ఎద్దు.. దద్దమ్మ.. శాసనమండలిలో నేతల తిట్ల పర్వం
ఏపీ శాసనమండలి సమావేశాలలో నేతల దూషణల పర్వం చర్చనీయాంశంగా మారింది.
By: Tupaki Political Desk | 17 Aug 2026 1:46 PM ISTఏపీ శాసనమండలి సమావేశాలలో నేతల దూషణల పర్వం చర్చనీయాంశంగా మారింది. మంత్రి అచ్చెన్నాయుడు, మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యానారాయణ పరస్పరం వ్యక్తిగత విమర్శలు చేసుకోవడంతో సభలో గందరోగళం చోటుచేసుకుంది. ప్రతిపక్ష నేత బొత్సను మంత్రి అచ్చెన్నాయుడు ‘దద్దమ్మ’ అంటే అందుకు ప్రతిగా బొత్స కూడా తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. మనిషి ఎద్దులా పెరిగితే సరిపోదు భాష కూడా సరిగా రావాలి అంటూ ప్రతిపక్ష నేత ఎదురుదాడి చేశారు. అయితే బొత్స అభ్యంతరాలను లెక్కచేయని మంత్రి అచ్చెన్నాయుడు పదేపదే దద్దమ్మ అంటూ విరుచుకుపడ్డారు. నా పర్సనాలిటీ గురించి మాట్లాడుతున్నారు, ఐదేళ్లు డీఎస్సీ వేయించలేకపోయారు అందుకే దద్దమ్మా అంటూ మరోసారి వ్యాఖ్యానించడంతో సభలో తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది.
శాసనమండలి వర్షాకాల సమావేశాల్లో అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల మంటలు పుట్టించాయి. సభ ప్రారంభమైన నుంచి డీఎస్సీపై చర్చించేందుకు విపక్షం పట్టుబడగా, అధికార పక్షం ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ లక్ష్యంగా చేసిన విమర్శలతో సభలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. సభలో విపక్ష సభ్యులు ‘‘మెగా డీఎస్సీ.. దగా డీఎస్సీ’’ ‘‘ఇదేమీ రాజ్యం దొంగల రాజ్యం’’ అంటూ నినాదాలు చేయడంతో మంత్రి అచ్చెన్నాయుడు కలుగ చేసుకున్నారు. ‘‘డీఎస్సీ మీద మాట్లాడే నైతిక హక్కు గొడ్డలి పార్టీకి లేదు. గతంలో విద్యాశాఖ మంత్రిగా పనిచేసిన వ్యక్తి (బొత్స సత్యానారాయణ) సిగ్గు పడాలి. 2019-24 మధ్య ఐదేళ్లలో ఒక్క డీఎస్సీ ఇవ్వలేకపోయారు. ఎన్నికల్లో మాట ఇచ్చి మాట తప్పారు. నిరుద్యోగుల జీవితాలతో ఆడుకున్నారు. బొత్స సత్యానారాయణ విద్యాశాఖ మంత్రిగా ఉండి వారి గొడ్డలిపార్టీ అధ్యక్షుడికి చెప్పుకోలేని ‘‘దద్దమ్మ’’.. ఈ రోజు మళ్లీ శాసనమండలిలో మాట్లాడుతున్నారు.’’ అంటూ మంత్రి అచ్చెన్నాయుడు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
దీనిపై విపక్ష సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేయడంతో సభలో కాసేపు గందరగోళం నెలకొంది. దీంతో సభను కాసేపు వాయిదా వేశారు. ఆ తర్వాత మళ్లీ సభ ప్రారంభం కాగా, ప్రతిపక్ష నేత బొత్స మాట్లాడుతూ మంత్రి అచ్చెన్నాయుడు ఉద్దేశించి తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ఆ సమయంలో మైకు లేకపోవడంతో బొత్స మాట్లాడిన మాటలు రికార్డు కాలేదు. మనిషి ఎద్దులా పెరిగితే సరిపోదంటూ మంత్రి అచ్చెన్నాయుడుపై బొత్స ఆగ్రహంవ్యక్తం చేయగా, మళ్లీ మంత్రి అచ్చెన్నాయుడు జోక్యం చేసుకున్నారు. విద్యాశాఖ మంత్రిగా పనిచేసి డీఎస్సీ వేయించలేకపోయినందునే దద్దమ్మ అన్నానంటూ మరోసారి పునరుద్ఘాటించారు. దద్దమ్మ అన్నది అన్ పార్లమెంటరీ అయితే క్షమాపణ చెబుతా, చేతకాని వారిని దద్దమ్మ అంటారు అంటూ తీవ్ర స్వరంతో మాట్లాడారు. నా పర్సనాలిటీ గురించి మాట్లాడతారా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇక అచ్చెన్నాయుడు మాటలను అడ్డుకున్న బొత్స గొడ్డలి పార్టీ, దద్దమ్మ అనే విమర్శలను ఆక్షేపించారు. ఆ మాటలను వెనక్కి తీసుకోమని డిమాండ్ చేశారు. అయితే ప్రభుత్వం తరఫున మంత్రి అచ్చెన్నాయుడు తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ సభలో ఏ అంశంపైన అయినా చర్చించేందుకు సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. అంతేకాకుండా ‘‘డీఎస్పీపై చర్చించేందుకు ఈ బుక్ లెట్ ను పంపిస్తా.. సిగ్గు ఉండాలి. డీఎస్సీ పెట్టలేదు. 300 కేసులు వేశారు. కోర్టు కూడా చీవాట్లు పెట్టింది. మీకు సిగ్గుండాలి. నైతిక హక్కు ఎక్కడ ఉంది’’. అంటూ ఎదురుదాడి చేశారు. దీంతో సభలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. మంత్రి అచ్చెన్నాయుడు, ప్రతిపక్ష నేత బొత్స మధ్య వాగ్వాదం కొనసాగుతుండగానే సభ్యులు నినాదాలతో హోరెత్తించారు. దీంతో సభలో ఏం జరుగుతుందో తెలియని అయోమయ పరిస్థితి నెలకొంది.
