కర్ణాటకతో ఏపీ పాలి‘ట్రిక్సు’.. లోకేశ్ ఫైటింగ్, పవన్ లాబీయింగ్!
ఏపీ, కర్ణాటక మధ్య సంబంధాలపై ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేశ్ వ్యవహరిస్తున్న తీరు చర్చనీయాంశం అవుతోంది.
By: Tupaki Political Desk | 7 Oct 2025 1:00 AM ISTఏపీ, కర్ణాటక మధ్య సంబంధాలపై ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేశ్ వ్యవహరిస్తున్న తీరు చర్చనీయాంశం అవుతోంది. కర్ణాటక నుంచి పరిశ్రమలను తన్నుకుపోయేందుకు లోకేశ్ కాచుకుని కూర్చోగా, పవన్ ఆ రాష్ట్రంతో మెరుగైన బంధాన్ని కొనసాగించేందుకు ప్రయత్నాలు చేస్తుండటం విశేషంగా చెబుతున్నారు. ఈ రోజు కర్ణాటక వెళ్లిన డిప్యూటీ సీఎం పవన్ పై కర్ణాటకకు చెందిన రిటైర్డ్ జస్టిస్ గోపాల గౌడ పెద్ద భారం మోపారు.
కర్ణాటకలో ముఖ్యంగా బెంగళూరులో పరిశ్రమలను కొనసాగించే విషయంలో ఐటీతోపాటు ఇతర పారిశ్రామిక వేత్తలు తర్జనభర్జన పడుతున్నట్లు ఇటీవల కథనాలు వస్తున్నాయి. బెంగళూరు నగరంలో రహదారుల నిర్వహణ సరిగా లేకపోవడంతో ట్రాఫిక్ జామ్ అవుతుండటం, కార్యాలయాలకు ఆలస్యంగా వెళ్లాల్సిరావడం వల్ల వృత్తి జీవితంలో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు ఐటీ జనులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వీరి సమస్యలపై కొందరు సీఈవోలు ఎక్స్ వేదికగా ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు. దీంతో ఆయా పరిశ్రమలకు మెరుగైన సౌకర్యాలు కల్పిస్తామని విశాఖ, అనంతపురం తరలిరావాలని మంత్రి నారా లోకేశ్ ‘ఎక్స్’ వేదికగా ఓపెన్ ఆఫర్ ఇస్తున్నారు. దీంతో లోకేశ్ తీరును తప్పుపడుతూ కర్ణాటక మంత్రులు విమర్శలు గుప్పిస్తున్నారు.
కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్, ఐటీ మంత్రి ప్రియాంక్ ఖర్గే పరోక్షంగా ఏపీ మంత్రి లోకేశ్ ను తప్పుపడుతూ కౌంటర్ అటాక్ చేశారు. అయినప్పటికీ లోకేశ్ తగ్గేదేలే అన్నట్లు కర్ణాటక మంత్రులతో ఎక్స్ లో ట్వీట్ వార్ కొనసాగిస్తున్నారు. దీంతో రెండు రాష్ట్రాల మధ్య సంబంధాలు దెబ్బతింటాయేమోనన్న టెన్షన్ మొదలైంది. అసలే కన్నడ స్వాభిమానం ఎక్కువగా ఉండే కన్నడిగులు లోకేశ్ చర్యల వల్ల ఆందోళనలకు దిగితే.. ఆ రాష్ట్రంలో ఎక్కువగా ఉన్న ఆంధ్రా వాసులకు ఇబ్బందులు తలెత్తే ప్రమాదం ఉందని పరిశీలకులు భయాందోళన వ్యక్తం చేశారు. అయితే ఇక్కడే డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఎంట్రీ ఇచ్చి కర్ణాటక వాసులను ఆకర్షించేలా ప్రయత్నాలు చేస్తున్నారని ప్రశంసలు అందుకుంటున్నారు.
లోకేశ్ ఎప్పుడూ చెప్పినట్లుగా పవన్ పెద్దన్న పాత్రలో పూర్తిగా ఇమిడిపోయి కర్ణాటకతో మెరుగైన సంబంధాలు కొనసాగించేందుకు ఆసక్తి చూపినట్లు మాట్లాడారని అంటున్నారు. రిటైర్డ్ జస్టిస్ గోపాల గౌడ జన్మదిన వేడుకలకు హాజరైన పవన్ కన్నడంలో మాట్లాడటమే కాకుండా, రెండు రాష్ట్రాల మధ్య సారూప్యతలను తన ప్రసంగంలో హైలెట్ చేశారు. అదేవిధంగా కోలార్, చిక్కబళ్లాపుర ప్రాంతాల్లో తాగునీటి సమస్య పరిష్కారానికి చొరవ తీసుకుంటానని హామీ ఇచ్చారు. అదేవిధంగా రాష్ట్రంలో ఏనుగుల దాడులను ఎదుర్కొనేందుకు కుంకీ ఏనుగులను పంపి రాష్ట్ర ప్రభుత్వం సహకరించిందని గుర్తు చేశారు.
ఒక వైపు లోకేశ్ కర్ణాటక మంత్రులను రెచ్చగొట్టేలా ట్వీట్ వార్ చేస్తుంటే, పవన్ వారిని ప్రసన్నం చేసుకునేలా వ్యవహరిస్తూ వివాదం పెద్దది కాకుండా నిలువరించారని చెబుతున్నారు. కుంకీ ఏనుగులు ఇచ్చి కర్ణాటక తమకు సహకరించిందని చెప్పడం ద్వారా ఆ రాష్ట్ర ప్రభుత్వంపై తమ ప్రభుత్వానికి కృతజ్ఞత ఉందని పవన్ చాటిచెప్పడం రాజకీయ వ్యూహమే అంటున్నారు. ఒక మంత్రి వర్గ సహచరుడిగా కూటమిలో పెద్దగా పవన్ పరిస్థితిని చక్కదిద్దడం చూస్తే ఒకవైపు అభివృద్ధి కోసం పరిశ్రమలను స్వాగతిస్తున్న లోకేశ్ ను వెనకేసుకొస్తూనే పక్క రాష్ట్రంతో వివాదం ముదరకుండా ఓ ట్రబుల్ ష్యూటర్ లా పరిస్థితిని చక్కదిద్దారని అంటున్నారు. నిజానికి వంద శాతం బీజేపీ అనుకూల రాజకీయాలు చేస్తున్న పవన్ కాంగ్రెస్ ప్రభుత్వంతో ఇంత సామరస్యాన్ని కోరుకోవడం కూడా రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చకు కారణమవుతోంది.
