Begin typing your search above and press return to search.

ఏపీ ఐఏఎస్ అధికారులపై నిఘా.. ప్రభుత్వానికి షాకింగ్ అప్డేట్

ప్రస్తుతం అప్రధాన్య పోస్టులో ఉన్నప్పటికీ ఆ ఐఏఎస్ అధికారిని బదిలీ చేయడంపై ఉన్నతాధికార వర్గాల్లో విస్తృత చర్చ జరుగుతోంది.

By:  Tupaki Political Desk   |   22 March 2026 12:02 PM IST
ఏపీ ఐఏఎస్ అధికారులపై నిఘా.. ప్రభుత్వానికి షాకింగ్ అప్డేట్
X

ఏపీలో పలువురు ఐఏఎస్ అధికారులపై ప్రభుత్వం నిఘా ఉంచిందనే ప్రచారం అధికార వర్గాల్లో తీవ్ర చర్చకు దారి తీస్తోంది. కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా, విపక్షానికి అనుకూలంగా పనిచేసేందుకు కొందరు ఐఏఎస్ అధికారులు జట్టు కట్టారని, ఓ రిటైర్డ్ ఐఏఎస్ అధికారి వీరిని కో-ఆర్డినేట్ చేస్తున్నారని కొన్ని రోజులుగా పత్రికల్లో కథనాలు వస్తున్నాయి. తాడేపల్లి, హైదరాబాద్ ల్లో ఇప్పటికే రెండు సమావేశాలు జరిగినట్లు ఆ కథనాల్లో పేర్కొన్నారు. దీనిపై ప్రభుత్వం రహస్య విచారణ చేపట్టినట్లు, ఇందుకు బాధ్యుడిగా అనుమానిస్తూ ఓ ఐఏఎస్ అధికారిని బదిలీచేస్తూ నిర్ణయం తీసుకున్నట్లు జరుగుతున్న ప్రచారం హీట్ పుట్టిస్తోంది.

గత ప్రభుత్వంలో కీలక పోస్టుల్లో పనిచేసిన ఐఏఎస్ అధికారులను కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే అప్రధాన్య పోస్టుల్లో నియమించారని చెబుతున్నారు. దీంతో కొందరు అధికారులు తమ స్థాయికి తగ్గ పోస్టు ఇవ్వలేదని అసంతృప్తితో ఉన్నట్లు వ్యాఖ్యానిస్తున్నారు. దీనిని గుర్తించిన విపక్ష పార్టీ తమ హయాంలో కీలకంగా పనిచేసిన రిటైర్డ్ అధికారిని రంగంలోకి దింపి అసంతృప్త అధికారులతో టచ్ లోకి వెళ్లినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ సమాచారం ప్రభుత్వానికి చేరడంతో అలర్ట్ అయిందని, ప్రభుత్వంపై అసంతృప్తితో ఉన్న అధికారుల సమాచారం తెప్పించుకుందని అంటున్నారు.

నిజానికి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే గత ప్రభుత్వంలో కీలక బాధ్యతలు చూసిన అఖిల భారత సర్వీసు అధికారులలో కొందరిని పక్కన పెట్టింది. ఇలాంటి వారిలో ఐపీఎస్ అధికారులు ఎక్కువగా ఉండగా, ఐఏఎస్ ల సంఖ్య కాస్త తక్కువగానే చెబుతున్నారు. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డికి అత్యంత సన్నిహితురాలిగా ప్రచారంలో ఉన్న సీనియర్ ఐఏఎస్ అధికారిని వై.శ్రీలక్ష్మికి ఇప్పటివరకు పోస్టింగ్ ఇవ్వలేదు. అదేవిధంగా దాదాపు 16 మంది ఐపీఎస్ అధికారులను వీఆర్ లో పెట్టారు. అయితే తాజాగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా సమావేశం నిర్వహించారనే ప్రచారంతో ఓ కంఫర్డ్ ఐఏఎస్ ను గుర్తించి ఆయనను బదిలీ చేశారు. జీఏడీకి రిపోర్టు చేయాలని ఆదేశించారు.

ప్రస్తుతం అప్రధాన్య పోస్టులో ఉన్నప్పటికీ ఆ ఐఏఎస్ అధికారిని బదిలీ చేయడంపై ఉన్నతాధికార వర్గాల్లో విస్తృత చర్చ జరుగుతోంది. ఈ ఎపిసోడ్ తో ప్రభుత్వం తమపై నిఘా ఉంచిందని అనుమానిస్తున్నారు. అయితే ఇలాంటి నిఘా వల్ల తాము స్వేచ్ఛగా పనిచేయలేని వాతావరణం ఏర్పడుతోందని పలువురు అధికారులు వ్యాఖ్యానిస్తున్నారు. తమకు వ్యతిరేకంగా ఎవరో, ఏదో చెబితే ప్రభుత్వం వాటిని గుడ్డిగా నమ్మేస్తోందని అఖిల భారత సర్వీసు అధికారులు మదనపడుతున్నారని చెబుతున్నారు. ఇదే సమయంలో సీఎంవోలో ఓ అధికారి తోటి అధికారులతో అమర్యాదగా వ్యవహరిస్తున్నా చర్యలు తీసుకోవడం లేదని ఆరోపిస్తున్నారు.

దీంతో ప్రభుత్వంలో అఖిల భారత సర్వీసు అధికారుల పనితీరుపై హాట్ డిబేట్ జరుగుతోంది. ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో కరవ మంటే కప్పకు కోపం, విడవమంటే పాముకు కోపం అన్నట్లు తమ పరిస్థితి తయారైందని వాపోతున్నారు. ఎప్పుడు ఎవరికి కోపం వస్తోందో? ఏ కారణంతో తాము బలైపోవాల్సివస్తుందోనని ఐఏఎస్ అధికారులు టెన్షన్ పడుతున్నారని చెబుతున్నారు. దీనివల్ల సమర్థంగా పనిచేయలేకపోతున్నామని పలువురు అధికారులు వ్యాఖ్యానిస్తున్నారు. మొత్తానికి అధికార, ప్రతిపక్షాల మధ్య టామ్ అండ్ జెర్రీలా సాగుతున్న పోరాటంలో అధికారులు సతమతమవుతున్నారని అంటున్నారు.