జారీ చేస్తే పార్టీ సూచించిన అభ్యర్థికే ఓటు వేయాల్సివుంటుందని అంటున్నారు.
మరోవైపు ఈ చర్చలకు తెరదించేలా ప్రభుత్వం నిర్ణయం ఉండే అవకాశం ఉందని అంటున్నారు. సభలో బలం లేనందున ఈ సమావేశాల్లో మండలి డిప్యూటీ చైర్మన్ ఎన్నిక నిర్వహించే పరిస్థితి ఉండకపోవచ్చునని పరిశీలకులు అనుమానిస్తున్నారు. వైసీపీ నేతకు పదవి కట్టబెట్టేలా ప్రభుత్వం ఎందుకు నిర్ణయం తీసుకుంటుందని ప్రశ్నిస్తున్నారు. మరో ఏడాది ఆగితే సభలో అధికార పక్షానికి బలం చేకూరే అవకాశం ఉందని, అందువల్ల ప్రస్తుతం ఖాళీ అయిన డిప్యూటీ చైర్మన్ పదవిని వెనువెంటనే భర్తీ చేసేలా నిర్ణయం తీసుకోకపోవచ్చునని అంటున్నారు. అయితే మండలి చైర్మనుగా వైసీపీకి చెందిన మోషేన్ రాజు ఉండటం వల్ల డిప్యూటీ చైర్ పర్సన్ ఎన్నికపై ఆయన నిర్ణయమూ కీలకంగానే చెబుతున్నారు. దీంతో వైసీపీ రెడీ అయినప్పటికి మండలి డిప్యూటీ చైర్ పర్సన్ ఎన్నిక ఉంటుందా? ఉండదా? అనేది సందేహాలు మాత్రం ఎక్కువగానే ఉన్నాయని చెబుతున్నారు.
