ఏపీలో పోలీసు వ్యవస్థను మూసేయండి: హైకోర్టు షాకింగ్ కామెంట్స్
పరకామణి డిప్యూటీ ఈవో సీవీ రవికుమార్ డాలర్ల రూపంలో పెద్దఎత్తున నగదు, బంగారాన్ని అపహరించారు. దీని విలువ కోటి రూపాయలకు పైగానే ఉంది.
By: Garuda Media | 14 Oct 2025 9:27 AM ISTఏపీ పోలీసులపై తరచుగా సీరియస్ వ్యాఖ్యలు చేస్తున్న హైకోర్టు.. తాజాగా సోమవారం మరింత ఆగ్రహంతో మండిపడింది. ఏపీ లో పోలీసు వ్యవస్థను మూసేయాలని.. డీజీపీ నిద్ర పోతున్నారా? అని తీవ్రంగా స్పందించింది. తిరుమల తిరుపతి దేవస్థానంలో వైసీపీ హయాంలో జరిగిన ఓ వ్యవహారానికి సంబంధించి సదరు ఫైళ్లు, కేసుల దస్త్రాలను సీజ్ చేసి తమకు ఇవ్వాలన్న కోర్టు ఆదేశాలను పోలీసులు పెడచెవిన పెట్టారని హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇది పూర్తిగా డీజీపీ నిర్లక్ష్యమని పేర్కొంది. తాము ఇచ్చిన ఆదేశాలను పోలీసులు అమలు చేయకపోవడం నిప్పులు చెరిగింది. ``రాష్ట్రంలో పోలీస్ శాఖను మూసివేయడం మంచిది. డీజీపీ నిద్రపోతున్నారు.`` అని ఘాటు వ్యాఖ్యలు చేసింది.
అసలు ఏం జరిగింది?
2023లో( వైసీపీ ప్రభుత్వ హయాం) తిరుమల తిరుపతి దేవస్థానం పరకామణిలో రూ. కోట్ల కుంభకోణం జరిగింది. దీనికి సంబంధించిన వీడియోలు ఇటీవల కూడా హల్చల్ చేశాయి. అయితే.. కుంభకోణం పై సీఐడీతో దర్యాప్తు జరిపించాలని ఓ జర్నలిస్టు.. టీటీడీ ఈవోకు వినతి పత్రం ఇవ్వగా.. ఆయన దానిని పట్టించుకోలేదు. దీంతో జర్నలిస్టు నేరుగా హైకోర్టును ఆశ్రయించారు. గత ఏడాది సెప్టెంబర్ 10న ఇచ్చిన వినతిని పరిగణనలోకి తీసుకొని నిర్ణయం వెల్లడించేలా టీటీడీ ఈవోను ఆదేశించాలని కోరారు. ఇదేసమయంలో అసలు పరకామణిలో ఏం జరిగిందో వివరించారు.
పరకామణి డిప్యూటీ ఈవో సీవీ రవికుమార్ డాలర్ల రూపంలో పెద్ద ఎత్తున నగదు, బంగారాన్ని అపహరించారు. దీని విలువ కోటి రూపాయలకు పైగానే ఉంది. దీనిని అప్పటి అసిస్టెంట్ విజిలెన్స్ సెక్యూరిటీ అధికారి గుర్తించి పోలీస్టేషన్లో ఫిర్యాదు చేశారు. దర్యాప్తు పూర్తి చేసి పోలీసులు ఛార్జీషీట్ దాఖలు చేశారు. అయితే.. తర్వాత అదే ఏడాది సెప్టెంబర్ 9న లోక్ అదాలత్ లో నిందితుడు రవికుమార్ రాజీ చేసుకున్నారు. ఆ తర్వాత కూటమి సర్కారు వచ్చిన నేపథ్యంలో దీనిపై విచారణ చేయాలని ఈవోను కోరగా ఆయన పట్టించుకోలేదు.
ఈ వివరాలను కోర్టుకువెల్లడించారు. దీనిపై గత నెల్లోనే స్పందించిన హైకోర్టు.. పరకామణి నుండి నగదు అపహరణ విషయంలో ఇచ్చిన ఫిర్యాదును లోక్అదాలత్ వద్ద రాజీ చేసుకోవడాన్ని తప్పుపట్టింది. ఈ కేసుతో ముడిపడి ఉన్న తిరుమల 1వ పట్టణ పోలీస్ స్టేషన్ రికార్డులు, లోక్ అదాలత్ ప్రొసీడింగ్స్, టీటీడీ బోర్డు తీర్మానాలు, ఈ కేసుతో సంబంధం ఉన్న ప్రొసీడింగ్స్ ను తక్షణం స్వాధీనం చేసుకోవాలని, వాటిని సీల్డ్ కవర్ లో కోర్టు ముందు ఉంచాలని గత నెల్లో పోలీసులను ఆదేశించింది. అయితే.. ఈ విషయంలో సీఐడీ ఐజీ పోస్టు లేదని.. అందుకే స్వాధీనం చేసుకోలేదని.. పోలీసులు తాజాగా కోర్టుకు చెప్పడంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన కోర్టు పోలీసు శాఖను మూసేయాలని వ్యాఖ్యానించింది. అనంతరం.. కొంత సర్దుమణిగిన తర్వాత.. ఈ దఫా విచారణకు రికార్డులు సమర్పించాలని ఆదేశించింది.
