'పరకామణి' జోలికి మనుషులు వెళ్లొద్దు: హైకోర్టు కీలక ఆదేశం
తక్షణమే ఏఐ ఆధారిత సాంకేతికతను వినియోగించి.. పరకామణి నగదు లెక్కింపు చర్యలు చేపట్టాలని టీటీడీ బోర్డు, ఆలయ కార్యనిర్వహణాధికారికి ఆదేశాలు జారీ చేసింది.
By: Garuda Media | 19 Dec 2025 5:15 PM ISTతిరుమల శ్రీవారి పరకామణి హుండీ లెక్కింపు విషయంపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. శ్రీవారికి భక్తులు సమర్పించే కానుకలను మాన్యువల్‌గా చేపట్టడానికి వీల్లేదని తేల్చి చెప్పింది. ``ప్రస్తుతం బ్యాంకులే.. ఏఐ వినియోగించి నగదును లెక్కిస్తున్నాయి. గురుద్వారాల్లోనూ ఈ తరహా ఏర్పాట్లు ఉన్నట్టు ఇటీవల మా దృష్టికి వచ్చింది. వాటికంటే కూడా నిత్యం కోట్ల రూపాయలు.. భక్తులు శ్రీవారికి కానుకలు సమర్పిస్తున్నారు. ఈ నేపథ్యంలో పరకామణి విషయంలో మనుషుల ప్రమేయం ఇక నుంచి వద్దు`` అని తేల్చి చెప్పింది.
తక్షణమే ఏఐ ఆధారిత సాంకేతికతను వినియోగించి.. పరకామణి నగదు లెక్కింపు చర్యలు చేపట్టాలని టీటీడీ బోర్డు, ఆలయ కార్యనిర్వహణాధికారికి ఆదేశాలు జారీ చేసింది. అంతేకాదు.. నగదు లెక్కింపు విషయంలో నాలుగు దశలను పాటించాలని సూచించింది. 1) పరకామణికి సీలు వేయడం 2) సంబంధిత అధికారుల వివరాలు తీసుకుని వారి సమక్షంలో వీడియో గ్రఫీ చేస్తూ.. పరకామణి సీలును విప్పడం. 3) ఏఐ ఆధారిత సాంకేతికతతో నగదును లెక్కించడం. 4) విదేశీ కరెన్సీని గుర్తించేందుకు వేరే సాంకేతికతను వినియోగించడం. అదేవిధంగా బంగారం, వెండి, వజ్రాలు వంటివాటిని వేరు చేసేందుకు మరింత సాంకేతికతను వినియోగించడం.
ఈ నాలుగు దశలను తక్షణమే అమలు చేయగలరా? అని టీటీడీ తరఫు న్యాయవాదిని హైకోర్టు ప్రశ్నిం చింది. అయితే.. ఇప్పటికిప్పుడు అంత సాంకేతికత లేదని చెప్పడంతో 8 వారాల్లో ఏర్పాటు చేయాలని ఆదేశించింది. అయితే.. తక్షణమే మనుషుల ప్రమేయాన్ని తగ్గించాలని సూచించింది. దొంగతనాలను అరికట్టే బాధ్యత బోర్డు, ఈవోలపైనే ఉందన్న హైకోర్టు.. దీనికి గాను ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారో.. కోర్టుకురెండు వారాల్లో లిఖిత పూర్వకంగా చెప్పాలని ఆదేశించింది.
ఎందుకిలా?
వైసీపీ హయాంలో 2020-21 మధ్య పరకామణిలో 900 డాలర్ల దొంగతనం జరిగింది. రవి కుమార్ అనే ఉద్యోగి వీటిని దొంగలించాడు. ఆ వెంటనే లోక్ అదాలత్‌తో రాజీ చేసుకుని 14 కోట్ల విలువైన ఆస్తిని శ్రీవారికి ఇచ్చాడు. అయితే.. శ్రీవారి కానుకల దొంగతనం తీవ్ర నేరమని.. ఎలా రాజీ చేస్తారని ప్రశ్నించిన హైకోర్టు.. సదరు ఆస్తులు ఆయనకు ఎలా వచ్చాయో చెప్పాలని విచారణకు ఆదేశించింది. ఈ క్రమంలోనే తాజాగా మరోసారి కీలక ఉత్తర్వులు జారీ చేసింది.
