Begin typing your search above and press return to search.

ఏపీ కొత్త ఇన్‌ఫ్లుయెన్సర్ పాలసీ : నెలకు రూ.1.50 లక్షల వరకు సంపాదించొచ్చు!

ఈ మేరకు బుధవారం మంత్రివర్గ సమావేశం ముగిసిన వెంటనే ఇందుకు సంబంధించిన ఉత్తర్వులు విడుదలయ్యాయి.

By:  Tupaki Political Desk   |   24 Sept 2026 10:26 AM IST
ఏపీ కొత్త ఇన్‌ఫ్లుయెన్సర్ పాలసీ : నెలకు రూ.1.50 లక్షల వరకు సంపాదించొచ్చు!
X

ఏపీ ప్రభుత్వం కొత్తగా తీసుకువస్తున్న ఇన్‌ఫ్లుయెన్సర్ల పాలసీపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఈ విధానం వల్ల ప్రభుత్వ కార్యక్రమాలకు మరింత విస్తృతమైన ప్రచారం చేసుకోవచ్చుననే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇదే సమయంలో రాష్ట్రంలోని టాలెంటెడ్ కంటెంట్ క్రియేటర్లకు ఆర్థిక ప్రయోజనం కల్పించినట్లు అవుతుందని అంటున్నారు. సంప్రదాయ మీడియాకు సమానంగా డిజిటల్ మాధ్యమాలను కూడా వాడుకుని ప్రభుత్వ విధానాలను ప్రచారం చేయాలని భావించిన ప్రభుత్వం కంటెంట్ క్రియేటర్ల ప్రతిభకు తగిన విధంగా పారితోషికం చెల్లించాలని నిర్ణయించింది. ఈ మేరకు బుధవారం మంత్రివర్గ సమావేశం ముగిసిన వెంటనే ఇందుకు సంబంధించిన ఉత్తర్వులు విడుదలయ్యాయి.

ప్రభుత్వ కార్యక్రమాలకు డిజిటల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లను వాడుకోవాలనే ఆలోచన రాష్ట్రాల జాబితాలో ఏపీ కూడా ఇప్పుడు చేరింది. ఇంతకుముందు దేశంలో ఈ విధానాలను ఆరు రాష్ట్రాల్లో అమలు చేస్తున్నట్లు చెబుతున్నారు. ముందుగా ఉత్తరప్రదేశ్ లో ఈ విధానం అమలులోకి తీసుకువచ్చారని అంటున్నారు. ప్రభుత్వ కార్యక్రమాలకు యూట్యూబర్లు, డిజిటల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లకు నగదు చెల్లించే విధానం ఈ రాష్ట్రంలో ప్రవేశపెట్టారని అంటున్నారు. అక్కడ సత్ఫలితాలు రావడంతో ఆ తర్వాత రాజస్థాన్, గోవా, బిహార్, మహారాష్ట్ర, పంజాబ్ ల్లో అమలు చేస్తున్నారని అంటున్నారు. ఈ జాబితాలో ఇప్పుడు ఏపీ కూడా చేరడం విశేషంగా చెబుతున్నారు.

ఇక ఇన్‌ఫ్లుయెన్సర్లను గుర్తించడం, వారి కంటెంట్ కు చెల్లింపులు చేయడంపై ప్రభుత్వం కొన్ని నిబంధనలు తీసుకువచ్చింది. ప్రభుత్వ పథకాలకు ప్రచారం చేయాలని భావించేవారు ముందుగా ఏపీ డిజిటల్ కార్పొరేషన్ లో తమ పేర్లు నమోదు చేసుకోవాల్సివుంటుంది. దీనికోసం ప్రభుత్వం కొత్తగా యాప్ తీసుకురావాలని నిర్ణయించింది. వ్యూస్, కంటెంట్ ఆధారంగా ఇన్‌ఫ్లుయెన్సర్ల పేర్లను నమోదు చేసిన తర్వాత గుర్తింపు కార్డులను జారీ చేస్తారు. ఆ తర్వాత ప్రభుత్వం చెప్పిన కంటెంట్ ను వీరు చేయాల్సివుంటుందని అంటున్నారు.

ఇందుకోసం ఇన్‌ఫ్లుయెన్సర్లను నాలుగు కేటగిరీలుగా విభజించారు. పది వేల మంది ఫాలోవర్లు ఉన్నవారిని డి కేటగిరీలో పెట్టారు. ఆ తర్వాత వివిధ కేటగిరీల వారీగా ఇన్‌ఫ్లుయెన్సర్లను విభజించారు. పదివేల ఫాలోవర్లు ఉన్నవారు చేసే వీడియోలకు రీచ్ ఆధారంగా రూ.500 నుంచి రూ.750 వరకు చెల్లిస్తారు. అదే కంటెంట్ క్రియెటర్లు సొంతంగా తయారు చేసుకుంటే రూ.2,500 వరకు చెల్లిస్తారు. ఇక ఎక్కువ ఫాలోవర్లు ఉణ్నవారికి ప్రభుత్వమే వీడియోలు ఇస్తే రూ.1,500 నుంచి రూ.2000 వేలు, వారు సొంతంగా వీడియో తయారు చేస్తే రూ.15 వేలు వరకు చెల్లిస్తారు.

ఇలా ఒక్కొక్కరు గరిష్టంగా నెలకు రూ. 1.50 లక్షలు వరకు సంపాదించే అవకాశం కల్పించారు. 18 ఏళ్ల వయసు నుంచి ఆపై వారు తమ పేర్లు నమోదు చేసుకోవచ్చునని ప్రభుత్వం తెలిపింది. వ్యక్తిగత, సమాచార ఖాతాలకే అవకాశం కల్పిస్తారు. సంస్థల పేరిట ఖాతాలకు అవకాశంలేదని చెబుతున్నారు. దరఖాస్తుదారిడి గత 60 పోస్టులను నిశితంగా గమనిస్తారు. అసభ్యత, ద్వేషపూరిత ప్రసంగాలు, దేశ వ్యతిరేక లేదా మత విద్వేష కంటెంట్ తప్పుడు సమాచాం ఉండకూడదని ప్రభుత్వ నిబంధనలు స్పష్టం చేస్తున్నాయి. ఎంప్యానెల్ అయ్యాక నిబంధనలు ఉల్లంఘిస్తే బ్లాక్ లిస్టులో చేర్చుతారు. ఎంపికైన వారితో ఏడాది వరకు ఒప్పందం కుదుర్చుకుంటారు. పనితీరు ఆధారంగా మరో రెండేళ్ల వరకు పొడిగించే అవకాశం ఉంటుందని చెబుతున్నారు.