సంక్రాంతి పందెం కోడి కి కళ్ళెం...మ్యాటర్ వెరీ సీరియస్
దీంతో ప్రతీ ఏటా పండుగ వేళ జూదాలు పందాలు వద్దు అని చట్ట ప్రకారం చెబుతూ వస్తున్నారు. ఆచరణలో ఏ మేరకు అవి అమలు అవుతున్నాయన్నది పెద్ద ప్రశ్నగా ఉంది.
By: Satya P | 11 Jan 2026 5:03 PM ISTపందెం కోడి ఎపుడూ దూకుడుగా ఉంటుంది. దానిని ఆపడం ఎవరి తరమూ కాదు, నిజానికి చూస్తే నిబంధనల ప్రకారం పందేలు వేయకూడదు, జూదాలు ఆడరాదు, కానీ పెద్ద పండుగ తెలుగు వారి లోగిలిలో సంక్రాంతి పండుగ అంటేనే కోడి పందేలు చాలా సాధారణం అని చెబుతూ ఉంటారు. అలా చట్టం ఒక వైపు ఉంటే ఉత్సాహం సంప్రదాయం మరో వైపు ఉన్నాయి. దీంతో ప్రతీ ఏటా పండుగ వేళ జూదాలు పందాలు వద్దు అని చట్ట ప్రకారం చెబుతూ వస్తున్నారు. ఆచరణలో ఏ మేరకు అవి అమలు అవుతున్నాయన్నది పెద్ద ప్రశ్నగా ఉంది.
హైకోర్టు ఉత్తర్వులు :
ఏపీలో సంక్రాంతి పండుగ వేళ కోడి పందేలు నిర్వహించడం మీద ఏపీ హైకోర్టు తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. పేకాటను కానీ కోడి పందేలను కానీ పూర్తిగా అడ్డుకోవాలని కోరింది. ఎక్కడా వాటి నిర్వహణ అన్నాది ఉండరాదని కూడా పేర్కొంది. ఉభయ గోదావరి జిల్లాలు, కృష్ణా గుంటూరు జిల్లాల కలెక్టర్లకు ఈ మేరకు హై కోర్టు న్యాయమూర్తి జస్టిస్ వెంకట జ్యోతిర్మయి ఆదేశిస్తూ ఉత్తర్వులు విడుదల చేశారు..
పిటిషన్ల మీద విచారణ :
పండుగ అన్నది ఉత్సాహంగా జరుపుకోవాలని అయితే సంక్రాంతి వేళ కోడి కాళ్ళకు కత్తులు కడుతూ పందేలు నిర్వహించడం ద్వారా జంతు హింస జీవ హింసకు పాల్పడుతున్నారని కొంతమంది హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. ఈ రకమైన విధానాన్ని నియంత్రించాలని కోర్తుతూ ఏకంగా 14 పిటిషన్లు కోర్టు ముందుకు వచ్చాయి. వాటిని విచారించే క్రమంలో ధర్మాసనం ఈ ఉత్తర్వులు జారీ చేసింది. చట్టాలను కఠినంగా అమలు చేయాలని హైకోర్టు జిల్లాల కలెక్టర్లు ఎస్పీలను ఆదేశించింది. అంతే కాదు గతంలో ఇచ్చిన ఆదేశాల మేరకు వాటికి అనుగుణంగా కూడా చర్యలు తీసుకోవాలని కోరింది.
ప్రజలకు అవగాహన :
కోడి పందేలు చట్ట విరుద్ధమని జనాలకు అవగాహన కల్పించాలని కూడా హైకోర్టు సూచించింది. గ్రామాలలో ఈ మేరకు ప్రచారం చేయాలని సభలు నిర్వహించి చట్టాల గురించి వారికి వివరించాలని పేర్కొన్నది. గ్రామ సభలు కూడా జరపాలని ఆదేశించింది. ఇక కోడి పందేల కోసం పెద్ద బరులు నిర్వహించి ఆటకు అంతా సిద్ధం చేస్తున్నట్లుగా తెలుస్తున్న క్రమంలో అక్కడ కోడి కత్తులను ఇతరత్రా ఉన్న పందేం సామగ్రిని కూడా స్వాధీనం చేసుకోవాలని అంతే కాదు ఎక్కడైతే కోడి పందేలు ఎక్కువగా జరుగుతాయో అక్కడ అవసరమైన పక్షంలో 144 సెక్షన్ ని విధించాలని కూడా జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించింది.
అధికారులదే బాధ్యత :
ఇక కోడి పందాలు జరిగినా చట్టాలను పరిధి దాటి ఎవరైనా వ్యవహరించినా దానికి అధికారులే బాధ్యత వహించాలని కూడా హైకోర్టు హెచ్చరించడం విశేషం. ఇలా చట్టాలు ఉన్నా వాటిని సక్రమంగా అమలు చేయడంలో తాశీల్దరులు కానీ పోలీసు అధికారులు కానీ వైఫల్యం చెందినట్లు అయితే వారి మీద క్రమశిక్షణ చర్యలు కూడా తీసుకోవచ్చు అని హైకోర్టు పేర్కొనడం విశేషం. ముందుగా గ్రామాలలో అధికారులు పోలీసులు తనిఖీలు చేపట్టాలని ఎక్కడైతే కోడి పందేల కోసం బరులు ఏర్పాట్లు చేస్తున్నారో ఆయా గ్రామాలలో పర్యటించాలని కూడా సూచించింది. ఈ తనిఖీ చేసే బృందాలలో తాశీల్దారు, ఎస్సై ర్యాంక్ కి తగ్గని పోలీసు అధికారి, జంతు సంక్షేమ బోర్డుకి చెందిన ప్రతినిధి తప్పనిసరిగా ఉండాలని పేర్కొంది.
వెరీ సీరియస్ :
మొత్తం మీద చూస్తే కోర్టు ఈసారి చాలా సీరియస్ గానే ఉంది అని అంటున్నారు. కోడి పందేలని నియంత్రించాలని కూడా గట్టి పట్టుదలతో అధికారులు పనిచేయలాని కోరుతోంది. మరి ఆ దిశగా అధికారులు సక్సెస్ అవుతారా లేదా అన్నది కొద్ది రోజులలో తెలుస్తుంది. ఏది ఏమైనా కోడి పందేలు అన్నవి సంప్రదాయం అని ఒక వైపు వాదనలు ఉంటే జంతు హింస చట్ట విరుద్ధం అని మరో వైపు అంటున్నారు చట్ట ప్రకారం యాక్షన్ తీసుకోవాలని హైకోర్టు కోరుతున్న క్రమంలో ఏమి జరుగుతుందో చూడాల్సి ఉంది.
