అంబటి ఫ్యామిలీకి రక్షణ.. హైకోర్టు ఆదేశం
వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు కుటుంబానికి భద్రత కల్పించాలని ఏపీ హైకోర్టు పోలీసులను ఆదేశించింది.
By: Garuda Media | 2 Feb 2026 10:15 AM ISTవైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు కుటుంబానికి భద్రత కల్పించాలని ఏపీ హైకోర్టు పోలీసులను ఆదేశించింది. ఈ మేరకు ఆదివారం రాష్ట్ర డీజీపీకి ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం నెలకొన్న ఉద్రిక్తతలపై ఆరా తీసిన హైకోర్టు.. శాంతి భద్రతలు అదుపులోకి వచ్చే వరకు.. అంబటి కుటుంబానికి భద్రత కల్పించాలని పేర్కొంది. అయితే.. ప్రస్తుతం శాంతి భద్రతలు అదుపులో కి వచ్చాయని.. అంబటి నివాస ప్రాంతం అంతా ప్రశాంతంగానే ఉందని పోలీసుల తరఫు న్యాయ వాది కోర్టుకు విన్నవించారు. ఈ వాదనలతో ఏకీభవించిన కోర్టు.. అయితే, మరో 24 గంటల వరకు భద్రత కల్పించాలని ఆదేశించారు.
శనివారం.. అంబటి రాంబాబు సీఎం చంద్రబాబుపై దుర్భాషలాడిన విషయం తెలిసిందే. దీనిపై టీడీపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఈ క్రమంలోనే పెద్ద ఎత్తున దుమారం రేగింది. అంబటి క్షమాపణలు చెప్పాలంటూ.. టీడీపీశ్రేణులు డిమాండ్ చేస్తూ.. ఆయన ఇంటిని, కార్యాలయాన్ని ముట్టడించారు. ఇది ఉద్రిక్తతలకు దారితీసింది. చివరకు ఆందోళన కారులు అంబటి నివాసాని కి నిప్పు పెట్టారు. ఈ పరిణామాల నేపథ్యంలో అంబటి సతీమణి విజయలక్ష్మి.. హైకోర్టును ఆశ్రయించి.. హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. తమ కుటుంబానికి రక్షణ కల్పించాలని కోరారు. తనను.. తన పిల్లలను కూడా 8 గంటల పాటు నిర్బంధించా రని ఆమె పిటిషన్‌లో వివరించారు.
ఈ పిటిషన్‌పై ఆదివారం విచారణ జరిపిన కోర్టు పైవిధంగా తీర్పు వెలువరించింది. మరోవైపు.. పోలీసుల అదుపులో ఉన్న అంబ టిని సోమవారం కోర్టులో ప్రవేశ పెట్టనున్నట్టు తెలిసింది. ఆదివారం కూడా ఆయన గుంటూరు జిల్లా నల్లపాడు పోలీసుల అదుపు లోనే ఉన్నారు. పోలీసులు ఆయనను విచారిస్తున్నట్టు తెలిసింది. సీఎంను దూషించడం, సమాజంలో అశాంతిని ప్రేరేపించడం.. కార్యకర్తలను రెచ్చగొట్టడం, పోలీసుల విధులకు ఆటంకం కలిగించడం వంటి సెక్షన్ల కింద పోలీసులు అంబటిపై కేసులు నమోదు చేశారు. అయితే.. తాను బెయిల్‌కు అప్లయ్ చేయనని అంబటి ప్రకటించిన నేపథ్యంలో సోమవారు కోర్టులో ఏం జరుగుతుంది? ఆయన ఎలా రియాక్ట్ అవుతారు? అనేది ఆసక్తిగా మారింది.
