ఏపీకి పెట్టుబడులు...సీక్రెట్ చెప్పిన లోకేష్
ఏపీకి సంబంధించి పెట్టుబడులు పెట్టేందుకు వచ్చే ఏ పరిశ్రమకు అయినా ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రభుత్వం చూస్తుందని లోకేష్ అన్నారు.
By: Satya P | 21 Oct 2025 1:00 AM ISTఏపీకి పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తున్నాయి. టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత పెట్టుబడుల మీద పెద్ద ఎత్తున ఫోకస్ పెట్టింది. ఏపీ ఒక విధంగా వ్యవసాయిక రాష్ట్రం. దాంతో విభజన ఏపీలో పారిశ్రామిక వాతావరణం నెలకొల్పేందుకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తోంది. ఈ నేపధ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు మంత్రి నారా లోకేష్ ఈ విషయంలో పోటీ పడుతున్నారు. ప్రస్తుతం ఆస్ట్రేలియా పర్యటనలో లోకేష్ ఉన్నారు. ఆయన అనేక మంది పారిశ్రామికవేత్తలను కలుస్తున్నారు. ఏపీలో పెట్టుబడులు పెట్టాలని కోరుతున్నారు. ఈ సందర్భంగా ఆయన చేసిన కొన్ని వ్యాఖ్యలు ఆసక్తికరంగా ఉన్నాయి.
మూడు రీజన్స్ తోనే :
ఏపీకి గడచిన పదహారు నెలల కాలంలో పదహారు లక్షల కోట్ల పెట్టుబడులు ఏపీకి ఎలా వచ్చాయో లోకేష్ సిడ్నీలోని న్యూసౌత్‌వేల్స్ పార్లమెంట్ ప్రాంగణంలో ఆస్ట్రేలియా ఇండియా బిజినెస్ కౌన్సిల్ ప్రతినిధులకు వివరించారు. ఈ సందర్భంగా జరిగిన రోడ్‌షోలో కూడా ఆయన పాల్గొన్నారు. ఇంతకీ లోకేష్ ఏమన్నారు అంటే మూడే మూడు బలమైన కారణాలు ఏపీకి భారీ పెట్టుబడులు వచ్చేలా చేస్తున్నాయని చెప్పారు. ఏపీకి చంద్రబాబు రూపంలో విజనరీ లీడర్ షిప్ ఉందని అది మొదటి కారణం అన్నారు. బాబు వయసు ఏడున్నర పదులు అయినా ఆయన నవ యువకుడు అని ఆయన ఎంతో కష్టపడతారని ఏపీకి తీర్చిదిద్దాలని ఆయన పట్టుదలగా పనిచేస్తున్నారు అని చెప్పారు. ఆయన దీక్షా దక్షతలే ఏపీకి పెట్టుబడులు వచ్చేలా చేస్తున్నాయని చెప్పారు.
రికార్డ్ స్థాయిలో క్లియరెన్స్ :
ఏపీకి సంబంధించి పెట్టుబడులు పెట్టేందుకు వచ్చే ఏ పరిశ్రమకు అయినా ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రభుత్వం చూస్తుందని లోకేష్ అన్నారు. వారితో ఒప్పందం కుదిరిన తరువాత అతి తక్కువ సమయంలోనే గ్రౌండింగ్ అయ్యేలా చర్యలు తీసుకోవడం జరుగుతుందని చెప్పారు. ఏపీని ఈజ్ ఆవ్ డూయింగ్ నుంచి స్పీడ్ ఆఫ్ డూయింగ్ గా మార్చి పెట్టుబడుల వరదకు కొత్త దారులు వెతుకుతున్నామని లోకేష్ చెప్పారు. గూగుల్ డేటా సెంటర్ ఇందుకు ఉదాహరణ అని చెప్పారు. విశాఖలో డేటా సెంటర్ ని ఏర్పాటు చేయాలని నిర్ణయించామని కేవలం పదమూడు నెలల వ్యవధిలోనే ఈ ప్రాజెక్ట్ రాబోతోంది అంటే దానికి ప్రభుత్వం తీసుకున్న వేగవంతమైన నిర్ణయాలు కారణం అన్నారు.
వాట్సప్ గ్రూప్ ద్వారా :
ఏపీలో ఏ ప్రాజెక్టులు వస్తున్నాయన్న దాని మీద ఒక వాట్సప్ గ్రూప్ ని పెట్టుకుని ఎప్పటికి అపుడు ఆయా ప్రాజెక్టుల పురోగతిని ప్రభుత్వం పూస్తి స్థాయిలో సమీక్షిస్తుందని లోకేష్ చెప్పారు. ఒక సంస్థ పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వచ్చినపుడు సదరు సంస్థకు సంబంధించి ఒక వాట్సాప్ గ్రూప్‌ను క్రియేట్ చేస్తామని చెప్పారు. అలాగే తన కార్యాలయంతో పాటు సంబంధిత మంత్రులు, అధికారులు ఈ గ్రూప్ లో ఉంటారని చెప్పారు. ఆ మీదట ఆయా ప్రాజెక్ట్ గురించే ప్రతీ రోజూ సమీక్ష జరుగుతుందని చెప్పారు. ఇలా ప్రస్తుతం ఏపీలో పాతికకు పైగా వాట్సాప్ గ్రూపులు నడుస్తున్నాయని చెప్పరు. ఇక ఈ ప్రాజెక్టుల గురించిన అప్‌డేట్ రాకపోతే తానే స్వయంగా రంగంలోకి దిగుతాను అని పూర్తిగా జోక్యం చేసుకుని స్టేటస్ అడుగుతానని లోకేష్ పారిశ్రామికవేత్తలకు చెప్పుకొచ్చారు.
యూత్ కేబినెట్ :
ఇక ఏపీకి మరో బలం యూత్ కేబినెట్ అని లోకేష్ చెప్పారు మొత్తం పాతిక మంది మంత్రులు ఉంటే అందులో 17 మంది దాకా యువ మంత్రులే ఉన్నారని ఆయన వివరించారు. వీరంతా ఏపీ అభివృద్ధి కోసం విశేషంగా కృషి చేస్తున్నారు అన్నారు. ఏపీ ఈ రోజున ఆకలితో ఉందని పెట్టుబడులు పెట్టాలని కోరుతోందని అన్ని రకాలుగా సహకరించే ప్రభుత్వం ఉందని ఈ అవకాశాలను అందిపుచ్చుకోవాలని సిడ్నీ రోడ్ షోలో లోకేష్ కోరారు.
