గ్రామకంఠం ఇళ్లకు బంపర్ ఆఫర్ : లింక్ డాక్యుమెంట్లు లేకపోయినా రిజిస్ట్రేషన్.. ఏపీ ప్రభుత్వం సరికొత్త రూల్స్!
సబ్ డివిజన్ కాకపోవడం వల్ల వారసత్వంగా వచ్చిన ఇళ్లు, ఆస్తులకు దశాబ్దాలుగా రిజిస్ట్రేషన్లు నిలిచిపోయాయని చెబుతున్నారు.
By: Tupaki Political Desk | 19 May 2026 12:50 PM ISTగ్రామ కంఠంలో ఇళ్లు, స్థలాల రిజిస్ట్రేషన్లపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఎటువంటి లింకు డాక్యుమెంట్లు లేకపోయినా స్వీయ ధ్రువీకరణ పత్రం తీసుకుని రిజిస్ట్రేషన్లు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఏపీ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం పట్ల విస్తృత చర్చ జరుగుతోంది. దశాబ్దాలుగా నిషేధిత జాబితాలో ఉండటమే కాకుండా, వారసత్వంగా వచ్చిన ఆస్తుల క్రయవిక్రయాలకు ఎదురవుతున్న సమస్యను ప్రభుత్వం ఒక్క ఉత్తర్వుతో పరిష్కరించిందని అంటున్నారు. వెబ్‌లాండ్ రికార్డుల్లో గ్రామకంఠంగా నమోదైన ఆస్తుల రిజిస్ట్రేషన్లకు లైన్ క్లియర్ చేస్తూ రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జారీ చేసిన సరికొత్త మార్గదర్శకాలతో దశాబ్దాల సమస్యకు చెక్ చెప్పినట్లైందని అంటున్నారు.
నిషేధిత జాబితాతో సంబంధం లేదు
ప్రభుత్వం జారీ చేసిన తాజా ఉత్తర్వుల ప్రకారం, వెబ్‌లాండ్ రికార్డుల్లో ఒక సర్వే నంబర్ గ్రామకంఠంగా నమోదైతే, అది సెక్షన్ 22-ఏ కింద నిషేధిత ఆస్తుల జాబితాలో ఉందా లేదా అనే అంశంతో సంబంధం లేకుండా రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేయాల్సిందేనని స్పష్టం చేసింది. గతంలో సబ్-డివిజన్ ప్రక్రియ పూర్తి కాకపోవడం వల్ల మొత్తం సర్వే నంబర్‌ను నిషేధిత జాబితాలో పెట్టడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారని ప్రభుత్వం గుర్తించింది. సబ్ డివిజన్ కాకపోవడం వల్ల వారసత్వంగా వచ్చిన ఇళ్లు, ఆస్తులకు దశాబ్దాలుగా రిజిస్ట్రేషన్లు నిలిచిపోయాయని చెబుతున్నారు. ఇప్పుడు ఆ చిక్కుముడులన్నింటినీ తొలగిస్తూ, సామాజిక అవసరాలకు కేటాయించిన భూములు మినహా మిగిలిన అన్ని వ్యక్తిగత నివాస ప్రాంతాల రిజిస్ట్రేషన్లకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని చెబుతున్నారు.
లింక్ డాక్యుమెంట్లు లేకపోయినా రిజిస్ట్రేషన్
ఈ ఉత్తర్వుల్లోని అత్యంత కీలకమైన సడలింపు ఏమిటంటే డాక్యుమెంట్ల కోసం సామాన్యులను ఇబ్బంది పెట్టకూడదని స్పష్టం చేయడం. గ్రామకంఠం పరిధిలో వారసత్వంగా వచ్చిన పాత ఇళ్లకు, స్థలాలకు ఎలాంటి లింక్ డాక్యుమెంట్లు లేకపోయినప్పటికీ నిబంధనల ప్రకారం రిజిస్ట్రేషన్ చేయాల్సిందేనని ప్రభుత్వం తేల్చిచెప్పింది. ఒక స్థలంలో ఇల్లు ఉండి, ఎలాంటి పాత దస్తావేజులు లేనప్పుడు స్థానిక సంస్థలు జారీ చేసిన ఇంటి పన్ను రశీదును ప్రామాణికంగా తీసుకుని రిజిస్ట్రేషన్ చేయాలని సూచించింది. అదేవిధంగా పట్టణ ప్రాంతాల్లో వంశపారంపర్యంగా వస్తున్న ఖాళీ స్థలాలకు లింక్ డాక్యుమెంట్లు, ఇంటి పన్ను లేకపోయినా, ఖాళీ స్థల పన్ను రశీదు ఆధారంగా రిజిస్ట్రేషన్ చేయాలని స్పష్టం చేసింది. ఇక గ్రామీణ ప్రాంతాల్లో వారసత్వంగా వస్తున్న ఖాళీ స్థలాలకు లింక్ పత్రాలు, పన్ను రశీదులు లేకుంటే సెల్ఫ్ డిక్లరేషన్ తీసుకుని రిజిస్ట్రేషన్ పూర్తిచేయాలని ప్రభుత్వం సూచించింది.
అధికారుల చుట్టూ తిరిగే పని లేదు
గ్రామకంఠంలో ఇళ్లు, ఇతర ఆస్తుల రిజిస్ట్రేషన్ల కోసం రెవెన్యూ అధికారుల వద్ద నుంచి నో అబ్జెక్షన్ సర్టిఫికెట్లు తేవాలంటూ కొనుగోలుదారులపై ఒత్తిడి చేయవద్దని, ఆ నెపంతో రిజిస్ట్రేషన్లను ఆపకూడదని సబ్-రిజిస్ట్రార్లకు ప్రభుత్వం కరాఖండిగా ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వ నిబంధనల ప్రకారం, సామాజిక సామూహిక అవసరాలకు కేటాయించిన భూములు మినహాయించి, మిగిలిన గ్రామకంఠంలోని ఇళ్లు, వారసత్వ భూములను ప్రజలు ఇకపై ఎలాంటి ఇబ్బందులు లేకుండా సులువుగా రిజిస్ట్రేషన్ చేయించుకోవచ్చునని స్పష్టం చేసింది. దశాబ్దాలుగా తమ సొంత స్థలాలపై హక్కులు లేక ఇబ్బంది పడుతున్న సామాన్యులకు ఈ నిర్ణయం ఒక పెద్ద ఊరటగా వ్యాఖ్యానిస్తున్నారు.
